Share News

పంటలను ముంచెత్తిన కేసీ నీరు

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:28 PM

మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో కేసీ పంట కాలువలు దెబ్బతినిపోవడంతో పొలాల్లోకి నీరు ప్రవహిస్తోంది.

   పంటలను ముంచెత్తిన కేసీ నీరు
మల్లేవేముల గ్రామ సమీపంలో నీట మునిగిన వేరుశనగ పంట

పంట కాలువలు దెబ్బతినడమే కారణం

పూర్తి కాని మరమ్మతు పనులు

పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులు

చాగలమర్రి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో కేసీ పంట కాలువలు దెబ్బతినిపోవడంతో పొలాల్లోకి నీరు ప్రవహిస్తోంది. గొట్లూరు గ్రామ సమీపంలోని కేసీ డిసి్ట్రబ్యూటరీ నుంచి పంట కాలువకు నీరు విడుదల చేశారు. గ్రామ శివార్లలో పంట కాలువలు దెబ్బతినిపోవడంతో, కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో కేసీ నీరు పొలాల్లో ప్రవహించి పంటలను ముంచెత్తాయి. మల్లేవేముల గ్రామానికి చెందిన రైతులు స్వామిరెడ్డి, నరసింహారెడ్డి, చంద్ర, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మరి కొందరు రైతులకు చెందిన 50 ఎకరాల దాకా నీట మునిగాయి. వేరుశనగ, మినుము, నువ్వు, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చే దశలో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నీటికి ఇసుక సంచులు అడ్డం వేసి సమీపంలోని కుంటల్లోకి నీరు మళ్లించారు. ప్రతి ఏడాది కేసీ నీటితో నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోయారు. . పంట కాలువ పనులు దెబ్బతినిపోవడం, మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడంతో కేసీకి నీరు విడుదల చేయగానే పంట పొలాల్లోకి ప్రవహించి నష్టపోతున్నామని రైతులు విలపించారు. అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని, ఈ ఏడాదైననా కేసీ పంట కాలువ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరారు.

Updated Date - Nov 13 , 2024 | 11:28 PM