Share News

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:25 PM

ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను
Tadepalligudem MLA Bollisetti Srinivas

తాడేపల్లిగూడెం, జూన్ 06: ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు నా భూతో నా భవిష్యత్తు అని ఆయన అభివర్ణించారు.

ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో తనను గెలిపించినందుకు ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎవరైనా లంచం అడిగితే వారిని ఇంటికి పంపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తాను లంచం తీసుకోను.. మరొకరని తీసుకొనివ్వనని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. గత అయిదేళ్లలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.


కూటమిలోని పార్టీ శ్రేణులు వెన్నంటే ఉండి తన విజయం కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. అందరూ కలిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్నారు. మీ ఇంట్లో పెద్దకొడుకుగా ఉంటానని.. ఏ సమస్య వచ్చినా తన ఇంటి తలుపు తట్టాలని నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా బొల్లిశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాను ఉన్నది మీ మీద పెత్తనం చేయడానికి కాదని.. మీకు సేవ చేయడానికి మాత్రమేనని ఈ సందర్భంగా చెప్పారు.

ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జీ ఈతకోట తాతాజీ, టీడీపీ ఇన్‌ఛార్జీ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2024 | 05:17 PM