తుంగభద్రపై బ్రిడ్జి కమ్ బ్యారేజీలు
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:14 AM
తుంగభద్ర నదిపై రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణాలకు కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం రాయలసీమ ప్రాంతం రైతాంగం, రాష్ట్ర సాగునీటి నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఏపీకి చెప్పకుండానే కర్ణాటక సన్నాహాలు
కర్నూలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణాలకు కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం రాయలసీమ ప్రాంతం రైతాంగం, రాష్ట్ర సాగునీటి నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీకి కనీసం చెప్పకుండానే కర్ణాటక ముందుకు వెళుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక తలపెట్టిన నిర్మాణాలు జరిగితే కర్నూలు-కడప (కేసీ) కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోస్‌రాజు.. బుధవారం కర్నూలుకు రావడం, ఎంపీని, అధికారులను కలవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి, తుంగభద్ర డ్యామ్‌లో చేరిన పూడిక సాకు చూపి మాన్వి తాలుకా నవలి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే కర్ణాటక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా తుంగభద్ర నదిపై రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి సిద్ధమవుతోంది. అందులో ఒకటి.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలుకా చికలపర్వి గ్రామాన్ని, ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంబళనూరు గ్రామాన్ని కలుపుతూ తుంగభద్ర నదిపై రూ.397.50 కోట్లతో 0.35 టీఎంసీల సామర్థ్యంతో చికలపర్వి బ్రిడ్జి కమ్ బ్యారేజీని తలపెట్టారు. ఇక రెండోవది.... కర్ణాటకలోని రాయచూరు జిల్లా చిన్నమంచాల, కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం మధ్య తుంగభద్ర నదిపై రూ.350 కోట్లతో 0.31 టీఎంసీల సామర్థ్యంలో చిన్నమంచాల బ్రిడ్జి కమ్ బ్యారేజీని నిర్మించాలని కర్ణాటక చూస్తోంది. అయితే, మన రాష్ట్రం ఆమోదం లేకుండా నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి బోస్‌రాజ్ బుధవారం కర్నూలుకు వచ్చారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా, జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, రాయచూరు ఎంపీ కుమార్‌నాయక్‌లతో భేటీ అయ్యారు.
ఇప్పటికే కటకట..
కర్నూలు- కడప (కేసీ) కాలువకు కృష్ణా జల వివాదాల ట్రైబ్యూనల్ (కేడబ్ల్యూడీటీ)-1 31.90 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. ఇందులో 10 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ నుంచి, 21.90 టీఎంసీలు నదీప్రవాహం ద్వారా తీసుకోవాల్సి ఉంది. తుంగభద్రకు వరద రోజులు తగ్గిపోవడంతో కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు ఇప్పటికే సాగునీరు అందని పరిస్థితి ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి వాటా జలాలు 10 టీఎంసీల్లో ఇంజనీర్లు ఇచ్చే ఇండెంట్ మేరకు విడుదల చేసినా, సుంకేసుల బ్యారేజీకి 40-50 శాతం కూడా చేరడం లేదని రాయలసీమ సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఎగువన కర్ణాటక బ్రిడ్జి కమ్ బ్యారేజీలు నిర్మిస్తే వాటిని దాటి ఆ వాటా జలాలు కూడా రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.