Chandrababu : నన్ను కుప్పంలో లాక్ చేయాలని కుట్ర
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:33 AM
రాష్ట్రంలో మరెక్కడా నేను దృష్టి పెట్టకుండా కుప్పంలోనే నన్ను లాక్ చేసేందుకు కుట్ర పన్నారు.
ఓటుకు 5 వేలు పంచారు
కొందరు టీడీపీ నేతలను మభ్యపెట్టారు
అందుకే ఆశించిన మెజారిటీ రాలేదు
పేదరిక నిర్మూలనకు ఇక్కడి నుంచే శ్రీకారం
సింపుల్ ప్రభుత్వం.. సమర్థ పాలన
ఇదే నా సర్కారు విధానం
అధికారులు అలా పనిచేయాలి
బలవంతపు జనసమీకరణలు ఉండవు
భారీ కాన్వాయ్ హంగామా ఉండదు: సీఎం
కుప్పంలో ముగిసిన పర్యటన
కుప్పం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మరెక్కడా నేను దృష్టి పెట్టకుండా కుప్పంలోనే నన్ను లాక్ చేసేందుకు కుట్ర పన్నారు. అందుకే ఇక్కడ ఓటుకు రూ.5 వేలు పంచారు. కొంతమంది టీడీపీ నాయకులను మభ్య పెట్టారు. అయినా పట్టించుకోకుండా రాష్ట్రమంతటా తిరిగాను. అందుకే కుప్పంలో ఆశించిన మెజారిటీ రాలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన రెండ్రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఉదయం అర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. తర్వాత నియోజకవర్గంలోని అధికారులతో, టీడీపీ శ్రేణులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుడతాను. సింపుల్ గవర్నమెంట్.. సమర్థ ప్రభుత్వం (ఎఫెక్టివ్ గవర్నెన్స్) నా విధానం. దీనికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి. గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారులు ఫిజికల్‌గా, వర్చువల్‌గా పనిచేసేందుకు సిద్ధపడండి. బలవంతపు జనసమీకరణతో పెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్ హంగామా ఈ ప్రభుత్వంలో ఉండవు. సాయంత్రం 6 తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు చెప్పాను. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. ఇక్కడ రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు. రాజకీయ ప్రోద్బలంతో గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులను ఎత్తేయండి. గత ఐదేళ్లలో కొందరు అధికారులు మనసు చంపుకొని పనిచేశారు. మరికొందరు వైసీపీ నేతలకు సహకరించారు. నా సొంత నియోజకవర్గానికి రాకుండా నన్ను అడ్డుకున్నారు. నాపైనా హత్యాయత్నం కేసు పెట్టారు’ అని గుర్తుచేశారు.
కష్టపడిన వారికి పదవులిస్తా..
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్కరినీ వదులుకోనని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడిన కష్టం గుర్తుంది. అలాంటివారికి పదవులిచ్చే బాధ్యత నాది. గత ఐదేళ్లలో జరిగినంత హింస, దాడులు, దారుణాలు నా జీవితంలో చూడలేదు. నన్ను నైతికంగా దెబ్బ తీయాలని చూశారు. నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి ప్రలోభపరిచే ప్రయత్నం చేశారు. అయితే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మీరు చేయొద్దు. వారికి, మనకు ఉన్న తేడా ప్రజలకు కనిపించాలి. సామాన్య కార్యకర్తలను ఎంపీలు, మంత్రులను చేసిన ఘనత టీడీపీది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత నాది’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అతిథిగృహంలో శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతుల కుమార్తెకు ‘చరణి’గా చంద్రబాబు నామకరణం చేశారు.
అర్జీల పరిష్కార బాధ్యత కలెక్టర్‌కు..
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా నలుమూలల నుంచీ ప్రజలు ఆయన్ను చూసేందుకు, కలిసేందుకు పోటెత్తారు. బుధవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను అర్జీల రూపంలో చంద్రబాబుకు అందించారు. వారందరినీ ఆయన పేరుపేరునా పలకరించి.. అర్జీలు తీసుకుని పరిష్కార బాధ్యతను కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అప్పగించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, వారితో అధిక సమయం మాట్లాడారు. అనంతరం అధికారులు, నాయకులు కుప్పంలోని పీఈఎస్ హెలిప్యాడ్‌లో ఆయనకు వీడ్కోలు పలికారు. సీఎం పర్యటనలో రవాణా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.