Share News

స్లూయిజ్‌ గేట్ల చైన్లు ‘డ్యామేజ్‌’!

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:01 AM

ఒకవైపు బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు... మరోవైపు లింకులు తెగిన స్కోర్‌ స్లూయిజ్‌ గేట్లు! వెరసి..

స్లూయిజ్‌ గేట్ల చైన్లు ‘డ్యామేజ్‌’!

ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం

దెబ్బతిన్న పది స్కోర్‌ స్లూయిజ్‌ గేట్ల చైన్‌లు.. వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కులు పంపే వీలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకవైపు బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు... మరోవైపు లింకులు తెగిన స్కోర్‌ స్లూయిజ్‌ గేట్లు! వెరసి... ప్రకాశం బ్యారేజీకి భారీ డ్యామేజీ కల్గించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందని జలవనరుల శాఖ అనుమానిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్ల గురించి అందరికి తెలుసు. కానీ... ఈ గేట్లకు అటూఇటుగా ఉండే స్కోర్‌ స్లూయిజ్‌ల గురించి ఇంజనీర్లకు మాత్రమే తెలుసు. బ్యారేజీకి ఒకవైపు నాలుగు, మరోవైపు ఆరు స్లూయిజ్‌ గేట్లు ఉంటాయి. ఈ పది గేట్లనూ తెరిస్తే.. ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అదనంగా నదిలోకి వదిలేయవచ్చు. బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గిపోయినప్పుడు.. కింద కూరుకుపోయిన ఇసుకతో, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు (నదిలో కిందికి వెళ్లిపోయేలా) ఈ స్లూయిజ్‌ గేట్లను ఉపయోగిస్తారు. ఈ నెల రెండో తేదీన వరుసగా ఐదు ఇనుపబోట్లు బ్యారేజీని ఢీకొట్టడంతో కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించే చర్యలు చేపట్టిన ఇంజనీర్లు... స్కోర్‌ స్లూయిజ్‌లను పరిశీలించారు. అత్యంత విచిత్రంగా... పది స్లూయిజ్‌లకు బిగించిన గొలుసుల లింకులను తొలగించి ఉన్నట్లుగా గుర్తించారు. దీనివల్ల ఆ గేట్ల పైకి ఎత్తడం కుదరదు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో ఈ స్లూయిజ్‌ గేట్లను ఓపెన్‌ చేసి ఉంటే .. అదనంగా మరో రెండు లక్షల క్యూసెక్కుల వరద బయటకు వచ్చి సముద్రంలోనికి వెళ్లేది. ఆ మేరకు బ్యారేజీపై ఒత్తిడి తగ్గేది. పది స్కోర్‌ స్లూయిజ్‌ల గేట్లకు బిగించి ఉన్న గొలుసులను తీసేయడం ద్వారా అవి పనిచేయకుండా చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందనే జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్కోర్‌ స్లూయిజ్‌లకు గొలుసులు తీసేసి ఉండటాన్ని అధికారులు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. స్లూయిజ్‌ గొలుసులు గురించి, వాటిని ప్రాధాన్యం గురించి సాంకేతికంగా తెలిసినవారే .. ఈ పని చేసి ఉంటారని జల వనరుల శాఖ భావిస్తోంది. ‘‘ఇది ప్రమాదమో, యాదృచ్ఛికమో కాదు. పొరపాటు జరిగితే... ఏదో ఒకటి రెండు గేట్ల గొలుసులు ఊడిపోవచ్చు. కానీ, మొత్తంగా పది గొలుసులు దెబ్బతినవు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడుతుంది’’ అని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 04:11 AM