Share News

సీఐడీ విచారణపై భయమెందుకో!

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:14 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా?

సీఐడీ విచారణపై భయమెందుకో!

లడ్డూలో నెయ్యి కల్తీపై జగన్‌ ఎంక్వైరీ చేయాలంటారు..

వద్దంటూ సుబ్బారెడ్డి కోర్టుకెళ్తారు

వైసీపీ జమానాలో ఒక్క జ్యుడీషియల్‌ ఎంక్వైరీ అయినా వేశారా?

ప్రతిదీ సీఐడీకి అప్పగింత

బాబు సహా తప్పుడు కేసులతో అరెస్టులే!

ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై.. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే చాన్సు!

ఇరుక్కుంటామన్న ఆందోళనతోనే ముఖ్య నేతల విన్యాసాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా? సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని తెలియడంతోనే .. వైసీపీ ముఖ్యనేతల్లో భయం ఆవహించిందా..? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తప్పేమైనా జరిగితే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి, టీడీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి సవాల్‌ విసరాలి. కానీ అందుకు విరుద్ధంగా శుక్రవారంనాడు జగన్‌, సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారి మాటల్లో తొట్రుపాటు అడుగడుగునా కనిపించింది. మాజీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై విచారణ జరగాలన్నారు. గంటా పదినిమిషాల పాటు మాట్లాడితే.. కేవలం ఒకేసారి విచారణ కోరారు. మిగిలిన సమయమంతా .. చంద్రబాబును బీజేపీ, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిట్టాలని కోరుకున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్‌ విసరడం తర్వాత.. మాటమాత్రంగానైనా అనలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తనపై విజిలెన్స్‌ విచారణ జరపకుండా స్టే విధించాలని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత గానీ.. అది నియమించే కమిటీతో గానీ న్యాయ విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరారు. ఒకవైపు విజిలెన్స్‌ విచారణపై స్టే కోరుతూ.. మరోవైపు న్యాయవిచారణ అడగడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కటంటే ఒక్కటైనా..

చంద్రబాబు 2014-19 నడుమ సీఎంగా ఉన్నప్పుడు జరిగినవాటిపై తన ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ న్యాయ విచారణకు ఆదేశించలేదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోకుండా సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. జగన్‌ జమానాలో ఎవరైనా విమర్శిస్తూ సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా.. వాటిని లైక్‌ చేసినా.. భూఆక్రమణలున్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం.. అర్థరాత్రి సమయంలో గోడలు దూకి మరీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగాయి. ఏనాడూ న్యాయ విచాణకు జగన్‌ ఆదేశించలేదు. ప్రతి చిన్న విషయానికీ సీఐడీని వాడేసుకున్న జగన్‌ అండ్‌ కో.. ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తిరుమల లడ్డూ విషయంలో సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారన్న ప్రఽశ్నలు తలెత్తుతున్నాయి. జగన్‌ మాటలకూ.. సుబ్బారెడ్డి చేతలకూ పొంతన లేకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో చంద్రబాబును, టీడీపీ నేతలను పలు కేసుల్లో సీఐడీ జైలు పాలు చేసినప్పుడల్లా.. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. బెయిల్‌ కోరకుండా జైళ్లలోనే మగ్గి.. నిజాయితీ నిరూపించుకోవాలని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడాయన కనిపించడమే గగనమైపోయింది. కీలక అంశాలపై మీడియాతో మాట్లాడానికే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రావడంలేదు.

జగన్‌ జైలుకెళ్లడం ఖాయం

కరుణాకరరెడ్డి, వైవీకీ అదే గతి.. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

తిరుపతి(విద్య), సెప్టెంబరు 20: జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ‘పీఎం విశ్వకర్మ పథకం’ ప్రథమ వార్షికోత్సవ సభలో ప్రసంగించారు. మాజీ సీఎం జగన్‌కు తెలిసే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని ఆరోపించారు. దీనిపై విచారణ పూర్తయిన తరువాత జగన్‌ జైలుకు వెళ్తారని, భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికీ అదేగతి పడుతుందని అన్నారు. వైసీపీ నేతలను వేంకటేశ్వరస్వామి ఎన్నటికీ క్షమించరని, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. జగన్‌ రాజకీయ సన్యాసం తీసుకునే సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు.

లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసమా?

8 బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపాటు

గుంటూరు, సెప్టెంబరు 20: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలలో జగన్‌ ప్రభుత్వం అపచారాలు చేయటం క్షమించరాని నేరమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ ఆక్షేపించారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం నూనె, పంది మాంసం నూనె, చేప నూనె, పత్తి గింజల నూనె, పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ వాడి ప్రసాదంగా విక్రయించడం నీచమైన విషయం. జుగుప్సాకరమైన పదార్థాలతో స్వామివారికి నైవేద్యాలు పెట్టారంటే జగన్‌ ప్రభుత్వం పెద్ద అపచారం చేసింది. దైవంపట్ల చేసిన తప్పుడు పనులకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడని, చివరికి వైసీపీ పార్టీనే లేకుండా చేస్తాడని’ శ్రీధర్‌ అన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:16 AM