Chandrababu : చెత్తపన్ను రద్దు
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:38 AM
చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఐదేళ్లూ చెత్త తీయకుండానే పన్నేశారు: సీఎం
పోలవరం రెండేళ్లలో పూర్తి
పీపీపీలో బందరు పోర్టు
2025 డిసెంబరు నాటికి అందుబాటులోకి..
జనవరి ఒకటి నుంచి పీ-4 పథకం అమలు
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
బందరులో బాబు పర్యటన
పోర్టు పనుల పరిశీలన
మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరు
మచిలీపట్నం, అక్టోబరు 2: చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మంచి చేశారు కాబట్టి నేటికీ ఆయన్ను మననం చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అప్పట్లోనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మాగాంధీ కృషి చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. దాన్ని శుభ్రం చేయాలంటే రెండేళ్లు పడుతుందని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం చెత్తను ఎత్తకుండానే చెత్తపన్ను వేసింది. ఎవరైనా ప్రశ్నిస్తే చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు పడేశారు. చెత్తపన్నును రద్దుచేస్తూ కేబినెట్‌లో తీర్మానం చేస్తాం. చెత్త ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే యూనిట్లను గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించాం. ఇప్పుడు అవి కేవలం గుంటూరు, విశాఖపట్నంలో మాత్రమే ఈ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. మిగిలిన అన్నిచోట్లా గత ఐదేళ్లలో నిలిపివేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 2029నాటికి స్వచ్ఛ ఏపీ సాధించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో రాజీపడేది లేదన్నారు. గత పాలకుల పాపాలు నేడు రాష్ట్ర ప్రజల పాలిట శాపాలుగా మారాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగిస్తే గత ప్రభుత్వ హయాంలో విచారణ చేయలేదని, కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైతే దోషులను పట్టుకోనేలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో రథాలు తగలబెట్టేశారని, నేరస్థుడు రాజకీయ ముసుగు వేసుకుంటే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని చెప్పారు. ఇకపై వారి ఆటలు కట్టిస్తామని, ఏ చిన్న సంఘటన జరిగినా దోషులను ఇట్టే గుర్తిస్తామని, కూటమి ప్రభుత్వంలో ఎవరైనా తోక తిప్పితే కట్ చేస్తానని హెచ్చరించారు. కృష్ణానదికి గతంలో ఎన్నడూలేని విధంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. బుడమేరు గట్లు తెగటంతో విజయవాడ మునిగిపోయిందని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు యుద్ధమే చేశానన్నారు. మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశుధ్య కార్మికులు నడుంలోతు నీటిలోనూ కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు.
డ్రోన్ కెమెరాల ద్వారా చెత్త గుర్తింపు
రాష్ట్రంలో పారిశుఽధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇక నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా చెత్త ఎక్కడ ఉందో గుర్తిస్తామన్నారు. ఎవరూ రోడ్డుపై చెత్తవేయొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ఇటీవల కాలంలో గ్యాస్ ధరలు పెరిగినా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవిధంగా దీపావళి పండుగ నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. 2025 మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరుగుదొడ్లు లేని వారిందరికీ మరుగుదొడ్లు కట్టిస్తామని తెలిపారు. 2027 నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తిచేస్తామన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 45 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం ఇవ్వగా, మిగిలిన 10 శాతం స్థానిక సంస్థలు ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తాను చర్చించుకుని ఇంటింటికీ కుళాయి పథకాన్ని కచ్చితంగా పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు.
పోలవరం, బందరు పోర్టులను పూర్తిచేస్తాం
కృష్ణాడెల్టాకు సాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టును రానున్న రెండేళ్లలో పూర్తిచేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. బందరు పోర్టును 2025, డిసెంబరు నాటికి లేదా 2026, మార్చి నాటికి పూర్తిచేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం తన షెడ్యూల్‌లో లేకపోయినా చంద్రబాబు పోర్టు పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. అనంతరం ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకూ బందరు పోర్టు పనులు 24 శాతమే పూర్తయ్యాయని, పోర్టుకు ఇంకా 36 ఎకరాలు అప్పగించాల్సి ఉందని, ఈ భూమిని అప్పగించాలని కలెక్టర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. 4 బెర్తుల్లో పోర్టు పనులను తొలివిడతగా ప్రారంభిస్తామని చెప్పారు. బందరు పోర్టు రాజధాని పోర్టు అని, గంటలోనే చేరుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇసుక కొరత కారణంగా పోర్టు పనులు కొంతమేర జాప్యం జరిగాయని, ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. తెలంగాణ, నాగపూర్ తదితర ప్రాంతాలను పోర్టుకు అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. పోర్టుకు అనుబంధంగా జాతీయ రహదారి ఇప్పటికే అందుబాటులో ఉందని, మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ను కలిపితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. బందరు పోర్టును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆంధ్ర జాతీయ కళాశాల దేవాదాయశాఖ ఆధీనంలో ఉందని, అయితే కొంతమంది వ్యక్తులు దీనిని సొంతం చేసుకున్నారని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర జాతీయ కళాశాలను స్వాధీనం చేసుకుంటుందని స్పష్టంచేశారు.
ఇద్దరు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ...
గతంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులుగా ప్రకటించేలా నిర్ణయించామని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం జనాభా తగ్గిపోతోందని, వృద్ధులే మిగులుతున్నారని, ఈ నేపథ్యంలో జనాభా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు కచ్చితంగా ఉండాలనే నిబంధన పెట్టాల్సి వస్తుందేమో అని చమత్కరించారు. పేదరిక నిర్మూలన కోసం జనవరి నుంచి పి-4 పథకాన్ని అమలుచేస్తానని, నిమ్మకూరు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తానని తెలిపారు.
పుట్టిన రోజున మొక్క నాటండి
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పుట్టినరోజైనా, మననం చేసుకునే రోజైనా వారి గుర్తుగా ఒక చెట్టును నాటాలని, దీంతో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌తో ఎంతో ఉపయోగం ఉందని, ఈ ప్రాజెక్టుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వారిలో తాను ప్రథముడినని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఎదగాలని, ఈ కృషిలో తెలుగు ప్రజలు 33 శాతం ఉండాలని ఆకాంక్షించారు.
వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు
మచిలీపట్నం మెడికల్ కళాశాలకు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, సీఎం హామీ ఇచ్చారు. మచిలీపట్నంలో తీర ప్రాంతం ఉండటంతో తాగునీటి ఎద్దడి ఉందని, శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కొల్లు రవీంద్ర సీఎంకు తెలపగా, సమస్యను పరిష్కరించేందుకు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులను, స్వచ్ఛ చల్లపల్లి సారథులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్-డాక్టర్ పద్మావతి దంపతులను ముఖ్యమంత్రి సన్మానించారు.