Chandrababu : నెల రోజుల్లో సెట్ చేస్తా
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:34 AM
రాష్ట్రంలో సోషల్‌మీడియా పోస్టులు కట్టు తప్పుతుండటం... అరాచక పోస్టులతో వైసీపీ మూకలు రెచ్చిపోతున్న తీరుపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మంచితనాన్ని అసమర్థతగా చూస్తున్నారు
సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సోషల్
సైకోలపై పోలీసుల ఉదాసీనతపై సీరియస్
అరాచక పోస్టులపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ
పోలీసుల్లో వైసీపీ వాసనలు పోలేదన్న మంత్రులు
కొందరి తీరుతో చెడ్డపేరు వస్తోందని ఆవేదన
పోలీసులపై తన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్
ఆడబిడ్డల కంటతడి చూసి తట్టుకోలేకపోయా
ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా ఉంటున్నారు
గట్టి చర్యలు ఉండాల్సిందేనన్న డిప్యూటీ సీఎం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో సోషల్‌మీడియా పోస్టులు కట్టు తప్పుతుండటం... అరాచక పోస్టులతో వైసీపీ మూకలు రెచ్చిపోతున్న తీరుపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు...వైసీపీ సోషల్ సైకోల కట్టడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై కూటమి పార్టీల కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉందని ప్రస్తావించారు. ‘మన ప్రభుత్వం వచ్చినా మనల్నే తిడుతుంటే తట్టుకోలేక పోతున్నాం’ అంటూ కార్యకర్తలు తమవద్ద వాపోతున్నారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. జిల్లాల్లో ఎస్పీలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదని, వైసీపీ వాసనలు ఇంకా పోలీసుల్లో పోలేదని పెదవి విరిచారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తాను చేసిన వ్యాఖ్యలను మంత్రివర్గంలో ప్రస్తావించి గట్టి చర్యలు తీసుకోకపోతే లాభం ఉండబోదన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు గట్టిగా స్పందించారు. ‘చట్ట ప్రకారమే మనం వెళదాం. తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. కచ్చితంగా నెల రోజుల్లో ఏపీలో పోలీసింగ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా’ అని మంత్రులకు భరోసా ఇచ్చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పోలీసులపై తాను చేస్తున్న వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్‌లో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో నేతల కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేస్తున్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీంతో కేబినెట్ సమావేశంలో సుమారు 25నిమిషాల పాటు చర్చ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా శ్రుతిమించి పోతోందని, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని సీఎం పేర్కొన్నారు.
ముందుగా తనపైనా, తన కుటుంబంపైనా పోస్టులు పెట్టారని, ఆ తర్వాత పవన్‌కల్యాణ్ కుటుంబంపైనా, ఇటీవల హోంమంత్రి అనితను టార్గెట్ చేశారని చంద్రబాబు అన్నారు. తన మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటున్నారని, అసత్య పోస్టులను ఇక ఉపేక్షించేది లేదన్నారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో పవన్ వచ్చారు. ఆయన కూడా.. జగన్ ప్రభుత్వంలో చట్టాలు పక్కనపెట్టి మరీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేసిన పోలీసులు.. ఇప్పుడు చట్టబద్ధంగా కూడా స్పందించడం లేదని అన్నారు. అందుకే తాను అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని... రెండు రోజులుగా తానుచేస్తున్న వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులకు తన ఇంటి ఆడబిడ్డలు కంటతడి పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయానన్నారు. దీనిపై గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందేనని పలువురు మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్‌లకు సైతం సరిగా స్పందించడం లేదని, కింది స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం దృష్టికి కొందరు మంత్రులు తీసుకొచ్చారు. వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈ అంశాన్ని సీరియ స్‌గా తీసుకోవాలని పలువురు మంత్రులు కోరినట్లు సమాచారం. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు నిరసనలు తెలిపిన తమను ఆరెస్టు చేయడానికి వచ్చిన సీఐకు... ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టు ఇచ్చిన విషయం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు.
రుషికొండ భవనాలు ఏంచేద్దాం?....
రుషికొండ ప్యాలె్‌సపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. రుషికొండ ప్యాలె్‌సను తాను ఇటీవల చూశానని, తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అటువంటి ఇంధ్రభవనాన్ని చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రుషికొండపై ఏంచేద్దామనేది మంత్రులు సలహాలివ్వాలని సీఎం కోరారు. ఎవరైతే పేద వర్గాలు, ఇల్లు లేనివారు ఉన్నారో వారినీ, పల్లెల నుంచి రైతులను తీసుకెళ్లి రుషికొండ భవనాలను చూపించాలని మెజారిటీ మంత్రులు కోరారు. త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు.
పిఠాపురం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పేరును పిలవడం ఇబ్బందిగా ఉన్నదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘పులివెందుల అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీని పుడాగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే రీతిలో పిఠాపురం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీని పీడాగా పిలవాల్సి ఉంటుంది. అలా పలకడం ఇబ్బంది. దాన్ని మరో రకంగా పిలిచే విధంగా పేరు మార్చాలి’’ అని పవన్ సూచించినట్లు సమాచారం.
కేబినెట్ భేటీ సమయం ఆదా చేయాలి: చంద్రబాబు
కేబినెట్‌లో అజెండాను చదివేందుకు సమయాన్ని వృధా చేయకుండా త్వరగా సమావేశాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అజెండాపై ముందే మంత్రులు అధ్యయనం చేసి రావాలని, దానిపై చర్చను త్వరగా ముగించి.. రాజకీయ అంశాలపై దృష్టి సారించేలా ఏర్పాటు ఉండాలని సూచించారు. ‘‘ప్రధాని నిర్వహించే కేంద్ర కేబినెట్ సమావేశం ఒక్క గంటలో పూర్తవుతుంది. అలాంటిది మన కేబినెట్ 3 గంటలకు పైగా నడుస్తోంది. అజెండాపై చర్చ జరిగిన తర్వాత రాజకీయ సంబంధమైన ముఖ్యమైన విషయాలపై చర్చించుకునేలా ఉండాలి’’ అని చంద్రబాబు అన్నారు.