Share News

Chandrababu : ఏపీ నంబర్‌1

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:47 AM

ఏపీని నంబర్‌వన్‌గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పోలవరం ప్రాజెక్టు వరమని..

Chandrababu : ఏపీ నంబర్‌1

ఇదే మా లక్ష్యం.. పాలనను పరుగులు పెట్టిస్తాం: చంద్రబాబు

ఉత్తరాంధ్రకు నేనున్నా..

పోలవరం, సుజల స్రవంతి పూర్తిచేసి 3.8 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తా!

పోలవరం పూర్తయితే కరువే ఉండదు

రూ.800 కోట్లతో ఎడమ కాలువ పనులు

సూపర్‌ 6 అమలులో రాజీ లేదు

స్టీల్‌ ప్లాంటు తెలుగువాడి ఆత్మగౌరవం

యూటర్న్‌ తీసుకున్నానని నాపై దుష్ప్రచారం

వాజపేయి టైంలోనే ప్రైవేటీకరణను అడ్డుకున్నా.. ఇప్పుడూ కాపాడతా: సీఎం

ఉత్తరాంధ్రలో సీఎం సుడిగాలి పర్యటన

పోలవరం ఎడమ కాలువ పరిశీలన

భోగాపురం విమానాశ్రయం సందర్శన

అనంతరం విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు ఆనక సీఐఐ ప్రతినిధులతో వర్చువల్‌ భేటీ

అనకాపల్లి/విశాఖపట్నం/విజయనగరం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఏపీని నంబర్‌వన్‌గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పోలవరం ప్రాజెక్టు వరమని.. ఇది పూర్తయితే ఈ ప్రాంతంలో కరువనేదే ఉండదని తెలిపారు. వంశధార, కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోనే కరువు ఉండదన్నారు. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను రూ.800 కోట్లతో పూర్తిచేస్తామని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో సుడిగాలి పర్యటన చేశారు. మొదట అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం దార్లపూడిలో ఎడమ కాలువకు సంబంధించిన 6, 7, 8 ప్యాకేజీ పనుల ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం అక్విడెక్ట్‌ వద్దకు వెళ్లి ఆగిన కాలువ పనులను పరిశీలించారు. తర్వాత భోగాపురం విమానాశ్రయానికి వెళ్లి పనులను పరిశీలించారు. తర్వాత విశాఖ వచ్చి స్టీల్‌ ప్లాంటు సమీపానున్న మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించి రెండు కొత్త కంపెనీలను ప్రారంభించారు. దార్లపూడిలో ప్రజలనుద్దేశించి మాట్లాడు తూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట పోలవరాన్ని సందర్శించానని గుర్తుచేశారు. దార్లపూడిలో కాలువ పనులు 72 శాతం వరకూ టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. నాడు ఎక్కడ ఆగిపోయాయో ఇప్పుడూ అక్కడే ఉన్నాయని.. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని మండిపడ్డారు. ఎడమ కాలువ 214 కిలోమీటర్లకుగాను 93 కిలోమీటర్లు పూర్తిచేస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. అర్ధాంతరంగా నిలిచిన ఈ పనులకు రూ.800 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ పనులు పూర్తయితే అనకాపల్లి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అదనంగా అందుతుందన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేసేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 కూసెక్కుల నీటిని తీసుకొచ్చి అనకాపల్లి జిల్లా ప్రజలకు అందిస్తే జన్మ ధన్యమవుతుందని తెలిపారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు కూడా పూర్తయితే అనకాపల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పరుగులు పెట్టించి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. వైసీపీ అసమర్థ, అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు విషయంలో యూటర్న్‌ తీసుకున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దాని విషయం ఏం చేయాలో తమకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడే దీని ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగితే అడ్డుకున్నానన్నారు. తెలుగోడి ఆత్మగౌరవమైన స్టీల్‌ ప్లాంటును కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు. వైసీపీ నాయకులు ఆర్థిక ఉగ్రవాదులుగా మారి విశాఖను దారుణంగా దోచుకున్నారని.. భూము లు కొట్టేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారని ధ్వజమెత్తారు.

ఒక్కొక్కటిగా అమలు..

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమ లు చేస్తున్నామని.. వాటిపై రాజీలేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ‘ఇప్పటికే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేశా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేశాం. ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై దృష్టిపెట్టి వివరాలు సేకరిస్తున్నాం. నాతో పాటు ప్రధాని మోదీ, పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు కాబట్టే అఖండ విజయం చేకూర్చారు. ఏపీ ని నంబర్‌వన్‌గా నిలపాలన్నదే నా ముందున్న ప్రధాన లక్ష్య ం. నార్త్‌ కొరియాలో కిమ్‌ ఆ దేశ ప్రజలు నవ్వినా, ఏడ్చినా శిక్షిస్తాడు. అలాగే ఐదేళ్లుగా ఏపీలో కూడా కిమ్‌ ఒకరు పాలించారు’ అని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి నేతలను గెలిపించిన జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత అనకాపల్లే ఉందని గుర్తుచేశారు. గెలిచామనే ధీమాగా ఉండకుండా ప్రజా పాలనే ముఖ్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

