AP News: భారీ కుంభకోణానికి ‘టెండర్ల’ ఆహ్వానం.. మొత్తం దోపిడీ 1000 కోట్లకు పైమాటే!
ABN , Publish Date - Jan 26 , 2024 | 03:17 AM
మంగంపేట బెరైటీ్‌సను గనుల శాఖ గజదొంగలు దొరికినట్టల్లా అడ్డగోలుగా దోచేస్తున్నారు. సీ గ్రేడ్ పేరిట అక్రమంగా ఏ గ్రేడ్ బెరైటీ్‌సను తరలించి 650 కోట్లు కొల్లగొట్టారు.
భారీ కుంభకోణానికి ‘టెండర్ల’ ఆహ్వానం
పేదలకు ఇళ్ల స్థలాలపేరుతో స్కామ్! ప్రభుత్వ మద్యం దుకాణాలతో స్కామ్! ఇసుక టెండర్లలో కళ్లు తిరిగే స్కామ్! ఇంకా రకరకాల స్కీముల పేర్లతో స్కాములు...ఇవన్నీ ఒక ఎత్తు.... ఇప్పుడు జరగబోయేది ఒక్కటే ఒక ఎత్తు! అదే... బెరైటీస్ స్కామ్! ఇది... ‘బాప్ ఆఫ్ ఆల్ స్కామ్స్! అంటే, అన్ని స్కామ్‌లనూ మించిన స్కామ్!
మంగంపేట బెరైటీ్‌సను గనుల శాఖ గజదొంగలు దొరికినట్టల్లా అడ్డగోలుగా దోచేస్తున్నారు. సీ గ్రేడ్ పేరిట అక్రమంగా ఏ గ్రేడ్ బెరైటీ్‌సను తరలించి 650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్‌ఎ్‌ఫఐడీ, కంప్యూటర్ రికార్డులు ఏమార్చి మరో 420 కోట్ల విలువైన బెరైటీ్‌సను అమ్ముకున్నారు. ఈ మొత్తం దోపిడీ 1000 కోట్లకు పైమాటే. ‘బంగారుకొండ’తోపాటు కొందరు అధికారులు ఈ వ్యవహారం నడిపించారు. ఈ దోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే పలు కథనాలు ప్రచురించింది. ఇప్పుడు మరో భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారు. ఎన్నికలు ముగిసే లోపు మొత్తం బెరైటీ్‌సను దోచేందుకు ‘టెండర్’ పెట్టారు.
మంగంపేటలో కోటి టన్నుల సీ, డీ గ్రేడ్ బెరైటీస్ రెడీ
మార్కెట్‌లో కనీస ధర టన్నుకు రూ.1650
రిజర్వు ప్రైస్ రూ.1200లే పెట్టిన ‘బంగారు కొండ’
మంత్రి పెద్దిరెడ్డి అభ్యంతరం.. ధర పెంచాలని సూచన
అది పట్టించుకోకుండా సీఎంవో ఆమోదంతో ముందుకు
ఎన్నికల్లోపు మొత్తం అమ్ముకునేలా స్కీమ్
జెట్ స్పీడ్‌లో 15 రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి
ఇసుక దారిలో ఎంఎ్‌సటీసీకే ఇదీ అప్పగింత
కోల్‌కతా కేంద్రంగా గుట్టుగా వేలం ప్రక్రియ
టెండరు డాక్యుమెంట్, వివరాలన్నీ రహస్యమే
కంపెనీలు, వాటాలు అన్నీ ముందే ‘ఫిక్స్’
ఇతర సంస్థలు పోటీకి రాకుండా పక్కా ప్లాన్
డాక్యుమెంట్ ఫీజే 29 లక్షల రూపాయలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మంగంపేటలో కోటి టన్నుల బెరైటీస్! సరుకు సిద్ధంగా ఉంది! తవ్వుకోవాల్సిన అవసరం కూడా లేదు! పొక్లైన్లను రంగంలోకి దించి... టిప్పర్లలోకి ఎత్తి పోసుకోవడమే! ఇంకేముంది... మొత్తం బెరైటీ్‌సను ‘అస్మదీయుల’కు కట్టబెట్టేందుకు సర్వం సిద్ధమైంది. చకచకా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం, ఎన్నికలు ముగిసేలోగా మొత్తం బెరైటీ్‌సను ఖాళీ చేయడం, వందల కోట్లు పోగేసుకోవడం! ఇదీ... స్కీమ్! బెరైటీ్‌సను కొట్టేసేందుకు వేసిన మాస్టర్ ప్లాన్! ఇందులో టెండర్ డాక్యుమెంట్ ఫీజు నుంచి టన్ను బెరైటీ్‌సకు నిర్ణయించిన రిజర్వు ధర వరకు సకలం ‘స్కామ్’లో భాగమే! బెరైటీ్‌సలో ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది ‘వేస్ట్’ గ్రేడ్. ఇందులో ఏ, బీ గ్రేడ్‌లకు రేటు ఎక్కువ. మంగంపేట మైనింగ్ ఏరియాలో ఏ, బీ గ్రేడ్‌ల బెరైటీ్‌సను అమ్మేశారు. అవి అతి తక్కువ నిల్వలున్నాయి. కానీ... సీ, డీ, డబ్ల్యూ (వేస్ట్) గ్రేడ్ నిల్వలు పేరుకుపోయాయి. వాటి అమ్మకాలపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. ‘సరుకు మొత్తం’ కొట్టేసేందుకు సరిగ్గా ఎన్నికల ముందు వరకు ఆగారు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ధర.. దగా...
