తెలియదు.. గుర్తులేదు..!
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:51 AM
గుంటూరు జిల్లా తుళ్లూరులో నమోదైన రెండు కేసుల్లో నిందితుడు బోరుగడ్డ అనిల్‌ను రెండోరోజు మంగళవారం కూడా పోలీసులు విచారించారు.
వీడియోలు, ఫొటోలు తీసినందుకే ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడి చేశా
రెండో రోజూ బోరుగడ్డ పొంతన లేని సమాధానాలు
తుళ్లూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తుళ్లూరులో నమోదైన రెండు కేసుల్లో నిందితుడు బోరుగడ్డ అనిల్‌ను రెండోరోజు మంగళవారం కూడా పోలీసులు విచారించారు. పీటీ వారెంట్‌పై రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డను తుళ్లూరు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు పరిచి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. మొదటిరోజు విచారణలో అసలు తాను తుళ్లూరు రానేలేదని చెప్పినట్టు బోరుగడ్డ... రెండోరోజు విచారణలో తుళ్లూరు వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడి తనకు సంబంధం లేని విషయమని, వీడియోలు, ఫొటోలు తీస్తుంటే గొడవ పడిన మాట వాస్తవమని, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి సర్దిచెప్పి పంపినట్లు అంగీకరించారని సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడం గురించి ప్రశ్నించగా... ‘ఏమో.. గుర్తులేదు’ అని సమాధానం చెప్పినట్టు తెలిసింది. 2024 మే 8న రాత్రి 10.30 గంటలకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌పై బోరుగడ్డ అనిల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీస్తున్న ‘ఆంధ్రజ్యోతి ఏబీఎన్’ విలేకరిపై దాడి చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు బోరుగడ్డ, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. టీడీపీ వాళ్లు ఓట్లు కొనుగోలుకు దాబాలో డబ్బులు పంచారని చెప్పాలంటూ తుళ్లూరు ఊరు చివర ఉన్న దాబాలో పనిచేసే వారిని కత్తులతో బెదిరించి, కొట్టి... అదేరోజు రాత్రి 12 గంటల సమయంలో వీడియోలు రికార్డు చేశారు. దాబా వారి ఫిర్యాదు మేరకు అప్పుడే విచారణ జరిపిన పోలీసులు బోరుగడ్డపై మరో కేసు నమోదు చేశారు.