Share News

ఐటీ ఉద్యోగుల కోసం బస్సులు విశాఖలో ఉచితంగా ప్రయాణం

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:40 AM

ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రుషికొండ ఐటీ పార్కుకు ఆర్టీసీ విశాఖ రీజియన్‌ ఈ బస్సులు ఆపరేట్‌ చేయనున్నది.

ఐటీ ఉద్యోగుల కోసం బస్సులు విశాఖలో ఉచితంగా ప్రయాణం

ద్వారకా బస్‌స్టేషన్‌ (విశాఖపట్నం), అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రుషికొండ ఐటీ పార్కుకు ఆర్టీసీ విశాఖ రీజియన్‌ ఈ బస్సులు ఆపరేట్‌ చేయనున్నది. సోమవారం ఐటీ పార్కు వద్ద నాలుగు బస్సులను విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఐటీ ఉద్యోగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఆ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. ఈ బస్సులు పాతగాజువాక, కూర్మన్నపాలెం, విజయనగరం, పెందుర్తి ప్రాంతాల నుంచి ఉదయం 8.00 గంటలకు బయలుదేరుతాయి. అలాగే సాయంత్రం 5.50 గంటలకు ఐటీ పార్కు నుంచి తిరిగి వెళ్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటితో పాటు గాజువాక, ద్వారకా బస్‌స్టేషన్‌ల నుంచి మరో రెండు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఇన్‌చార్జి ఆర్‌ఎం బి.అప్పలనాయుడు వెల్లడించారు. బస్సుల ప్రారంభ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ, డిపో మేనేజర్లు, సిబ్బంది, ఏపీ ఎలకా్ట్రనిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ మేనేజర్‌ కీర్తన ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:40 AM