Share News

గులకరాయితో హత్యాయత్నమా?

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:14 AM

చిన్న గులకరాయితో కొడితే మనిషి చనిపోతాడా..? ఎవరినైనా చంపాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి గులకరాయితో దాడి చేస్తాడా..? అవుననే అంటున్నారు విజయవాడ పోలీసులు. అది కూడా సామాన్యుడిని కాదు.. వందలాది మంది సాయుధ పోలీసుల రక్షణలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి

గులకరాయితో హత్యాయత్నమా?

స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్‌ రోత మీడియా

ఎయిర్‌ గన్‌తో కాల్చారని టీవీలో కథనం

రాయి విసిరారంటూ పత్రికలో రాతలు

నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందట

అదే నిజమంటూ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌

గతంలో టీడీపీ నేతపై వైసీపీ రౌడీలు

చువ్వలతో దాడి చేస్తే సాధారణ సెక్షన్‌

తాజా ఘటనపై హత్యాయత్నం కేసు

విజయవాడ పోలీసుల తీరుపై విస్మయం

ఆపరేషన్‌ థియేటర్లో ఫొటోలపైనా విమర్శలు

గత ఎన్నికల ముందూ దాడి డ్రామాలు

విశాఖలో జగన్‌ అభిమాని కోడికత్తితో దాడి

వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరణ

ఆ తర్వాత నారాసుర రక్తచరిత్ర అంటూ రాతలు

ముందే తెలుసా..?

జగన్‌పై విసిరిన గులకరాయి పాఠశాల భవనం వైపు నుంచి వచ్చిందంటూ సాక్షి టీవీలో ఎర్రని రింగ్‌ వేసి పదే పదే చూపించారు. సాధారణంగా ముఖ్యమంత్రి సభలో కెమెరామన్‌ ఆయన్ను కవర్‌ చేస్తారు. లేదా సభకు వచ్చిన ప్రజలను కవర్‌ చేస్తారు. కానీ బస్సుపై ఓపెన్‌ టాప్‌పై ఉన్న జగన్‌ వైపు వస్తున్న రాయి దిశగా కెమెరామన్‌ ఎందుకు తిప్పారు? దెబ్బ తగలక ముందే ఆ రాయిని ఎలా వీడియో తీయగలిగారు? ఏదైనా శబ్దం వస్తే కెమెరా అటు వైపు తిప్పారని భావించవచ్చు. కానీ ఎలాంటి శబ్దం రాకున్నా ఎలా కవర్‌ చేశారు? అటువైపు నుంచే రాయి వేస్తారని కెమెరామన్‌కు ముందే ఎలా తెలుసు? అన్న సందేహాలు వస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చిన్న గులకరాయితో కొడితే మనిషి చనిపోతాడా..? ఎవరినైనా చంపాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి గులకరాయితో దాడి చేస్తాడా..? అవుననే అంటున్నారు విజయవాడ పోలీసులు. అది కూడా సామాన్యుడిని కాదు.. వందలాది మంది సాయుధ పోలీసుల రక్షణలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై గులకరాయితో హత్యాయత్నం చేశారట. జగన్‌ సొంత రోత మీడియా దర్యాప్తులో ఈ విషయాన్ని తేల్చేసింది. అదే నిజమంటూ విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ చట్టం అధికార పార్టీకి వర్తించబోదని 2019 జూన్‌లోనే తేల్చేసిన ఏపీ పోలీసులు వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా అదే పంథాను కొనసాగించి ‘మేమింతే’ అని నిరూపించుకున్నారు. ఇదే విజయవాడలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్‌ భర్త చెన్నుపాటి గాంధీపై అధికార వైసీపీ రౌడీలు పదునైన ఇనుప చువ్వలతో దాడి చేసి కన్ను పొడిచేస్తే.. ఈ ఘటనలో హత్యాయత్నం వర్తించబోదంటూ ఇదే పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా చెప్పడం ఆయన అధికార భక్తికి నిదర్శనం. ఎన్నికల వేళ ఏదో ఒక డ్రామాకు తెరతీసే జగన్‌ రెడ్డి బ్యాచ్‌ గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా తరహాలోనే ఇప్పుడు గులకరాయి సానుభూతికి పథక రచన చేసింది. సీఎం జగన్‌ కనుబొమ్మపై చర్మం చిట్లే గాయం చేసిన గులకరాయి ఘటన డ్రామాను ఆయన సొంత మీడియా మలుపులు తిప్పుతున్న తీరు అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్‌ నటిస్తున్న తీరును సోషల్‌ మీడియాలో నెటిజెన్లు ఏకి పారేస్తున్నారు. ‘కోడికత్తి కమల్‌హాసన్‌’, ‘గులకరాయి స్టార్‌’ అంటూ బిరుదులు ఇస్తున్నారు.

