Share News

నగ్నదొంగ అరెస్టు

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:08 AM

రాత్రిపూట ఒంటిపై దుస్తులు లేకుండా తిరుగుతాడు. తేలికపాటి వస్తువులను కొక్కీలుగా మార్చేశాడు. ఈ రెండు లక్షణాలు విన్న తర్వాత ఎవరైనా అతడ్ని అఘోరా గానో, ఇంజనీర్‌గానో ఊహించుకుంటారు. అతడు ఈ రెండు లక్షణాలు కలగలిపిన కరుడుగట్టిన నేరగాడు. అంతరాష్ట్ర పోలీసుల రికార్డులు అతడు చేసిన నేరాలు పేజీల కొద్దీ ఉన్నాయి. ఒక్కసారి నేరం చేసిన తర్వాత అతడు పోలీసులకు చిక్కడం చాలా కష్టం. చేతులకు సంకెళ్లు పడకుండా ఎన్నో ఎత్తులు వేసిన ఆ నేరగాడిని విజయవాడ సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్‌ డీసీపీ టి.తిరుమలేశ్వరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావుతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గురువారం వెల్లడించారు.

నగ్నదొంగ అరెస్టు

దుస్తులు లేకుండా చోరీలు

ఖాళీ స్థలాలకు పక్కన ఉన్న నివాసాలే టార్గెట్‌

సీసీఎస్‌ పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర దొంగ

రూ.26లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.లక్ష నగదు స్వాధీనం

చోరీల సొమ్ములతో విలాసవంతమైన భవన నిర్మాణం

విజయవాడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాత్రిపూట ఒంటిపై దుస్తులు లేకుండా తిరుగుతాడు. తేలికపాటి వస్తువులను కొక్కీలుగా మార్చేశాడు. ఈ రెండు లక్షణాలు విన్న తర్వాత ఎవరైనా అతడ్ని అఘోరా గానో, ఇంజనీర్‌గానో ఊహించుకుంటారు. అతడు ఈ రెండు లక్షణాలు కలగలిపిన కరుడుగట్టిన నేరగాడు. అంతరాష్ట్ర పోలీసుల రికార్డులు అతడు చేసిన నేరాలు పేజీల కొద్దీ ఉన్నాయి. ఒక్కసారి నేరం చేసిన తర్వాత అతడు పోలీసులకు చిక్కడం చాలా కష్టం. చేతులకు సంకెళ్లు పడకుండా ఎన్నో ఎత్తులు వేసిన ఆ నేరగాడిని విజయవాడ సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్‌ డీసీపీ టి.తిరుమలేశ్వరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావుతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గురువారం వెల్లడించారు.

చిన్నతనం నుంచి దొంగతనాలు

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కంచర్ల మోహనరావు ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతనంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వివిధ నేరాల్లో జైలుకు వెళ్లి రావడంతో తర్వాత తర్వాత కరుడుగట్టిన నేరగాడిగా మారిపోయాడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం మరువాడ గ్రామంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. అక్కడి నుంచి చోరీలకు బయలుదేరతాడు. గంజాయి, మద్యంతాగడానికి బానిసగా మారాడు. విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడు గ్రామంలో అక్టోబరు పదో తేదీన ఎంఎస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న కుటుంబం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయింది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి కిటికీ నుంచి ప్రధాన ద్వారం తలుపు గడియను తీసి లోపలకు ప్రవేశించాడు. కప్‌బోర్డులో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీనితోపాటు ఈ అపార్టుమెంట్‌కు వెనుక వైపు ఉన్న ఇంట్లో తాళాలు పగలుగొట్టి చోరీ చేశాడు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ చేపట్టారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా అందులో మోహనరావు ముఖం కనిపించింది. మోహనరావు వద్ద నుంచి రూ.26లక్షల విలువ చేసే 349 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు నుంచి ఎస్‌.కోట వరకు..

