Share News

Chandrababu : శాంతిభద్రతలపై రాజీపడొద్దు

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:42 AM

‘శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడొద్దు. పోలీసు శాఖకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది.

Chandrababu : శాంతిభద్రతలపై రాజీపడొద్దు

పోలీసులకు అన్ని విధాలా అండగా ఉంటాం

ఆడబిడ్డలపై అత్యాచారాలకు

పాల్పడే వారికి శిక్షలు కఠినంగా ఉండాలి

గత ప్రభుత్వం పోలీసుల స్థాయిని దిగజార్చింది

ఆ ప్రభుత్వం పెట్టిన రూ. 763 కోట్ల

బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం

పోలీసు సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు ఇస్తాం: సీఎం

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడొద్దు. పోలీసు శాఖకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై గంజాయి మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారికి అదే చివరి రోజు కావాలి. హిందూపురం, బద్వేలు, బాపట్లలో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి ప్రత్యేక కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడేందుకు కృషిచేయాలి’ అని పోలీసు శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ జీరోకు రావాలని, డ్రగ్స్‌, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడాలని చెప్పారు.

పోలీసులకు టెక్నాలజీ నాలుగో నేస్తం

పోలీసులు టెక్నాలజీని నాలుగో నేస్తంగా వినియోగించుకుని నేరస్తుల ఆట కట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ పోలీస్‌ నంబర్‌వన్‌గా ఉండేలా పోలీసు శాఖలోని ప్రతి ఒక్కరూ శ్రమిస్తే అందుకు అవసరమైన తోడ్పాటు ప్రభుత్వం అందిస్తుందని చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వానికి శాంతి భద్రతలే ముఖ్యమని, పోలీసు శాఖకు ఆయుధాలు, టెక్నాలజీతో పాటు 6,100 మంది సిబ్బందిని అందజేసే బాధ్యత తీసుకుంటామన్నారు.


పోలీసు సంక్షేమానికి ఏటా 20 కోట్లు

ప్రభుత్వ సొమ్ము రూ.500 కోట్లు ఖర్చు చేసి విశాఖలో ప్యాలెస్‌ కట్టుకున్న పేదల ముఖ్యమంత్రి పోలీసులకు సరెండర్‌ లీవులు కూడా ఇవ్వలేదంటూ జగన్‌పై చంద్రబాబు సెటైర్లు వేశారు. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.763 కోట్లు విడతల వారీగా విడుదల చేస్తామన్నారు. ఐదేళ్లుగా పోలీసు సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇకపై ప్రతి ఏటా రూ. 20 కోట్ల చొప్పున విడుదల చేస్తామని తెలిపారు. పోలీసు అమరవీరుల స్థూపాన్ని అమరావతిలో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌, డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.

ప్రత్యేక సీటు వద్దు..

తన కోసం పోలీసులు కుర్చీపై టవళ్లు వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. వేదికపై ఉన్నవారందరితో సమానంగా కూర్చుంటానని తన కుర్చీపై ఉన్న టవల్‌ను ఆయనే స్వయంగా తీసేశారు.

Updated Date - Oct 22 , 2024 | 04:42 AM