ఎయిర్‌ గన్నా.. గులకరాయా?

జగన్‌ను ఎయిర్‌ గన్‌తో కాల్చారని సాక్షి టీవీ కథనం వండితే.. ఆయన పత్రికలో మాత్రం రాయి విసిరారంటూ రాశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్‌ సొంత మీడియా చేస్తున్న అతితో పోలీసులు తల పట్టుకున్నారు. ఒక వ్యక్తిని హత్య చేయాలని ఎవరైనా అనుకుంటే ఒరిజినల్‌ గన్‌తోనే కాలుస్తాడు తప్ప ఎయిర్‌ గన్‌ ఎందుకు వాడతాడనే ప్రశ్న పోలీసుల నుంచి వస్తోంది. ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకూ వాహనంలో వెళుతున్న వ్యక్తిని కాల్చిచంపిన ఘటన ఒక్కటే జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీని 1963లో చంపగలిగారు. ఆ తర్వాత ఇదే అన్నట్లు జగన్‌ మీడియా రాసుకొచ్చింది. కదులుతున్న వాహనంలో చుట్టూ భద్రతా సిబ్బంది మధ్యలో ఉన్న వ్యక్తి కణతపై ఎయిర్‌ గన్‌తో కాల్చాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అంతర్జాతీయ రైఫిల్‌ షూటర్‌ లేదా ప్రపంచంలోనే కరుడుగట్టిన తీవ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. లేదంటే పోలీస్‌ అకాడమీలో రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ తీసుకొని ఉండాలి. బెజవాడలో ఆ స్థాయి వ్యక్తులు ఎవరూ లేరు. రోడ్డుపై నుంచి కాలిస్తే కనీసం 15అడుగుల ఎత్తులో బస్సుపై ఉన్న వ్యక్తిని గురిపెట్టడం అసాధ్యం. ఎయిర్‌ గన్‌ పెలిస్తే శబ్దం వస్తుంది. ఘటనా స్థలంలో అలాంటి శబ్దం ఎవరికీ వినిపించలేదు.

వీఐపీ ఆదేశాలు సెక్యూరిటీ పాటిస్తుందా?

సెక్యూరిటీ సిబ్బందికి వీఐపీ ఆదేశాల కన్నా ప్రాణాలను రక్షించడమే ముఖ్యం. గులకరాయి ఘటన దృశ్యాలు పరిశీలిస్తే వీడియోల్లో వేర్వేరుగా ఉంది. ఒక వీడియోలో దండకు ఉన్న తీగలాంటిది ఏదో గుచ్చుకున్నట్లు ఇద్దరూ (జగన్‌, వెలంపల్లి) పక్కకు తల తిప్పారు. మరో దాంట్లో జగన్‌ ఒక్కరే తిరగడం కనిపించింది. వీఐపీపై దాడిజరగ్గానే భద్రతా సిబ్బంది చుట్టుముడతారు. క్రిమినల్స్‌ మళ్లీ దాడి చేస్తారని అప్రమత్తమవుతారు. జగన్‌ సెక్యూరిటీ గార్డుల్లో కనీసం టెన్షన్‌ కనిపించలేదు. సీఎం కూర్చో అనగానే ముందున్న గార్డు కింద కూర్చున్నారు. గాయంపై వ్యక్తిగత సహాయకుడు టవల్‌తో తుడుస్తుంటే జగన్‌ ఫొటోలకు పోజులు ఇచ్చారు. గాయపడ్డ సీఎంను భద్రత సిబ్బంది వెంటనే బస్సులోకి దించేయాలి. రోప్‌ పార్టీ బస్సును చుట్టుముట్టాలి. పోలీసులు జనాన్ని చెదరగొట్టి ఎయిర్‌ గన్‌ శబ్దం వచ్చిన వైపుగా పరిగెత్తాలి. ఇవేవీ జరగలేదు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై శ్రీలంకలో దాడి జరగ్గానే సెక్యూరిటీ మెరుపువేగంతో స్పందించారు. గులకరాయి ఘటనలో జగన్‌ నుదుటి నుంచి రక్తం కారుతుంటే.. ఆయన్ను నిలబెట్టి కర్చీ్‌పతో తుడుస్తారా? రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే ఆ దారిన వెళ్లేవారు పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి నీళ్లిచ్చి సపర్యలు చేస్తారు. భారీ ఖర్చు పెట్టి ఎస్‌పీజీ తరహాలో జగన్‌ ఏర్పాటు చేసుకున్న గార్డులకు ఆ శిక్షణ ఎందుకివ్వలేదనే ప్రశ్న పోలీ సు వర్గాల్లోనే వినిపిస్తోంది.

