Share News

పల్నాడులో రక్త చరిత్ర

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:13 AM

కన్ను పడిన భూముల కబ్జా.. మాట్లాడితే మారణాయుధాలతో దాడులు.. ఎదురు తిరిగితే హత్యలు! ఇలా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితం అంతా అరాచకమే..

పల్నాడులో రక్త చరిత్ర

మాచర్లలో పిన్నెల్లి ఫ్యాక్షన్‌ పాలన

రాజకీయ జీవితమంతా నేరమయమే

సోదరుడితో కలిసి హత్యలు, దాడులు, కబ్జాలు

కేసులు పెట్టడానికీ భయపడిన పోలీసులు

ఈసీ ఆదేశాలు, కొత్త సర్కారు రాకతో మొదలైన చర్యలు

పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌ .. అరెస్టు వార్తతో జనం సంబరాలు

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

కన్ను పడిన భూముల కబ్జా.. మాట్లాడితే మారణాయుధాలతో దాడులు.. ఎదురు తిరిగితే హత్యలు! ఇలా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితం అంతా అరాచకమే.. నేరమయమే.. హత్యలు, దాడులు, కబ్జాలతో చెలరేగిపోయి రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి జడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019 వరకు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టార్గెట్‌ చేసుకుని వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అహంకారపూరితంగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు పోలింగ్‌ తరువాత కొనసాగించిన హింసాకాండలో రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. రామకృష్ణారెడ్డి జైలుపాలు కాగా, తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. పిన్నెల్లి అరెస్టు వార్తతో కారంపూడిలో ప్రజలు బాణసంచా కాల్చి, కేక్‌లు పంచుకున్నారు. నిజానికి, కొత్త ప్రభుత్వం రాగానే పిన్నెల్లి ఆటలు సగం కట్టాయి.

తాజాగా హైకోర్టు తీర్పుతో ఆయన సాగించిన రక్త చరిత్రకు చరమాంకం పడింది. పల్నాడులో ఫ్యాక్షన్‌ పాలన పిన్నెల్లి సాగించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన చింతా శివరామయ్య, ఆదినారాయణతో హత్య చేయించారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో కంచర్ల జల్లయ్యను అదే గ్రామానికి చెందిన ఊరిబండి మన్నెయ్యతో హత్య చేయించారు. మాచర్ల మండలం నాగులవరం పంచాయతీ పరిధిలోని విజయపురిసౌత్‌ పరిధిలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో 1500 ఎకరాలు, టీడీపీ దివంగత సీనియర్‌ నేత వీరమాచినేని సుభా్‌షచంద్రబో్‌సకు చెందిన రూ. కోట్ల విలువైన ఆస్థులను బినామీ పేర్లతో కబ్జా చేశారు. గ్రానైట్‌ రాళ్ల తరలింపు లారీల నుంచి అక్రమ వసూళ్లు, రేషన్‌ బియ్యం, తెలంగాణ మద్యం, బెల్ట్‌షాపులు ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నారు. అక్రమ లేఅవుట్లు, రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, సెబ్‌ తదితర కార్యాలయాల నుంచి ముడుపులు దండుకున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 02:14 AM