Share News

అంగళ్లులో రాళ్ల దాడి.. బాబుపై కేసు తప్పుడుదే!

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:44 AM

గత ఏడాది అన్నమయ్య జిల్లా అంగళ్లులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడుదంటూ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.

అంగళ్లులో రాళ్ల దాడి.. బాబుపై కేసు తప్పుడుదే!

కొట్టివేయాలని కోర్టుకు పోలీసుల నివేదన

ఫిర్యాదుదారుకు నోటీసు

అంగీకరించనన్న ఉమాపతిరెడ్డి

కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టీకరణ

రాయచోటి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది అన్నమయ్య జిల్లా అంగళ్లులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడుదంటూ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై అభ్యంతరాలుంటే కోర్టు ముందు హాజరై చెప్పుకోవాలని ఫిర్యాదుదారు ఉమాపతిరెడ్డికి నోటీసు ఇచ్చారు. కేసును కొట్టివేయడానికి అంగీకరించేందుకు ఆయన తిరస్కరించారు. కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. నిరుడు ఆగస్టు 4న ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చారు. వైసీపీ నాయకులు తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఆయన పర్యటనను అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలతో వైసీపీ జెండాలు, నల్లబెలూన్లతో రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుపైన, టీడీపీ శ్రేణులపైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్వయంగా పోలీసులే వైసీపీ నాయకులకు అండగా నిలిచి దాడులకు సహకరించారు. బాబు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో రాళ్లు ఆయనకు తగులలేదు. ఆ దృశ్యాలు అప్పట్లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయినా ఉమాపతిరెడ్డి ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీసులు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అమరనాథ్‌రెడ్డి సహా 20 మంది టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం(307 సెక్షన్‌) అభియోగంతో పాటు పలు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు (క్రైం నంబరు 79/2023) నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే టీడీపీ నాయకులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, ఆయన రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. పోలీసులు దీనిపై విచారణ జరిపారు. సంఘటన పూర్వాపరాలు పరిశీలించి.. చంద్రబాబుపై పెట్టిన కేసు, ఫిర్యాదు తప్పుడువని తేల్చారు. కేసును కొట్టివేయాలని మదనపల్లె ఒకటో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు నివేదించారు. దీనిపై అభ్యంతరాలుంటే వారంలోపు కోర్టు ముందు హాజరై చెప్పుకోవాలని ఉమాపతిరెడ్డికి గత నెల 25న నోటీసు ఇచ్చారు. ‘భవిష్యత్‌లో సమస్యలు వేరే విధంగా ఉంటాయంటూ బలవంతంగా నోటీసిచ్చారు. కోర్టుకెళ్తా. అక్కడే తేల్చుకుంటా’ అని ఉమాపతిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Oct 07 , 2024 | 03:44 AM