Share News

అమరావతికి మళ్లీ కళ!

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:29 AM

టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది.

అమరావతికి మళ్లీ కళ!

యుద్ధ ప్రాతిపదికన ‘జంగిల్‌ క్లియరెన్స్‌’

ముళ్ల పొదలు, పిచ్చి చెట్ల తొలగింపు

సీడ్‌ యాక్సెస్‌, ప్రధాన రోడ్ల వెంబడి పనులు

ఉరుకులు పెట్టిస్తున్న సీఆర్డీఏ అధికారులు

జగన్‌ ప్రభుత్వంలో చిట్టడవిలా రాజధాని

టీడీపీ కూటమి రావడంతో మళ్లీ సందడి

విజయవాడ (ఆంధ్రజ్యోతి)/తుళ్లూరు, జూన్‌ 8: టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది. జగన్‌ ప్రభుత్వంలో దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సీఆర్డీఏ అధికారులు జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భారీ యంత్రాలతో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పొక్లెయిన్లు, జేసీబీలను రప్పించి ఎక్కడికక్కడ ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ముళ్ల కంపలతో కమ్మేసుకుపోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంబడి పిచ్చి మొక్కలను తొలగించటంతో చాన్నాళ్లకు కళ కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి విధ్వంసంతో పనులు, నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతం నిర్మానుషంగా మారిపోయింది. ముళ్ల పొదలు, పిచ్చిచెట్లు పెరిగిపోయాయి. ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్‌ క్వార్టర్స్‌, ప్రభుత్వ టైప్‌-1, టైప్‌-2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్నీ పిచ్చిచెట్లతో కమ్మేసుపోయాయి.

12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతున్నారు. విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన రోడ్లు, ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాల సమీపంలో భారీగా విస్తరించిన ముళ్లకంపలను తొలగించే కార్యక్రమాన్ని సీఆర్‌డీఏ చేపట్టింది. శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగంగా నిర్మిస్తున్న గ్యాడ్‌ టవర్లు చెరువులను తలపించేలా ఉన్నాయి. ఇందులోని నీటిని తొలగించటానికి మోటార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అమరావతిలో పిచ్చి చెట్ల వనాన్ని పూర్తిగా తొలగించటానికి మరో వారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా గాలికి వదిలేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. ఈ సెంటర్‌ నలువైపులా విస్తరించి ఉన్న పొదలను తొలగిస్తున్నారు. రాజధానిలో విద్యుత్‌ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో తెలియనంతగా పిచ్చిచెట్లు అలుముకుపోయాయి. వాటిని తొలగించి అన్నీ బయటకు కనిపించేలా చేస్తున్నారు. ఉద్దండ్రాయునిపాలెంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. సీఆర్టీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఈ పనులను పర్యవేక్షించారు. శుక్రవారం నుంచి ఈ పనులు జరుగుతున్నాయి.

Updated Date - Jun 09 , 2024 | 03:29 AM