Share News

ఆ ఐపీఎస్‌ల కథేంటి?

ABN , Publish Date - Apr 10 , 2024 | 06:32 AM

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అడ్డుగా ఉన్నారంటూ 22 మంది ఐపీఎస్‌ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర

ఆ ఐపీఎస్‌ల కథేంటి?

పురందేశ్వరి లేఖపై మీ జవాబేంటి?

ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఈసీ

జవహర్‌రెడ్డిపైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి ఫిర్యాదు!

ఆయన సీఎం జిల్లావాసి..

ఒకే సామాజిక వర్గం సీనియర్లను పక్కనపెట్టి పోస్టింగ్‌

ఈసీ రంగంలోకి దిగేదాకా..

దొంగ ఓట్లపై చర్యలు తీసుకోలేదు

వైసీపీకి మద్దతుదారుగా ఉన్నారు

లేఖలో పురందేశ్వరి అభియోగం

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అడ్డుగా ఉన్నారంటూ 22 మంది ఐపీఎస్‌ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 1న ఆమె ఈసీకి రాసిన లేఖపై తక్షణం వివరణ ఇవ్వాలని 4వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. అధికార వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షాలకు నష్టం కలిగించేలా ఈ ఐపీఎ్‌సలు అధికార దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలు, అందుకు సంబంధించిన ఆధారాలను తన లేఖకు పురందేశ్వరి జతచేశారు. రాష్ట్రంలో డీజీపీ పోస్టుకు అరడజను మంది అర్హులైన సీనియర్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన సామాజిక వర్గానికి చెందిన జూనియర్‌ అధికారి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని డీజీపీగా రెండేళ్లకుపైగా అదనపు పూర్తి బాధ్యతల్లో కొనసాగించడానికి ప్రధాన కారణం ఆయన వైసీపీ సానుభూతిపరుడు అవడమేనని పేర్కొన్నారు. గత రెండేళ్లలో వైసీపీకి ఆయన ఏ విధంగా సహకరించారో కొన్ని ఆధారాలు పొందుపరిచారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రత కల్పిస్తూ దేశ ప్రధాని మోదీ సభకు కనీస రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. సీఎం కడప పర్యటనకు ప్రధాని సభకన్నా ఎక్కువ మంది పోలీసులను మోహరించారని.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ అధికారులకే అడ్డుపడ్డారని, ప్రజల తరపున పోరాటం చేసే ప్రతిపక్షాలపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు దిగితే బాధిత ప్రతిపక్షాలపైనే కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆమె వివరించారు. వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న డీజీపీని తక్షణమే మార్చేయాలని కోరారు.

సీఎ్‌సపైనా ఆరోపణలు..: 22 మంది ఐపీఎ్‌సలతో పాటు సీఎస్‌ జవహర్‌రెడ్డిపైనా పురందేశ్వరి తన లేఖలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా సీఎం జిల్లాకు చెందినవారని.. అదే సామాజిక వర్గమని, ఎన్నికల కమిషన్‌ రంగంలోకి దిగేవరకూ రాష్ట్రంలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. సీనియర్లను పక్కన బెట్టి స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఆయన్ను సీఎ్‌సగా నియమిస్తే బహిరంగంగానే వైసీపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారని.. వైసీపీ ఓటుబ్యాంకు పెంచారని.. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే ఈ ఇద్దరితోపాటు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులను మార్చాలని కోరారు. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్‌ అధిపతి కొల్లి రఘురామిరెడ్డి, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి తదితరుల వ్యవహార శైలిపైనా ఆధారాలు జతచేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఎన్నికలను ఫలితాలను తారుమారు చేసేందుకు ఈ అధికారులు ప్రణాళికతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2024 | 06:32 AM