గులకరాయి స్పిన్‌!

ఒక బస్సుపై కనీసం పది మంది ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని గురి పెట్టి కొట్టడం అసాధ్యం. అలా కొట్టాలంటే ఇటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గురి పెట్టాలి. ఒకే రాయి ముందుగా జగన్‌ నుదుటిపై తగిలి చర్మానికి గీత పెట్టి.. తర్వాత స్పిన్‌ అయ్యి వెలంపల్లి కన్ను మొత్తం కప్పేసేంత కట్టు కట్టేంత గాయం చేసింది. ఇంత టెక్నిక్‌గా రాళ్లు విసిరే వాళ్లు విజయవాడలో ఉన్నారా? అంటూ స్థానికులు నోరెళ్ల బెడుతున్నారు. క్రికెట్‌ బాల్‌ స్పిన్‌ అయినట్లు జగన్‌ నుదుటిపై రాయి స్పిన్‌ అయిందంటూ యువత సెటైర్లు వేస్తున్నారు. గులకరాయి దాడిలో జగన్‌ నుదుటికి చిన్నగాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌లో కుట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, సిబ్బందితో కలసి గ్రూప్‌ ఫొటో దిగిన తీరుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

చెన్నుపాటికి అలా.. జగన్‌కు ఇలా

ఏడాది క్రితం విజయవాడలో టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు పదునైన ఇనుప చువ్వ(స్ర్కూడ్రైవర్‌ లాంటిది)తో దాడి చేసి కన్ను పొడిచేశారు. చంపాలనే ఉద్దేశంతోనే దాడిచేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన రోడ్డుపై జరిగిన వాగ్వాదం తప్ప వేరే ఉద్దేశం వాళ్లకు లేదంటూ సీపీ క్రాంతి రాణా సర్టిఫికెట్‌ ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఐపీసీ 326 సెక్షన్‌ నమోదు చేసి బెయిల్‌ వచ్చేందుకు సహకరించారు. ఇప్పుడు అదే విజయవాడలో జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి విసిరినట్లుగా చెబుతున్న రాయి వల్ల నుదుటిపై గీత పడింది. జగన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేశారంటూ వెలంపల్లితో తాడేపల్లి పెద్దలు ఫిర్యాదు చేయించారు. వైసీపీ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసే పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు సాక్ష్యాధారాల మేరకు కేసు నమోదు చేస్తారు. కానీ ‘సాక్షి’ ఆధారాల మేరకు 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారు.

ఎన్నికల ముందే జగన్‌పై దాడులు!

