Chandrababu : తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు
ABN , Publish Date - Oct 26 , 2024 | 05:26 AM
తన జీవితంలో ఏనాడూ కక్ష రాజకీయాలకు పాల్పడలేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఏ పనిచేసినా నాలుగు సార్లు ఆలోచించి చేస్తానని.. ఒక్కనాడూ చట్టాన్ని ధిక్కరించలేదని చెప్పారు.
చేయనివారి జోలికి పోను.. అన్‌స్టాపబుల్ షోలో బాబు
నేనెప్పుడూ తప్పు చేయలేదు
రాజకీయ కక్షలకు పాల్పడలేదు
చట్ట ధిక్కరణ చేయలేదు
కానీ ఏపీలో కక్ష రాజకీయాలొచ్చాయి
వ్యక్తిగత ద్వేషాలుగా మారాయి
నా అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నా
ప్రజల అండదండలే నన్ను గెలిపించాయి
బాలకృష్ణ షోలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తన జీవితంలో ఏనాడూ కక్ష రాజకీయాలకు పాల్పడలేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఏ పనిచేసినా నాలుగు సార్లు ఆలోచించి చేస్తానని.. ఒక్కనాడూ చట్టాన్ని ధిక్కరించలేదని చెప్పారు. అలాంటి తనను అరెస్టు చేయడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేశారు. తన అరెస్టు పరిణామాలు, సంక్షోభాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించేదీ ఈ సందర్భంగా సీఎం వివరించారు. ముఖ్యాంశాలివీ..
బాలకృష్ణ: మీ అరెస్టుతో భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అదిరిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమిటీ అమానుషమన్నారు. ఇది ఎప్పుడూ జరగనిది. చూడనిది. జరగకూడనిది. మీకేం అనిపిస్తోంది?
చంద్రబాబు: నేను జీవితంలో అనేక సంక్షోభాలు చూశాను. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మార్చుకుంటూ సమాజం కోసం పనిచేసుకుంటూ వచ్చాను. బాధ, ఆవేదన సంఘటనలు ఎప్పటికీ మరచిపోలేను. ప్రజాక్షేత్రంలో నంద్యాలలో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి నేరుగా బస్సు దగ్గరకు వచ్చి.. రాత్రి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో బయట రాత్రంతా అలజడి సృష్టించారు. తర్వాత కిందకు వస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు అన్నారు. ఏ విషయంలో చేస్తున్నారో చెప్పాలని అడిగాను. చెప్పకుండా అరెస్టు అంటున్నారని అంటే.. వారు వారెంట్ ఇస్తున్నాం.. ఆ తర్వాత నోటీసు ఇస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలా జరగలేదు. జరుగుతుందని కూడా ఊహించలేం. ప్రజాసామ్యంలో ఏ చిన్నవాడు తప్పు చేసినా.. ఎక్కడ చేశాడో చెప్పి అతడి దగ్గర సమాధానం తీసుకుని.. అందులోని విషయాలు పరిశీలించిన తర్వాత.. తీవ్రమైన విషయం అనుకుంటే అప్పుడు అరెస్టు చేస్తారు. కానీ దీనిని లెక్కపెట్టకుండా అరెస్టు చేశారు. నా జీవితంలో ఏ పనిచేసినా చట్ట ధిక్కరణ చేయలేదు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి చేశాను. రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో దానికి కట్టుబడి చేశాను. ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అది రాష్ట్రంలో ఉన్న ఆనాటి పరిస్థితి. ఆ రోజు అక్కడ నుంచి నేరుగా తీసుకెళ్లడం, తర్వాత పరిణామాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నేను ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాను. ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తారన్న విశ్వాసం ఉంది. అదే నన్ను గెలిపించింది. అదే నిలబెట్టింది.
బాలకృష్ణ: గీత దాటని మనిషి మీరు. మరి మీ కోసం ప్రజలు గీత దాటారు. మిమ్మల్ని మళ్లీ మనస్సులో నిలుపుకొన్నారు. మీకు ఎలా అనిపించింది?
