జీవిత భాగస్వాములను కలిపే ‘బ్రెయిన్ వేవ్’!
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:01 AM
సమీప భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో మనిషి ఊహించలేని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్ఎన్ఏ) రాష్ట్ర అధ్యక్షురాలు,
బ్రెయిన్ మ్యాపింగ్‌తో నేర పరిశోధన సులువు
భవిష్యత్తులో నాడీ వైద్య రంగంలో అద్భుతాలు!
ఏపీ న్యూరోకాన్ సదస్సులో విజయ అధ్యక్షోపన్యాసం
గుంటూరు (మెడికల్) జూలై 20: సమీప భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో మనిషి ఊహించలేని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్ఎన్ఏ) రాష్ట్ర అధ్యక్షురాలు, గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి. విజయ తెలిపారు. గుంటూరులో జరుగుతున్న ఏపీ న్యూరోకాన్ 2024 రాష్ట్ర సదస్సులో శనివారం ఆమె ‘బ్రెయిన్ నౌ అండ్ ఫ్యూచర్ ’ అనే అంశంపై స్మారక అధ్యక్షోపన్యాసం చేశారు. తన ప్రసంగంలో ఆమె అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అవి ఇలా ఉంటాయి!
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో హీరో చిరంజీవి, తన వైపు చూడాలంటూ మనసులో హీరోయిన్ను పిలుస్తాడు! ఆ మాట వినిపించినట్లుగా భ్రమపడిన హీరోయిన్ సోనాలి బింద్రే ‘పిలిచావా శంకర్?’ అని అడుగుతుంది. దీంతో హీరో ఉబ్బితబ్బిబ్బవుతాడు. ఇది సినిమాలో కేవలం సరదా సన్నివేశమే కావచ్చు.. కానీ సమీప భవిష్యత్తులో ‘బ్రెయిన్ వేవ్ మ్యాచ్’ అనే టెక్నాలజీ ద్వారా వాస్తవ రూపం దాల్చే అవకాశముంది.
బ్రెయిన్ వేవ్ టెక్నాలజీ ద్వారా వివాహానికి ముందే యువతీ యువకులు తమ కాబోయే భాగస్వామి ఆలోచనలు, అభిరుచులు మెదడు సంకేతాల ద్వారానే తెలుసుకొని, తమ ఆలోచనకు 90 శాతం మ్యాచ్ అయ్యే వారిని పెళ్లికి ఎంచుకోవచ్చు. దాంపత్యంలో వీరి మధ్య ఎలాంటి గొడవలూ రావు!
ఆదిత్య 369 సినిమాలో.. హీరో, ఇతర క్యారెక్టర్లు భవిష్యత్తు కాలానికి వెళతాయి. అక్కడ వారు మనస్సులో అనుకొనే మాటలు లౌడ్ స్పీకర్ ద్వారా బయటకు వినిపిస్తాయి. దీంతో వారు కంగారు పడతారు. ఇదిక్కెడి దిక్కుమాలిన టెక్నాలజీ, మనస్సులో కూడా ఏమీ అనుకోకూడదా? అంటూ ఆయా క్యారెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఇది సినిమాలో సరదా సన్నివేశంగా అనిపించినా.. భవిష్యత్తులో బ్రెయిన్ సంక్రోని అనే వినూత్న ప్రక్రియ ద్వారా నిజం కాబోతుంది. ముఖ్యంగా ఇది నేర పరిశోధనలో కీలక అంశంగా మారే అవకాశం ఉంటుంది.
కోకిల సినిమాలో ఒక స్వామిజీ హత్యకు గురవుతాడు. అతడి కళ్లను హీరోకు అమరుస్తారు. దీంతో హీరోకు ఆ హంతకుడు కళ్లల్లో కనిపిస్తుంటాడు. ఇది సినిమాటిక్ సన్నివేశమే అయినా భవిష్యత్తులో బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా నిజమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హత్యకు గురయ్యే వారిని పోస్టుమార్టమ్ చేసే సమయంలో వారి మెదడులోని విషయాలను బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీతో డీ కోడ్ చేసి నిజమైన హంతకులను తెలుసుకోవచ్చు.
ఇంకా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా గాయపడిన రోగులను త్వరగా కోలుకొనేలా చేయవచ్చు. బ్రెయిన్ ఫింగర్ ప్రింట్ ద్వారా హంతకుడి మెదడులో ఆలోచనలను డీ కోడ్ చేసి హత్య చేసిన వివరాలను సులువుగా రాబట్టవచ్చు. న్యూరో జెనెటిక్స్ ద్వారా దెబ్బతిన్న మెదడు కణజాలం తిరిగి పునఃనిర్మించే అవకాశం ఉంటుంది.
మానవాళికి మేలు మలుపు
భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో కొన్ని పరిశోధనలు మానవ జీవితాలను మలుపు తిప్పే గొప్ప ఆవిష్కరణలుగా నిలుస్తాయని డాక్టర్ విజయ వెల్లడించారు. ఈ సందర్భంగా పక్షవాతం, డిమెన్షియా, పార్కిన్సన్, ఫిట్స్, మైగ్రెయిన్ తదితర మెదడు సంబంధ వ్యాధుల తీవ్రత, వాటి చికిత్సలు, నివారణ వంటి అంశాలను వివరించారు. మన ఆలోచనలు మెదడును నియంత్రిస్తాయని, మెదడు నియంత్రణలో ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని ఆమె తెలిపారు. తన ప్రసంగం అనంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కోరుకొండ బాబ్జీ సూచనలతో హాజరైన వైద్యులందరూ స్టాండింగ్ ఒవేషన్‌తో అభినందనలు తెలిపారు. దీంతో డాక్టర్ విజయ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.