బెరైటీ్‌సకు డిమాండ్ ఎక్కువ. ఏదీ దొరకనప్పుడు ‘వేస్ట్’ గ్రేడ్ కూడా కొంటారు. మన దేశంలో దొరికే బెరైటీస్ బాగా నాణ్యమైనది. ప్రస్తుతం మార్కెట్‌లో సీ, డీ గ్రేడ్‌ల బెరైటీస్ ధర టన్నుకు రూ.1650 దాకా ఉంది. ఏ, బీ గ్రేడ్‌లు దొరక్కపోతే దీనికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ధర కూడా పెరుగుతూనే ఉంటుంది. ఏవిధంగా చూసినా.. టన్ను బెరైటీస్ రిజర్వు ధర కనీసం రూ.1650గా నిర్ణయించాలి. అంతకంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్లకు టెండరు ఇవ్వాలి. కానీ... ఏపీఎండీసీ కేవలం రూ.1200 రిజర్వు ప్రైస్ నిర్ణయిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫైలు పంపించినట్లు తెలిసింది. ఇది చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ‘‘ఏ, బీ గ్రేడ్‌లు దొరక్కపోతే సీ, డీ గ్రేడ్‌లకు డిమాండ్ పెరుగుతుంది కదా! ధరను 500 నుంచి వెయ్యి పెంచొచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. మీరేమిటి ఉన్న ధరనే తగ్గించారు? దీనికి ఒప్పుకోను’’ అంటూ ఫైల్ తిప్పి పంపించారు. దీంతో గనుల శాఖలోని ‘బంగారు కొండ’ ప్లాన్ మార్చారు. సీఎంవోలో ఈ ఫైలుపై ఆమోద ముద్ర పొందారు. అంటే... బెరైటీస్ రిజర్వు ధర నిర్ణయంలోనే దగా జరిగింది. అంటే... టన్నుకు కనీసం రూ.450 దోచేశారనుకున్నా, కోటి టన్నులకు రూ.450 కోట్లు కొట్టేసినట్లే! టన్ను ధరను రూ.2వేలుగా నిర్ణయించినా.. బిడ్డింగ్‌లో అంతకుమించే ధర పలికే అవకాశముంది. కానీ... అస్మదీయులకు దోచిపెట్టేందుకే ఽఈ దగా! మంత్రి చెప్పినట్లుగా రిజర్వు ప్రైస్‌ను టన్నుకు మార్కెట్ ధరపై రూ.500 పెంచితే, రూ.2150 అయ్యేది. అంటే... ఇప్పుడు నిర్ణయించిన ధరకంటే రూ.950 అధికం. కోటి టన్నులకు రూ.950 కోట్లు. ఇదంతా ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయం. కంపెనీలు దక్కించుకోనున్న కనీస లాభం!
తొందర తొందరగా టెండర్...
టెండరు ఏ కంపెనీలకు దక్కాలి, ఎవరెవరికి ఎంత వాటా వెళ్లాలి... ఇవన్నీ ‘బంగారు కొండ’ ముందుగానే నిర్ణయించినట్లు సమాచారం. ఎంపిక చేసిన కంపెనీలు మాత్రమే పాల్గొనేలా పక్కాగా స్కెచ్ వేశారు. ఇలాంటి టెండర్లలో బిడ్ల దాఖలుకు నెల నుంచి రెండు నెలలు గడువు ఇస్తారు. కానీ... 15 రోజుల్లోనే చుట్టేస్తున్నారు. గురువారం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. బిడ్ల దాఖలుకు ఫిబ్రవరి 7 చివరి తేదీ. 8వ తేదీన సాంకేతిక అర్హత సాధించిన కంపెనీలను ప్రకటిస్తారు. 9న బెరైటీస్ వేలం నిర్వహిస్తారు. టన్ను రిజర్వు ధర రూ.1200గా నిర్ణయించినప్పటికీ... ఈ విషయాన్ని ఏపీఎండీసీ బహిరంగపరచలేదు. ‘ఆర్‌ఎ్‌ఫపీ’ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)లోనే ఆ వివరాలు ఉంటాయని తెలిపారు. బెరైటీస్ టెండరు డాక్యుమెంట్ ఫీజు... రూ.29.50 లక్షలు! ఇది... 18శాతం జీఎస్టీతో కలిపి! ఇది ‘నాన్ రిఫండబుల్’. టెండర్ల చరిత్రలోనే అత్యంత ఖరీదైన డాక్యుమెంట్ ఇదే. ఇక... బిడ్ సెక్యూరిటీని రూ.90 కోట్లుగా నిర్ణయించారు. బిడ్ దక్కని వారికి దీనిని తిరిగి చెల్లిస్తారు.
ఇసుక దారిలోనే మస్కా...
మొన్నటికి మొన్న రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండర్లను అస్మదీయులకు కట్టబెట్టినందుకు అమలు చేసిన స్కీమ్‌నే... బెరైటీ్‌సకూ వాడుతున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది. అన్ని వివరాలూ బయటపెట్టాలి. అందుకే... కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఎంఎ్‌సటీసీ (మెటల్ స్ర్కాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ - కేంద్ర ప్రభుత్వ సంస్థ)కే బెరైటీస్ టెండర్లనూ అప్పగించారు. ఇసుక టెండర్లను ఎంఎ్‌సటీసీ ద్వారా గుట్టుగా కట్టబెట్టారు. టెండర్ డాక్యుమెంట్, బిడ్‌లు దాఖలు చేసిన కంపెనీలు, వాటి అర్హతల వివరాలేవీ బయటకు రాలేదు. బెరైటీస్ విషయంలోనూ ఇదే జరగనుంది. ఏపీఎండీసీ సంస్థ టెండర్ డాక్యుమెంట్‌లో ఎంఎ్‌సటీసీ లింకు ఇచ్చింది. కానీ... దాన్ని తెరిస్తే ఏమీ కనిపించదు. అంతా రహస్యమే!