Share News

పెద్ద పులికి కారు ప్రమాదం

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:21 PM

నల్లమల రుద్రవరం నార్త్‌ బీట్‌లో పెద్దపులి కోతిపై దాడి చేస్తూ రోడ్డుపైకి వచ్చి వేగంగా పోతున్న కారును ఢీకొట్టి గాయపడింది.

 పెద్ద పులికి కారు ప్రమాదం
రుద్రవరం రేంజ్‌ అహోబిళంసెక్షనలో పెద్దపులిని కారు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రేంజర్‌ శ్రీపతినాయుడు

కోతిని వెంటాడుతూ కారును తగిలి గాయపడ్డ పులి రాజు

గాయాలతో నార్త్‌ బీట్‌లోకి..

అహోబిళం వెళ్లే దారిలో ఈ ఘటన

రుద్రవరం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నల్లమల రుద్రవరం నార్త్‌ బీట్‌లో పెద్దపులి కోతిపై దాడి చేస్తూ రోడ్డుపైకి వచ్చి వేగంగా పోతున్న కారును ఢీకొట్టి గాయపడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన గంగాధర్‌ ఆళ్లగడ్డ పట్టణంలో ఓ వివాహానికి వచ్చి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఏపీ 02 కేడబ్ల్యు 9786 నెంబరు గల ఈ కారులో డ్రైవరు వెంకటరమణ, గంగాధర్‌ తన కుటుంబసభ్యులు ముగ్గురు ముగ్గురు మహిళలతో ప్రయాణిస్తున్నాడు. పెద్దపులి కారును ఢీకొట్టడంతో డ్రైవర్‌ భయాందోళనకు గురై కంట్రోలు చేయలేకపోయాడు. కుడి వైపు ఉన్న విద్యుతస్తంభాన్ని కారు ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారుపై పెద్దపులి పాదముద్రలు పడ్డాయి. ఈ విషయం తెలిసి రుద్రవరం రేంజర్‌ శ్రీపతినాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ ర్‌ ముర్తుజావలి సంఘటనాస్థలానికి సిబ్బందితో చేరుకున్నాడు. రోడ్డుపై పులి చర్మం వెంట్రుకలు కనిపించాయి. గాయపడి నార్త్‌ బీట్‌లోకి వెళ్లిన పెద్దపులి కోసం ఫారెస్టు అధికారులు గాలింపు చేపట్టారు. ఆత్మకూరు, శ్రీశైలం, నంద్యాల నుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. టైగర్‌ ప్రాజెక్టులోని రీసెర్చ్‌ర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో బృందం అడవిలోకి వెళ్లింది.

సంఘటనాస్థలానికి డిప్యూటీ డైరెక్టరు అనురాగ్‌ మీనా

పెద్దపులిని కారు ఢీకొట్టిందన్న సమాచారం అందడంతో నంద్యాల డిప్యూటీ డైరెక్టరు అనురాగ్‌ మీనా రుద్రవరం సబ్‌ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:21 PM