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై సరిగ్గా ఎన్నికలకు ముందే దాడులు జరగడం ఏమిటో అనే సెటైర్లు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఉంటూ అక్రమాస్తుల కేసు విచారణ కోసం సీబీఐ కోర్టుకు వెళుతున్న జగన్‌కు విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న కోడికత్తి భుజానికి గుచ్చుకుంది. ఎన్నికల సానుభూతి కోసం ఆయన అభిమానే చిన్నగా గుచ్చారని పోలీసులు, అర అంగుళం గాయమైందని వైద్యులు తేల్చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత జగన్‌ నవ్వుతూ విమానం ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ‘జగన్‌కు తొమ్మిది కుట్లు పడ్డాయి. బలమైన గాయమైంది. హత్యాయత్నం జరిగింది. హోటల్లో పనిచేసే చంద్రబాబు కులానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. చంద్రబాబు, లోకేశ్‌ హత్యకుట్రకు పథక రచన చేశారు’ అంటూ వైసీపీ నేతలు, నీలి మీడియా ఊదరగొట్టి జనాన్ని బెంబేలెత్తించారు. ఎన్‌ఐఏ అసలు విషయం తేల్చడంతో తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రాకుండా తన అభిమాని శ్రీనివాసరావుకు బెయిల్‌ రానివ్వకుండా జగన్‌ తన అసలు స్వరూపం చూపించారు. ఐదేళ్ల కిత్రం ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో పోలింగ్‌ జరిగింది. అంతకు నాలుగు వారాల ముందు జగన్‌ చిన్నాన్న వివేకా దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో చనిపోయారని జగన్‌ మీడియాలో ప్రసారం చేశారు. అసలు విషయం బయటికి రాగానే మాట మార్చి నారాసుర రక్తచరిత్ర అంటూ పెద్ద కథనాన్ని వండి వార్చింది. హత్య ఎలా జరిగిందో ప్రత్యక్షంగా తాను చూసినట్లు.. చిన్నాన్నను ఇలా ఇలా చంపారంటూ జగన్‌ మీడియా ముందు వివరించారు. ఈ రెండు ఘటనల ద్వారా ఎన్నికల్లో ఆయన లబ్ధిపొందారు. తాజాగా గులకరాయి ఘటన పోలింగ్‌ (మే 13) కు సరిగ్గా నెల ముందు (ఏప్రిల్‌ 13) జరగడం ఐప్యాక్‌ స్ర్కిప్ట్‌లో భాగమా.? సానుభూతితో ఓట్లు పొందేందుకు జగన్‌ ఆడుతున్న డ్రామానా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈసీకి డీజీపీ, సీపీ నివేదిక

జగన్‌పై జరిగిన గులకరాయి ఘటనపై ఈసీకి డీజీపీ, విజయవాడ సీపీ నివేదిక పంపారు. ‘విజయవాడలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సీఎం జగన్‌పైకి రాయి విసిరారు. ఆయనకు నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆ తర్వాత యథావిధిగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు మూడు కుట్లు వేశారు. ముఖ్యమంత్రికి కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో అగంతకులు దాన్ని అదనుగా తీసుకుని రాయి విసిరారు’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీపీ క్రాంతి రాణా నివేదించారు. ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలన్నీ పటిష్ఠంగా పనిచేశాయని వివరించారు. వెలుతురు తక్కువగా ఉన్న చోట నుంచి ఒక వ్యక్తి రాయి విసరడం వల్లే ఈ గాయం అయిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు డీసీపీ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని నివేదించారు.

మరి ఇప్పుడు జగనేమన్నా పిట్టా..!

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయి దాడి జరిగిన వెంటనే వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్ష నేత చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఇదే నేతలు గతంలో చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన జరిగినపుడు వెటకారంగా మాట్లాడారు. గతంలో నందిగామ పర్యటనలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబుకు తగలాల్సిన రాయి సెక్యూరిటీ అధికారికి తగిలి బాగా రక్తం కారింది. నాడు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్‌, అంబటి రాంబాబు ఈ ఘటనపై స్పందించిన వీడియోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆయనేమన్నా పిట్టా: పోలీసుల పహారాలో అతని యాత్ర నడుస్తోంది. ఈయన్ను చంపేద్దామని ఎవడో చీకట్లో చిన్న గులక రాయి విసిరాడట. ఈయన పావురమా? పిట్టా? గులకరాయి పెట్టి కొడితే పోవడానికి. ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవడం. - కొడాలి నాని

మోసం చేస్తే రాళ్లే పడతాయి: కోపంతో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. డబ్బులిచ్చి పూలు వేయించుకోగలవు కానీ మోసం చేస్తే ప్రజల నుంచి చెప్పులు, రాళ్లే పడతాయి మరి. - పేర్ని నాని

విషపు రాజకీయ కుట్ర: నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం.. రాయి విసిరించుకోవడం. - జోగి రమేశ్‌

అక్రమ కేసులతో వేధించినందుకే: మీరు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందరినీ వేధించారు కాబట్టి మీరొస్తున్నప్పుడు ఎవరో తుంటరివాళ్లు విసరొచ్చు. ఒకటో రెండో తగిలాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాళ్లే సమాధానం చెప్పాలి. ఈ రాయి ఫలానా వాడిదని వాళ్లు సమాధానం చెప్పాలి. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

- అంబటి రాంబాబు

Updated Date - Apr 15 , 2024 | 03:14 AM