Chandrababu : అమరావతికి సహకరించండి
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:25 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.
అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించండి!
గోదావరి-పెన్నా అనుసంధానానికి సహకరించండి
విదేశీ పెట్టుబడులు ఏపీకి వచ్చేలా చూడండి
రాష్ట్ర జీఎస్టీలో సర్‌చార్జీని ఒక శాతం పెంచండి
కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు
నిర్మలా సీతారామన్, జైశంకర్‌లతో సీఎం భేటీ
న్యూఢిల్లీ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి కూడా సహకరించాలని విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు జరిపిన చర్చల వివరాలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వెల్లడించారు.
పునర్నిర్మాణానికి సహకరించండి
ఇటీవల సంభవించిన వరదల్లో విజయవాడ సహా పలు ప్రాంతాలకు భారీ ఎత్తున జరిగిననష్టాన్ని పూరించేందుకు, దెబ్బతిన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర జీఎస్టీపై ఒక శాతం సర్‌చార్జీని పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విపత్తుల నుంచి బయటపడేందుకు జీఎస్టీలో ఉన్న నిబంధనల మేరకు ఈ సర్‌చార్జీని పెంచితే వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా పోలవరం నుంచి గోదావరి నదీ జలాలను పెన్నాకు అనుసంధానం చేసేందుకు సహకరించాలని కోరారు. మధ్యప్రదేశ్‌లో కెన్-బెట్వా మాదిరి గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి తోడ్పడితే ఏపీలో కూడా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలైన ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు తాగు నీరు అందుతుందని చెప్పారు. రూ.60 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తే త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను త్వరలోనే రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.
అమరావతికి సింగపూర్ తోడ్పాటు
అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్థరించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి నిర్మాణ పనులకు తోడ్పడేందుకు గతంలో ముందుకు వచ్చిన సింగపూర్ మళ్లీ ఈ పనుల్లో తోడ్పాటును అందించేలా కేంద్రం సహకరించాలని విన్నవించారు. అలాగే, అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో వేలాది మంది తెలుగు విద్యార్థులు విద్య, ఉద్యోగాల పరంగా ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాల గురించి చర్చించారు. ఇక, అమెరికాతో పాటు వివిధ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు తరలి వచ్చేలా సహకరించాలని కోరారు. జైశంకర్ మాట్లాడుతూ.. కేంద్రం...ఏపీకి అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని, చంద్రబాబు నాయకత్వం పట్ల అనేకమందికి విశ్వాసం ఉందని చెప్పారు.
నేడు ముంబైకి బాబు: ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రారంభించి వందేళ్లయిన సందర్భంగా శనివారం జరిగే వేడుకలలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లనున్నారు. ఈ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఆయన శనివారం, ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది: జైశంకర్
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ నూతన అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను చేరుకోవడానికి విదేశాంగ శాఖ తరఫున నిరంతరం సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు జై శంకర్ పేర్కొన్నారు.