రాష్ట్రపతి పాలనకు పార్లమెంటులో నినదించండి
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:16 AM
ఢిల్లీలో ఈ నెల 24న చేపట్టనున్న ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి రాష్ట్రంలో ఏం జరుగుతోందో వారికి వివరిద్దామని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సూచించారు.
24న ఢిల్లీలో ధర్నాకు అన్ని పార్టీలకూ ఆహ్వానం
వైసీపీ ఎంపీలకు జగన్ ఆదేశం
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఈ నెల 24న చేపట్టనున్న ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి రాష్ట్రంలో ఏం జరుగుతోందో వారికి వివరిద్దామని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సూచించారు. శనివారం ఆయన అధ్యక్షతన తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులను అన్ని పార్టీలకు వివరించడంతో పాటు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆయా ఘటనలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఇదే సమయంలో ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ పార్లమెంటులో నినదించాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు పంపకపోతే రాష్ట్రంలో దారుణాలకు అడ్డకట్టపడదని అన్నారు. ఈ ఘటనలు కేవలం వైసీపీకి సంబంధించిన అంశం కాదని, ఇలాగే వదిలేస్తే ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద దెబ్బ అని జగన్ వ్యాఖ్యానించారు.