gh.jpg


రెడ్‌ కార్పెట్లు వేసి డబ్బు వృథా చేయొద్దు

గతంలో తాను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజ లు దిగులుగా ఉండేవారని, ఇప్పుడు అందరిలో ఆనందం కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. సభా ప్రాంగణంలో రెడ్‌ కార్పెట్లు వేశారని, ఇకపై ఎక్కడ సభలు జరిగినా కార్పెట్‌లు వేసి డబ్బు వృథా చేయొద్దని అధికారులకు హితవు పలికారు. ఇకముందు కార్పెట్లకు డబ్బు వృథా చేస్తే చర్యలు తప్పవన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడుకు ఎస్‌.రాయవరం మండలం దార్లపూడిలో ఘన స్వాగ తం లభించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ(అనకాపల్లి), పంచకర్ల రమేశ్‌బాబు (పెం దుర్తి), సుందరపు విజయ్‌కుమార్‌(యలమంచిలి), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పుష్పగుచ్ఛాలు అందించారు.

పాలన పరుగులు పెట్టాలి మాది పొలిటికల్‌ గవర్నెన్స్‌..

నాట్‌ బ్యూరోక్రటిక్‌ గవర్నెన్స్‌: చంద్రబాబు

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చేందుకు వీలుగా పాలన పరుగులు తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను 1995లో మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు మాదిరిగా పాలనలో వేగం ఉంటుందని ఇప్పటికే ప్రకటించానని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గురువారం రాత్రి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘మా ప్రభుత్వం పొలిటికల్‌ గవర్నెన్స్‌ తప్ప బ్యూరోక్రాటిక్‌ గవర్నెన్స్‌ కాదు. ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలు సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యమంత్రిని సంతోషపరిచేలా వ్యవహరించవద్దు. ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలి. మాకు రెడ్‌ కార్పెట్‌ వద్దు. మాది సామాన్యంగా పాలన చేసే ప్రభుత్వం. సమర్థ పాలన మా విధానం. నిబంధనలకు లోబడే పాలన ఉంటుంది. అధికారులు అదే తీరులో పనిచేయాలి. వైసీపీ ప్రభుత్వంలో అనేక విధ్వంసాలు సృష్టించి ప్రజలను, ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బందిపెట్టినా.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మా విధానం కాదు. అభివృద్దే ఏకైక ఎజెండాగా పనిచేస్తాం’ అని తేల్చిచెప్పారు.

రాజకీయాల్లో విర్రవీగిన వారిని ఎలా అణగదొక్కాలో ప్రజలకు బాగా తెలుసు. భగవంతుడు ఇచ్చిన శక్తితో సామర్థ్యం ఉన్నంతవరకు వారి కోసం పనిచేస్తా.

ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిచ్చాం. వలంటీర్ల అవసరం లేకుండానే ఒకేరోజు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇచ్చి చూపించాం. ప్రజల శ్రేయస్సే అభిమతంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయం. ఆ గుంతల్లో ఎవరిని పూడ్చాలో ప్రజలే చెప్పాలి. రోడ్లన్నీ ప్రణాళికాబద్ధంగా బాగు చేసేందుకు చర్యలు చేపడతాం.

- సీఎం చంద్రబాబు

మెడ్‌టెక్‌ జోన్‌పై జగన్‌ వివక్ష

అక్కడ తయారైన వైద్య పరికరాలను తీసుకోలేదు

త్వరలో ఏఐ వర్సిటీ: సీఎం

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌ వైద్య పరికరాల తయారీకి గ్లోబల్‌ హబ్‌గా మారాలని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక గురువారం తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన ఆయన స్టీల్‌ ప్లాంటు సమీపానున్న మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించారు. అక్కడ రెండు కొత్త కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....మెడ్‌టెక్‌ జోన్‌లో తయారైన వైద్య పరికరాలను 20 రాష్ట్రాలు ఉపయోగించుకుంటుంటే.. జగన్‌ ప్రభుత్వం వాటిని తీసుకోలేదని, వివక్షకు అంతకు మించిన నిదర్శనం లేదని విమర్శించారు. జోన్‌ ప్రధాన సలహాదారు, సీఈవో జితేంద్ర శర్మ 2016లో తనను కలిసి వైద్య పరికరాల తయారీ పెద్ద పరిశ్రమగా మారిందని, వాటిని ఏపీలోనే తయారుచేయాలని కోరగా.. అందుకు అవసరమైన సహకారం ఇచ్చి ప్రోత్సహించానన్నారు. పెదగంట్యాడ మండలంలో 275 ఎకరాలు కేటాయించగా అందులో 140 పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఆరు వేల మందికి ఉపాధి కల్పించి, ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారన్నారు. కొత్త ఆవిష్కరణలకు నాంది పలికి గ్లోబల్‌ హబ్‌గా మార్చాలని పిలుపిచ్చారు. త్వరలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

Updated Date - Jul 12 , 2024 | 04:49 AM