మోహనరావు నెల్లూరులో ఉన్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీనితో సీసీఎస్‌లోని ఒక బృందం అక్కడికి వెళ్లగా పరారయ్యాడు. తర్వాత కొన్ని రోజులకు అతడు విజయవాడలో ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఈ సమాచారం అందిన కొద్దిసేపటికి హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్నట్టు మరో సమాచారం లభించింది. దీనితో నిందితుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడని అనుమానించి పీఎన్‌బీఎస్‌కు వెళ్లారు. తుని వైపునకు వెళ్లే బస్సులను పరిశీలించగా అక్కడ మోహనరావు ఛాయలు కనిపించలేదు. పీఎన్‌బీఎస్‌లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఎస్‌.కోట వెళ్లే బస్సు ఎక్కినట్టు దృశ్యాలు కనిపించాయి. అప్పటికే ఎస్‌.కోటకు బయలుదేరిన బస్సు ఎక్కేశాడు. ఇక్కడ విచారణ కేంద్రంలో ఎస్‌.కోటకు వెళ్లిన బస్సుల డ్రైవర్ల ఫోన్‌ నంబర్లు, వివరాలు నమోదు కాలేదు. దీనితో వెంటనే ఎస్‌.కోట డిపో మేనేజర్‌తో ఫోన్‌లో టచ్‌లోకి వెళ్లారు. పీఎన్‌బీఎస్‌ నుంచి ఎస్‌.కోటకు బయలుదేరిన బస్సుల డ్రైవర్ల నంబర్లను తీసుకున్నారు. వారికి మోహనరావు ఫొటోను వాట్సాప్‌లో పంపగా ఒక బస్సు డ్రైవర్‌ తన బస్సులో ఉన్నట్టు సమాచారం ఇచ్చాడు. ఆ బస్సు ఎక్కడుందో తెలుసుని విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో లక్ష్మీనారాయణ టీం బయలుదేరింది. సరిగ్గా రాజమండ్రిలోని దివాన్‌చెరువు వద్ద కాపుగాచి ఎస్‌.కోట బస్సును తనిఖీ చేయగా మోహనరావు ముఖానికి మాస్క్‌ ధరించి ఒక మూలన కూర్చున్నట్టు గుర్తించారు. అతడ్ని అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి విచారించగా నేరాల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఒకసారి చోరీ చేసిన తర్వాత రెండేళ్ల వరకు చిక్కడని పోలీసులకు ఒక నమ్మకం. విజయవాడ పోలీసులకు చిక్కడానికి రెండు నెలల ముందు హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు.

వంటిపై దుస్తుల్లేకుండా చోరీలు

మోహనరావును విచారించే క్రమంలో పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. సాధారణంగా చోరీలు చేయడాన్ని వ్యసనంగా మార్చుకున్న నేరగాళ్లు గ్యాంగ్‌లను నిర్వహిస్తారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి చోరీలు చేస్తారు. మోహనరావు దీనికి భిన్నంగా నేరాలు చేస్తాడు. ఎక్కడ చోరీలు చేయాలనుకున్నా ఒంటరిగా వెళ్తాడు. దీనికి ముందుగా నేరం చేయాలనుకున్న ప్రదేశంలో రెండు, మూడు రెక్కీలు నిర్వహిస్తాడు. ఇంట్లో మనుషులు ఉన్నా, లేకపోయినా చోరీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని నెరవేర్చుకుంటాడు. చోరీ చేయాలనుకున్న ఇంటికి పక్కనే ఖాళీ స్థలం ఉంటేనే దాన్ని ఎంచుకుంటాడు. దొంగతనం చేయడానికి బయలుదేరినప్పుడు ఆ ఇంటికి సమీపంలో పాడుబడిన భవనంలోకి గానీ, తుప్పల్లోకి గానీ వెళ్తాడు. అక్కడ మొత్తం దుస్తులను తీసేస్తాడు. ఆ తర్వాత గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అనుకున్న పని సజావుగా జరిగిన తర్వాత మళ్లీ దుస్తులు ధరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతదూరం వచ్చిన తర్వాత ఉపయోగించిన ఫోన్‌, సిమ్‌కార్డులను పడేస్తాడు. రూ.1000 విలువ చేసే ఫోన్లు మాత్రమే ఉపయోగిస్తాడు. ఇలా కాజేసిన సొత్తును రెండు, మూడు చోట్ల విక్రయించేస్తాడు. ఈ సొమ్మును తీసుకుని తునికి వెళ్తాడు. నేరుగా ఇంటికి వెళ్లకుండా తన బావమరిదికి కబురుపెడతాడు. తాను ఏ లాడ్జిలో ఉంటున్నాడో బావమరిదికి చెబుతాడు. భార్యపిల్లలను ఆ లాడ్జికి రప్పించుకుంటాడు. డబ్బును ఆమెకు ఇస్తాడు. కాసేపు భార్యపిల్లలతో అక్కడే ముచ్చటిస్తాడు. తర్వాత మళ్లీ దొంగతనాలు చేసే ఇళ్లను ఎంచుకునే పనిలో నిమగ్నమవుతాడు. తునికి సమీపంలో రూ.80లక్షలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. కంచర్ల మోహనరావుపై రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ అనేక కేసులు ఉన్నాయి విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, హైదరాబాద్‌లో సుమారుగా 40 కేసులు ఉన్నాయి.

నన్ను ఎలా పట్టుకున్నారో చెప్పండి ప్లీజ్‌..

ఏదైనా నేరంలో చిక్కినప్పుడు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తారు. సీసీఎస్‌ పోలీసులను మాత్రం నిందితుడు మోహనరావు ప్రశ్నించాడు. తనను ఎలా పట్టుకున్నారో చెప్పాలని పలుమార్లు అడిగాడు. మోహనరావు చోరీ చేసిన తర్వాత పోలీసులకు చిక్కడానికి రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. అతడు ఎక్కడున్నాడో సమాచారం తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చర్లపల్లి జైలు నుంచి బయటకు రాగానే సీసీఎస్‌ పోలీసులకు చిక్కడంతో ఈ ప్రశ్న వేసినట్టు తెలిసింది.

Updated Date - Dec 27 , 2024 | 01:09 AM