జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను పదిసార్లు చావాలి
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:46 AM
వైసీపీ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన
ఐదేళ్ల జగన్‌ది రాక్షస పాలన అని మండిపాటు
జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను పదిసార్లు
ఆత్మహత్య చేసుకోవాలి!
అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను నిలువునా ముంచేశారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘నేను 1983 నుంచి కాంట్రాక్టర్‌గా ఉన్నా. వైసీపీ ప్రభుత్వం లాంటి దారుణమైన దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసిన తర్వాత తిప్పలు, బాధలు తెలిశాయి. నన్ను జగన్ పెట్టిన బాధతో 10 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి. నాకు గుండె ధైర్యం ఎక్కువ. అందుకే ఐదుసార్లు గుండెపోటు వచ్చినా బతికా. అసెంబ్లీకి జగన్ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నా. దయచేసి జగన్‌ను అసెంబ్లీకి పిలిపించండి. ఆయన్ని పిలవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాంట్రాక్టర్లతో పాటు ప్రజల్ని కూడా అప్పలు పాలు చేసి దుర్మార్గమైన పాలన చేశారు’’ అని బీజేపీ శాసన సభ పక్షనేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చలో తొలుత ఆయన మాట్లాడారు. ప్రసంగం ప్రారంభంలోనే జగన్, వైసీపీ నేతలంతా తన ఆవేదనను టీవీలో చూస్తే సిగ్గుతో చస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ 2014-19లో ఏపీకి 7 లక్షలు ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అప్పటి సీఎం చంద్రబాబు 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చారని, వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1.50 లక్షల సబ్సిడితో కలిపి లబ్ధిదారులకు రూ.3 లక్షలు అందించారన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం కూడా ఉచితం ఇచ్చిందన్నారు. తొలుత 2,61,641 ఇళ్ల నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆ మొత్తం ఇళ్ల నిర్మాణాలను జగన్ వచ్చాక నిలిపివేశారని గుర్తుచేశారు.
దిక్కుమాలిన జగన్
‘‘దిక్కుమాలిక జగన్, దుర్మార్గపు జగన్, నా ఎస్సీ, ఎస్టీలంటూ మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు. వైసీపీకి ఓట్లు వేసిన వాళ్లు కూడా తలదించుకోవాలి. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా 2,38,300 ఇళ్లను ఆపేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కింది. ప్రభుత్వం మారిన తర్వాత కాంట్రాక్టర్లు, ప్రజలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రాక్టర్లు పని చేద్దామంటే డబ్బులు ఆపేశారు. చివరికి చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వలేదు. అడిగితే చంద్రబాబు హయాంలో చేశారు. కాబట్టి వెళ్లి ఆయన్నే అడగండి అని వెటకారంగా మాట్లాడేవారు. ఒక ప్రభుత్వం చేపట్టిన పనులు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించాలన్న కనీస జ్ఞానం కూడా జగన్‌కు లేదు. రాజకీయ వ్యవహారాలు తెలియని అనుభవశూన్యుడైన జగన్ వల్ల రాష్ట్రంలో ప్రజలతో పాటు కాంట్రాక్టర్లు కూడా సర్వనాశనం అయిపోయారు. గతంలో టీడీపీ ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు. వాళ్లేమో ఇల్లు ఎప్పుడు వస్తుందా అని ఆవేదనతో ఎదురుచూశారు. చివరికి వారికి ఇళ్లు ఇవ్వలేదు. జగన్ పెట్టిన ఇబ్బందులకు 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పనులు చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వక, అప్పలుపాలై, బ్యాంక్‌లు కూడా రుణాలు ఇవ్వకపోడంతో నానా ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే అలా ప్రాణాలు తీసుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
నా ఒక్కడికే 84 కోట్ల బకాయి
2014-19 స్వర్ణయుగం అయితే.. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఐదేళ్ల పాటు ప్రతి ఒకరూ ఇబ్బందులు పడ్డారని చెప్పారు. జగన్ ప్రభుత్వం జీవో 94ను ఆమలు చేయలేదని, ఐరన్ ధరలు పెరిగినా ఆ మేరకు బిల్లులు ఇవ్వలేదని వివరించారు. 2023లో బిల్లులు ఇవ్వకపోయినా కాంట్రాక్టర్లు పనులు చేశారన్నారు. నష్టాల్లో కూడా కాంట్రాక్టర్లు టిడ్కో ఇళ్లను నిర్మించారని చెప్పారు. తన ఒక్కడికే రూ.84 కోట్ల మేరకు బిల్లులు రావాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల పేరుతో రుణాలు తీసుకుని జగన్ బటన్ నొక్కుడుకు వాడేశారని, ఇప్పుడు బ్యాంకులు లబ్ధిదారులను పీడిస్తున్నాయని తెలిపారు. రుణాలు చెల్లించకపోతే ఇళ్లు వేలం వేస్తామని, లేదంటే ఉన్న ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఇటు కాంట్రాక్టర్లు, అటు లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని విష్ణుకుమార్ రాజు విన్నవించారు.