వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:01 AM
రాజకీయంగా కునారిల్లుతున్న వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని
(ఒంగోలు - ఆంధ్రజ్యోతి)
రాజకీయంగా కునారిల్లుతున్న వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంతు! బుధవారం ఆయన వైసీపీ ప్రాఽథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విలువలు లేని, ఆత్మాభిమానానికి అవకాశం లేని వైసీపీలో కొనసాగలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. ‘‘జగన్ చాలా తప్పులు చేశాడు.. ఇప్పటికీ మారలేదు’’ అని బాలినేని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో ఆయన గురువారం భేటీ కాబోతున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. మాజీ సీఎం రోశయ్య మంత్రివర్గంలో గనులశాఖ మంత్రిగా ఉన్న బాలినేని వైసీపీ ఆవిర్భావంతో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. జగన్‌కు వరుసకు బాబాయి అయిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి బాలినేని బావమరిది. దగ్గరి బంధుత్వం కావటంతో జగన్‌తో అవినాభావ సంబంధాలతో చాలాకాలం ఆ పార్టీలో పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో తొలి మంత్రివర్గంలో స్థానం పొందారు.
తర్వాతి విస్తరణలో ఆయనను జగన్ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగిస్తూ తనను పదవి నుంచి తప్పించటంపై అసంతృప్తి వ్యక్తంచేసిన బాలినేనిని, పలు ప్రయత్నాలతో జగన్ సర్దుబాటు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి అనేక సందర్భాల్లో జగన్ రాజకీయ, పాలనా నిర్ణయాల పట్ల అసంతృప్తిని బాలినేని వెలిబుచ్చుతూ వచ్చారు. దీనిని జీర్ణించుకోలేని జగన్, క్రమేపి ఆయనను దూరం పెట్టారు. గత ఎన్నికల సమయంలో కూడా బాలినేని పార్టీ మారే ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. టికెట్ల కేటాయింపు సమయంలోనూ జగన్‌తో ఆయనకు విభేదాలు వచ్చాయి. ఒంగోలు ఎంపీగా తిరిగి మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఉంచాలని బాలినేని చేసిన ప్రయత్నాలను జగన్ తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డిని నియమించాలని జగన్ ప్రయత్నించగా, వ్యతిరేకించారు. తిరిగి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా బాలినేని మనసు మార్చుకున్నట్లు సమాచారం.
ఎంపీల రాజీనామాలతో అలజడి..
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు తమ పదవులకు, వైసీపీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ వెంటనే మోపిదేవి టీడీపీలో చేరారు. అదేక్రమంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు. కిందిస్థాయిలో ఆ పార్టీలోని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో చేరటాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మొదట్లో కాంగ్రె్‌సలోను, ఆ తర్వాత వైసీపీలోను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని వైసీపీకి దూరమవుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇది గమనించిన జగన్ వారం క్రితం ఆయన్ను పిలిపించుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి తీసుకొని రాజకీయంగా యాక్టివ్ కావాలని కోరారు. జనసేనలో చేరే ఆలోచన ఉంటే విరమించుకోవాలని, ఆ పార్టీకి భవిష్యత్ లేదని తిరిగి మనమే అధికారంలోకి రాబోతున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జగన్ మాటలు పట్టించుకోని బాలినేని, వైసీపీలో తనకు జరిగిన అవమానాలను, జగన్ తీసుకున్న అనేక రాజకీయ విపత్కర నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజనీ లాంటి నాయకులు జగన్ దూతగా బాలినేనిని సముదాయించే ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీని వీడాలని నిర్ణయానికి వచ్చిన బాలినేని, వారి ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాల మధ్య ఆయన బుధవారం తన రాజీనామాను జగన్‌కు మెయిల్ ద్వారా పంపారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో భేటీ అయినట్లు తెలిసింది. ఆయనతో జరిగిన చర్చలు ఫలించటం, బుధవారం పవన్‌కల్యాణ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావటంతో వైసీపీకి రాజీనామాను బాలినేని ప్రకటించారు. జనసేనానిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రికి విజయవాడ చేరారు.
వైసీపీలో విలువలు నిల్
వైసీపీలో రాజకీయ విలువలు కరువయ్యాయని రాజీనామా అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పాలనా, రాజకీయపరమైన అనేక నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపితే జగన్ భరించలేకపోయారన్నారు. పైగా పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. తనను ఎన్నో అవమానాలకు గురిచేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఉన్న అభిమానంతోనే వైసీపీలో ఇంతకాలం కొనసాగానన్నారు. ఏఏ సందర్భాల్లో తాను ఇబ్బందిపడ్డానో, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోవాల్సి వచ్చిందో సమయం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’తో బాలినేని మాట్లాడుతూ, తాను ఎలాంటి షరతులు లేకుండా స్వచ్ఛందంగా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. ప్రజాసేవ, పార్టీసేవలో తనను ఎలా వినియోగించుకోవాలనేది పవన్‌కల్యాణ్ నిర్ణయమన్నారు.
బాలినేని టచ్‌లో...
ప్రకాశం జిల్లాలో వైసీపీ గెలిచింది రెండు ఎమ్మెల్యే సీట్లు. అందులో ఒక ఎమ్మెల్యే.. బాలినేని టచ్‌లో ఉన్నారు. ఈ జిల్లాలో ద్వితీయశ్రేణి వైసీపీ నాయకుల్లో పలువురు ఆయన బాటన నడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ జిల్లాలో ఆ పార్టీ తరఫున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలలో కొత్త ఎమ్మెల్యే ఒకరు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నారు. బాలినేని ప్రాతినిథ్యం వహించిన ఒంగోలు కార్పొరేషన్‌లోని మేయర్, మరో 20మంది వరకు కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరో 22 మంది బాలినేనితో ఉన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చర్చల అనంతరం జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులతో కలిసి ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సొంత బావ అయిన వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. బాలినేని వెంట ముఖ్యులు వెళ్లకుండా జిల్లాలోని వైసీపీ నాయకులను ఆపేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు.