Share News

సోషల్‌ సైకోలపై ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 14 , 2024 | 05:20 AM

కూటమి ప్రభుత్వంలో కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

సోషల్‌ సైకోలపై ఉక్కుపాదం

అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు

విచారణకు రావాలని డైరెక్టర్‌ ఆర్జీవీకి నోటీసులు

స్టేషన్‌లో విచారణకు మాజీ మంత్రి కాకాణి హాజరు

మాజీ మంత్రి అంబటి ఇంటి నుంచి ఒకరి అరెస్టు

నటులు పోసాని, శ్రీరెడ్డిపై వేర్వేరు జిల్లాల్లో కేసులు

హైదరాబాద్‌లో కంభంపాడు టెకీ అరెస్టు

చంపుతానని బెదిరింపులు.. వర్రాపై మరో కేసు

కూటమి ప్రభుత్వంలో కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వారిపై ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన కేసులో సినీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఐ బి.శివరామయ్య బుధవారం హైదరాబాద్‌ వెళ్లి ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. ఈ నెల 19న ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. కాగా, సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు రాజగోపాల్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ముత్తుకూరు పోలీ్‌సస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ రవినాయక్‌ ఆధ్వర్యంలో 2గంటల పాటు జరిగిన విచారణలో కాకాణి 54 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరోవైపు టీటీడీ చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు పోసాని కృష్ణమురళిపై తెలుగు యువత నాయకులు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, వంగలపూడి అనితను దుర్భాషలాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు విశాఖపట్నం కంచరపాలెం, అనంతపురం, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు చేశారు.


ఇదిలాఉండగా, ఫేస్‌బుక్‌లో ‘నేను మావా’ పేరుతో ఖాతా నిర్వహిస్తూ కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త బాలాజీ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ఆయన్ను నరసరావుపేటలోని జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అమరనాథ్‌రెడ్డిపై నకరికల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కాపారపు వెంకటరమణపై కేసు నమోదు నమోదైంది. బుధవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 27 వరకు రిమాండ్‌ విధించడంతో పెద్దాపురం సబ్‌ జైలుకు తరలించారు.

అంబటి సవాల్‌.. అలా ముగిసింది!

ప్రతిష్ఠకు పోయి సవాల్‌ విసిరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు... వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివి్‌స్టను తానే పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. హోంమంత్రి వంగలపూడి అనితపై ఉమ్మడి గుంటూరు జిల్లా నకిరేకల్‌కు చెందిన పావులూరి రాజశేఖర్‌రెడ్డి మార్పింగ్‌ ఫొటోలతో, అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న రాజశేఖర్‌రెడ్డి.. మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆశ్రయించారు. రాజశేఖర్‌రెడ్డి తనవద్దే ఉన్నాడని... అరెస్టు చేస్తారా... అంటూ ఆయన సవాల్‌ విసిరారు. అంబటికి కేసు పూర్వాపరాలు వివరించిన పోలీసులు ఆధారాలు చూపించారు. దీంతో ఆయనే నిందితుడిని పోలీసులకు అప్పగించేలా చేశారు. రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు గుంటూరులో అదుపులోకితీసుకుని నూజివీడు తీసుకువచ్చారు.

Updated Date - Nov 14 , 2024 | 05:20 AM