Share News

దాడుల నిందితులపై హత్యాయత్నం కేసులు

ABN , Publish Date - May 22 , 2024 | 04:15 AM

ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన విధ్వంసంపై నమోదైన కేసుల్లో పోలీసు శాఖ బలమైన ఐపీసీ సెక్షన్లు చేర్చింది.

దాడుల నిందితులపై హత్యాయత్నం కేసులు

ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో సెక్షన్‌ 307 చేర్పు

కుట్ర, ప్రజా ప్రాతినిధ్య చట్టం కూడా..

కోర్టుల్లో మెమోలు వేసిన పోలీసులు

పల్నాడులో మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు

మూడు జిల్లాల్లో 35కు చేరిన కేసులు

నిందితుల కోసం పోలీసుల వేట

ఎవ్వరినీ వదిలి పెట్టొద్దు

డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశం

అమరావతి, తాడిపత్రి(ఆంధ్రజ్యోతి)/నరసరావుపేట, మే 21: ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన విధ్వంసంపై నమోదైన కేసుల్లో పోలీసు శాఖ బలమైన ఐపీసీ సెక్షన్లు చేర్చింది. దాడులకు పాల్పడిన నిందితులపై హత్యాయత్నం(ఐపీసీ 307), కుట్ర కోణం(120బీ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఆయా జిల్లాల్లోని కోర్టుల్లో మంగళవారం మెమో దాఖలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, గురజాలల్లో 22, తిరుపతి జిల్లా చంద్రగిరి, తిరుపతిలో 4, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదవగా వాటిలో స్థానిక పోలీసులు బలమైన సెక్షన్లు చేర్చలేదు. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధుల సిఫారసుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్షేత్రస్థాయిలో పర్యటించి దాడుల తీవ్రతను, అక్కడ లభ్యమైన ఆధారాలను పరిశీలించిన తర్వాత హత్యాయత్నం సెక్షన్ల నమోదుకు సిఫారసు చేసింది.

ఈ జిల్లాల్లో నమోదైన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లోనూ కుట్రకోణాన్ని గుర్తించి 120బీ చేర్చిన సిట్‌ అధికారులు పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసంపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేసినవారిపై మంగళవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఎన్నికల హింసకు సంబంధించి మూడు జిల్లాల్లో నమోదైన కేసుల సంఖ్య 35కు చేరింది. నిందితుల సంఖ్య 1,370 నుంచి 1,435కు చేరగా అరెస్టులు మాత్రం 300 దాటలేదు. పోలింగ్‌ ముగిసిన వెంటనే తమ అనుచరులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించిన సిట్‌.. వారు ఎక్కడెక్కడ ఉన్నారో సమాచారం సేకరించి అక్కడికి పోలీసు బృందాలను పంపింది. సుమారు 30మందికి పైగా హిస్టరీ షీట్స్‌ తెరవదగిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరికొందరి ఆచూకీ లభించిందని, అరెస్టులు కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుల విషయమై మంగళవారం సాయంత్రం సిట్‌ ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌, గుంటూరు ఐజీ ఎస్‌ఎస్‌ త్రిపాఠీ, అనంతపురం రేంజ్‌ డీఐజీ షేముషి బాజ్‌పాయ్‌, పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలతో డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వీడియో కాన్ఫరెస్ట్‌ నిర్వహించారు. ఎవ్వరినీ వదిలి పెట్టొద్దని, కఠినంగా వ్యవహరించాలని బాధ్యులను జైల్లో వేసేవరకూ సిట్‌ బృందాలు అక్కడే ఉండి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ ఆదేశించారు.


కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత హింసతో అట్టుడికిన అనంత, పల్నాడు జిల్లాల్లో సిట్‌ బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి సిట్‌ బృందం మరోసారి వచ్చింది. సిట్‌ సభ్యులు శ్రీనివాసులు, భూషణం, శ్రీనివాస్‌... తాడిపత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి దాడులకు సంబంధించిన వీడియోలు, రికార్డులను పరిశీలించారు. అల్లర్లకు ప్రధాన కారణంగా గుర్తించిన రాళ్లదాడిని ఎందుకు నియంత్రించలేకపోయారని స్థానిక పోలీసులను సిట్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఎస్‌బీ అధికారులు ముందే గుర్తించి సమాచారం ఇచ్చారా? లేదా? సమాచారం ఇచ్చినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే కోణాల్లో సిట్‌ దర్యాప్తు చేస్తోందని సమాచారం. తాడిపత్రి గొడవల నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీ అమిత్‌ బర్దార్‌, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ సస్పెండ్‌ అయ్యారు. సిట్‌ దర్యాప్తు తరువాత తమ పరిస్థితి ఏమిటోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యేవరకూ సిట్‌ బృందం తాడిపత్రిలోనే తిష్ఠ వేస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో స్థానిక పోలీసులకు కంటిమీద కునుకు కరువైంది. కాగా, పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై జిల్లాలో సిట్‌ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్‌ అధికారి సౌమ్యలత కేసులకు సంబంధించి పలువురిని ప్రశ్నించినట్టు తెలిసింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పా టు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మాచర్ల ఘటనలకు సంబంధించి సుమారు 30మ ందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు. నరసరావుపేట, పమిడిపాడు ఘటనలకు సంబంధించి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత లాం కోటేశ్వరరావు, బీజేపీ నాయకుడు రామకృష్ణతోపాటు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. వీరందరినీ కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 04:15 AM