AP News : పగ..మేరు
ABN , Publish Date - Sep 07 , 2024 | 03:12 AM
బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు! ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు! వరద తగ్గినట్టే తగ్గి.. ఇళ్లు బాగు చేసుకునేలోపే మళ్లీ బుడమేరు వారితో కన్నీరు పెట్టించింది.
తగ్గి.. అంతలోనే పెరిగిన బుడమేరు
కడుక్కున్న ఇళ్లలోకి తిరిగి వరదనీరు
ఇళ్లను వదిలిపోతున్న బాధితులు
అత్యవసర మందులకు ఇబ్బంది
కొన్నిచోట్ల బీపీ, షుగర్ తదితర
మాత్రలు దొరక్క అవస్థలు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు! ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు! వరద తగ్గినట్టే తగ్గి.. ఇళ్లు బాగు చేసుకునేలోపే మళ్లీ బుడమేరు వారితో కన్నీరు పెట్టించింది. దీంతో ఇక ఉండలేం అంటూ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు, సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మూడో గండి పూడ్చే పని పూర్తి కాకపోవడంతో బుడమేరుకు వరద హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. గురువారం ఇళ్లలోకి వచ్చిన నీరు తొలగిపోవడంతో కింది అంతస్తుల్లో ఉన్నవారు గదులు శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వరద చేరడంతో తల్లడిల్లిపోతున్నారు. వరద అడుగు మేర పెరిగినట్టు చెబుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ డాబా కొట్టు సెంటర్‌లో గురువారం రహదారి కనిపించింది. అలాంటిది శుక్రవారం ఈ రోడ్డుపైకి నీరు వచ్చింది. బుడమేరు వంతెన పిల్లర్ల దిగువ నుంచి ప్రవహించిన నీరు ఇప్పుడు వంతెన శ్లాబ్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. తగ్గిందనుకున్న నీరుపెరగడంతో ఇక ఈ ముంపులో ఉండలేమనుకుని ఇళ్లలో ఎక్కడి వస్తువులు అక్కడ వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. బస్సు పట్టుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉదాహరణకు ప్రవీణ్... సొంతూరు కర్ణాటక రాష్ట్రం.
కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం విజయవాడ వచ్చాడు. బేకరీ పెట్టుకుని స్థిరపడ్డాడు. ముంపు కారణంగా ఆయన కుటుంబం ఇప్పటివరకు అపార్టుమెంట్ పై అంతస్తులో తలదాచుకున్నారు. వరద నీరు తగ్గిందని ఇంటిని నిన్నటినుంచి శుభ్రం చేసుకుంటున్నారు. మళ్లీ వరద నీరు పెరిగి, ఇంట్లోకి వచ్చింది. ఇక ఇక్కడ ఉండలేమని నిర్ణయించుకున్న ప్రవీణ కుటుంబం సామాగ్రి వదిలేసి బ్యాగ్‌ల్లో బట్టలు సర్దుకుని సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది. షేక్ బాబుకు 60 సంవత్సరాలు. మాటలు రావు. పైగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన ఉన్న ప్రాంతం నీటిలో ఉంది. రెండు రోజుల క్రితమే వైద్యులకు చూపించారు. బోటులో తీసుకొచ్చి డాబా కొట్టు సెంటర్‌లో దింపడానికి ఇద్దరు, ముగ్గురు సహాయకులు ఉండాలి. మళ్లీ అక్కడి నుంచి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. దీంతో ఆ కుటుంబం తాము ఉంటున్న ఇంటిని వదిలేసి సత్యనారాయణపురంలోని బంధువుల ఇంటికి చేరుకుంది.
మందుల కోసం తంటాలు
డాబాకొట్టు సెంటర్, ఆంధ్రప్రభకాలనీ, గంగాలమ్మ ఆలయం, పైపుల రోడ్డు, నున్న, రాజీవ్ నగర్, వాంబేకాలనీ ప్రాంతాల్లో వృద్ధులు, పక్షవాత రోగులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు క్రమంతప్పకుండా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఈ మందులు తెప్పించుకోవడానికి కుటుంబ సభ్యులు నానాతంటాలు పడుతున్నారు. అజిత్‌సింగ్ నగర్ నుంచి నున్న, కండ్రిగ ప్రాంతాల్లో షాపులు తెరిచే పరిస్థితి లేదు. దీంతో ఆయా కుటుంబాలు వరద ప్రాంతాన్ని వీడి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.
బీపీ, షుగర్ మాత్రలు అందించాలి
‘‘నా భర్తకు బీపీ, షుగర్ ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఇన్సులిన్, మందులు అయిపోయాయి. ఈ మందులు ఇంటికి తెచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. మా ఇళ్ల వద్దకు వస్తున్న మెడికల్ టీం జ్వరం, జబులకు సంబంధించిన మందులు మాత్రమే ఇస్తోంది. ఈ మందులు వేసుకోకపోవడంతో బీపీ, షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. మాకు తెలిసిన వాళ్లు నగరంలో ఉంటే వారికి ఫోన్ చేసి ఈ మందులను తెప్పించుకున్నాను. వాటిని తీసుకోవడానికి 73వ నంబరు బ్లాక్ నుంచి (అజిత్‌సింగ్ నగర్) డాబా కొట్టు సెంటర్ వరకు నీళ్లలో ఈదుకుంటూ పోవాల్సి వచ్చింది. బీపీ, షుగర్ మాత్రలను ఇంటికి తెచ్చి ఇచ్చే ఏర్పాటు ఉంటే బాగుంటుంది’’
- కోటేశ్వరి, అజిత్‌సింగ్ నగర్