Vijayawada Floods: ఛీఛీ.. మీరేం మనుషులు?.. వరద కష్టాల్లో ఉన్న జనం నుంచి కాసులు కూడబెడతారా?
ABN , Publish Date - Sep 02 , 2024 | 03:45 PM
సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని, సమస్త యంత్రాంగ సహాయక చర్యల్లో పాల్గొని అంతా కష్టపడుతుంటే.. నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. కాదేదీ దోపీడీకి అనర్హం అన్నట్టుగా కొందరు అనాగరికతను ప్రదర్శిస్తున్నారు. ఆపదకాలంలో నిశ్రయులుగా మారిన వారి నుంచి డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఊహించని స్థాయిలో వరదలతో తెలుగు రాష్ట్రాల్లో విలయ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాలైతే చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, పరిసర ప్రాంతాలు గత యాబై ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వీధులన్నీ చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. అనేక ఆవాసాలు నీటిలో మునిగాయి. పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఎంతలా అంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాల కన్నీటి కష్టాలను చూసి చలించిపోతున్నారు. దాదాపు రెండు రోజులుగా ఆయన క్షేత్ర స్థాయిలోనే నిర్వీరామంగా పర్యవేక్షణ చేస్తున్నారు.
వరదల్లో చిక్కుకున్న బాధితులకు నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. నిన్న (ఆదివారం) ఉదయం నుంచి ఆయన తింటున్నారో లేదో కానీ కంటి మీద కునుకు మాత్రం వేయడం లేదు. బాధితులను గుర్తించి సాయం అందించేందుకు స్వయంగా ఆయనే పడవల్లో ప్రయాణిస్తున్నారు. భద్రతా సిబ్బంది ప్రమాదకరమని వారించిన ప్రాంతాల్లో కూడా సీఎం పర్యటించారు. మునుపెన్నడూ చూడని కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు పట్టుదలతో, ధైర్యంగా ఆయన ముందుకు కదులుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏకంగా సీఎం కార్యాలయంగా చంద్రబాబు మార్చుకున్నారు. ఆదివారం అక్కడి నుంచే సమీక్షలు జరిపారు. ఆ తర్వాత కూడా ఆయన విశ్రమించలేదు. అర్ధ రాత్రి సమయంలో, తెల్లవారు జామున 3 గంటల సమయంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏడు పదుల వయసులో చంద్రబాబు ఇంతలా కష్టపడడం చూసి సర్వత్రా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.
నాణేనికి మరోవైపు ఇలా..
సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని, సమస్త యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొని కష్టపడుతుంటే.. నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. కాదేదీ దోపీడీకి అనర్హం అన్నట్టుగా కొందరు అనాగరికతను ప్రదర్శిస్తున్నారు. సందట్లో సడేమియాలు పుట్టుకొచ్చారు. ఆపదకాలంలో నిరాశ్రయులుగా మారిన వారి నుంచి డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఈ తరహా ఘటన ఒకటి వరద విలయంలో చిక్కుకున్న విజయవాడలో వెలుగుచూసింది. ఆపదలో ఉన్నవాళ్లకు ఆపన్న హస్తం అందించాల్సిందిబోయి ‘బోటు సర్వీస్ దందా’ మొదలుపెట్టారు. వరద బాధితులతో పడవల ఆపరేటర్లు దందా నిర్వహిస్తున్నారు. ఊహించని రీతిలో రూ.1500 నుంచి రూ.4000 వరకు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గరకు ఎవరైనా వెళ్లేవాళ్లు ఉన్నారా? అంటూ బాధితులను బోట్ నిర్వాహకులు అడుగుతుండడం వీడియోలో వినిపించింది.
ఆపద కాలం నుంచి డబ్బు సంపాదనా?
మానవ సమాజం సిగ్గుపడే ఘటనలు కొన్ని ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. ఆపదలో ఉన్నవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు డబ్బు సంపాదించాలని కక్కుర్తిపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇటీవల వెలుగుచూసింది. వరదలో చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ఓ వ్యక్తి రూ.10 వేలు డిమాండ్ చేశాడు. అయితే డబ్బు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో అతడు రక్షించడం మానుకున్నాడు. దీంతో వరదలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై చాలా విమర్శలు వచ్చాయి. సమాజం ఎటుపోతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం పక్కనపెట్టి ఇలాంటివి చేయడం శోఛనీయమని అంటున్నారు.