Share News

ఆడారి చేరికపై కూటమిలో చిచ్చు!

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:59 AM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆయన్ను చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

ఆడారి చేరికపై కూటమిలో చిచ్చు!

బహిరంగంగానే స్పీకర్‌ అయ్యన్న అసహనం

తెలిసీ ఎందుకు చేశారోనన్న చంద్రబాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆయన్ను చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఆడారి ఇటీవలి వరకూ వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డెయిరీలో ఆర్థిక అవకతవకలపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. శాసనసభలోనూ చర్చ జరిగింది. ఈ ఫిర్యాదులపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభాసంఘం ఇటీవల విశాఖ వెళ్లి డెయిరీ అధికారులతో సమావేశమైంది. ఈ క్రమంలో ఆడారి అప్రమత్తమయ్యారు. వైసీపీలో కొనసాగితే విచారణ ఇంకా లోతుగా జరుగుతుందన్న అంచనాతో కూటమిలోని పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ, జనసేనల్లో చేర్చుకోవడానికి ఆ పార్టీల నాయకత్వాలు సుముఖంగా లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఆమోదం తెలుపడంతో బుధవారం బీజేపీలో చేరిపోయారు. దీనిపై ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ, జనసేన నేతలు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ‘నాకేమీ తెలియదు.

చేరికకు ఒక రోజు ముందు పురందేశ్వరి నాకు ఫోన్‌ చేశారు. ఆడారిని నేర్చుకుంటున్నామని, ఆయున వచ్చి మిమ్మల్ని కలుస్తాడని చెప్పారు. నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్పాను. చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాకే నాకు చెప్పారు’ అని ఆయన తెలియజేశారు. ఈ చేరికపై ఒకరోజు ముందు ఒక బహిరంగ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మంగళవారం సీఎం చంద్రబాబు వద్ద ఈ విషయం ప్రస్తావించారు. ఇలా చేర్చుకుంటే ఆయన అక్రమాలపై ఇక సభా సంఘం విచారణకు ఏం అర్థం ఉంటుందని ప్రశ్నించారు. సీఎం కూడా.. ‘సమస్య వాళ్లకూ తెలుసు కదా! తెలిసి కూడా చేస్తే ఏమనాలి? నేను మాట్లాడతాను’ అని హామీ ఇచ్చారు. ఆనంద్‌ బీజేపీలో చేరబోతున్నారని కొద్ది రోజుల ముందే టీడీపీ అధినాయకత్వానికి సమాచారం అందింది. తొందరపడవద్దని బీజేపీ నేతలకు సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అయినా బీజేపీ నాయకత్వం చేర్చుకుంది.

Updated Date - Dec 26 , 2024 | 04:59 AM