Share News

Vijayawada: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి

ABN , Publish Date - Dec 21 , 2024 | 08:06 AM

భవానీల దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. అందుకోసం విజయవాడకు భవానీలు పోటెత్తారు. భవానీల దీక్ష విరమణ నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

Vijayawada: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి

విజయవాడ, డిసెంబర్ 21: ఇంద్రకీలాద్రిపై కోలువు తీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ప్రారంభమైంది. శనివారం ఉదయం మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ మూడు హోమ గుండాలకు దేవాలయం ఈవో కేఏస్ రామారావు అగ్ని ప్రతిష్టాపన చేశారు. అనంతరం భవానీలు తీసుకు వచ్చిన నేతి టెంకాయలను హోమంగుండాల్లో వేసి దీక్ష విరమణ చేస్తున్నారు. అయితే దీక్ష విరమణ చేసేందుకు భవానీలు భారీగా విజయవాడకు పోటెత్తారు. జై దుర్గా.. జైజై దుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.


మరోవైపు నేటి నుంచి భవానీల దీక్ష విరమణ ప్రారంభం కానుండడంతో ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షా నిర్వహించారు. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌ ధ్యాన్ చంద్రతోపాటు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఈ దీక్షల విరమణ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భవానీ విజయవాడకు తరలి వస్తున్నారు.


ఈ నేపథ్యంలో వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా.. చర్యలు చేపట్టాలని దేవాలయ అధికారులను ఉన్నతాధికారుల ఆదేశించారు. అలాగే భవానీ భక్తుల కోసం హోల్డింగ్ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. అదే విధంగా సీతామ్మ పాదాల వద్ద తలనీలాల సమర్పించుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు దీక్ష విరమణ కోసం ఎంత మంది భవానీలు విజయవాడ వస్తున్నారో తెలుసుకొనేందుకు ప్రత్యేక యాప్‌ను సైతం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ యాప్‌లో ముందే దీక్ష విరమణ నమోదు చేసుకోవచ్చని భవానీలకు ప్రభుత్వం సూచించింది.


మొబైల్ యాప్ ద్వారా ప్రసాదములు అడ్వాన్స్ బుక్ చేసుకున్న భక్తుల కోసం కనకదుర్గ నగర్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్నదానం కార్యక్రమానికి సైతం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ జరుగుతోంది. అందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా విజయవాడ తరలి వస్తారన్నా సంగతి అందరికి తెలిసిందే.


ఇక భవానీల దీక్ష విరమణ కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దుర్గమ్మ భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు.. అధికారులకు సూచించారు.


అయితే దీక్ష విరమణ నేపథ్యంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సందర్బంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గమనించారు. దీంతో భవానీలపై చిన్న గీత పడినా.. సహించేది లేదంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 08:11 AM