చంద్రబాబు: అరెస్టు చేస్తారనో, ప్రాణం పోతుందనో భయపడితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేం. నా జీవితంలో ఎప్పుడూ రాజకీయ కక్షలతో ముందుకెళ్లలేదు. ముందు నేను రూలింగ్‌లో ఉన్నాను. రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండేవారు. ఆయన కొన్ని సార్లు రెచ్చిపోయినా సంయమనం పాటించాను. రాజశేఖర్‌రెడ్డి కొన్ని విషయాల్లో దూకుడుగా మాట్లాడారు. ఎదుర్కొని వార్నింగ్ ఇచ్చాను. మళ్లీ తగ్గి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి. కానీ మొట్టమొదటసారిగా ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరిత రాజకీయాలు వచ్చిన పరిస్థితి. ఆ కక్ష రాజకీయాలు వ్యక్తిగత ద్వేషాలయ్యాయి. నేను మాత్రం లక్ష్మణ రేఖ దాటను. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. తప్పులు చేయకపోతే మాత్రం వారి జోలికి పోను. జైల్లో ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. బయటకొచ్చి నా కోసం పోరాడిన ప్రజల కోసం శేష జీవితం అంకితం చేయాలని, ముందుకెళ్లాలని ఆత్రపడ్డాను.
బాలకృష్ణ: 53 రోజుల చీకటి జైలు జీవితం.. మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది?
చంద్రబాబు: నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా ద్వారా అడవులు దాటుకుంటూ అమరావతికి తీసుకురావడం, రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో తిప్పి తెల్లవారాక మెడికల్ టెస్ట్‌కు పంపించారు. అక్కడ నుంచి మళ్లీ అక్కడా ఇక్కడా తిప్పితిప్పి కోర్టుకు తీసుకురావడం, వాదనల నెపంతో సాయంత్రం దాకా ఉంచి అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు పంపారు. ఆ రాత్రి చేయని తప్పునకు శిక్ష అనుభవించడం కాకుండా.. అది జరిగిన విధానం ఆలోచించినప్పుడు గుండె తరుక్కుపోయింది. వెనకాల బాధ్యత గుర్తు చేస్తోంది. నేను స్థైర్యం కోల్పోతే ఇక ఏమీ ఉండదు. ధైర్యంగా ఎదుర్కొన్నాను కాబట్టి నా జోలికి రాలేకపోయారు గానీ లేకపోతే ఏమయ్యేదో! ఒక్కటే ఆలోచించాను. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయాల కోసం పనిచేస్తే అదే శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది.
బాలకృష్ణ: రాజకీయానికి దూరంగా ఉండే మా చెల్లాయి, మా అమ్మాయిలు రాష్ట్రమంతా ప్రచారానికి బయటకు వచ్చారు. ప్రతి మహిళా వారి వెన్నంటి నిలిచారు. తమ బిడ్డలుగా దగ్గర చేర్చుకున్నారు.
చంద్రబాబు: అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లు తీసుకున్న నిర్ణయం. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో పాటు ప్రజాచైతన్యంలో ముందుకెళ్లాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. వారందరినీ సంఘటితపరిచేలా ఆలోచించారు. నేను వచ్చే వరకు అకుంఠిత దీక్షతో రోడ్లపై పోరాడారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి భువనేశ్వరి.. వాళ్ల నాన్న సీఎంగా ఉన్నా, నేను సీఎంగా ఉన్నా ఎప్పుడూ బయటకు రాలేదు. మొదటిసారిగా ఇది జరిగిన తర్వాత నిలదొక్కుకుని రాత్రింబవళ్లూ పోరాడారు.
బాలకృష్ణ: ఆకాశంలో సూర్యచంద్రులు.. ఆంధ్రాలో బాబు, కల్యాణ్‌బాబు అంటున్నారు.. చిన్న సందేహం. మీరు కలవబోతున్నారని ఊహించారా?
చంద్రబాబు: ఆయన ఒకసారి విశాఖపట్నం వెళ్లారు. హోటల్‌కు వెళ్తే హోటల్‌లో ఉండడానికి వీల్లేదని నగర బహిష్కరణ చేశారు. ఆయన విజయవాడ వచ్చారు. నన్ను ఎవరూ పిలువలేదు. నేనే వెళ్లి సంఘీభావం ప్రకటించాను. ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పి వచ్చాను. ఆ తర్వాత ఇది జరిగింది. నా అరెస్టు జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉంటే.. రాకుండా ఫ్లైట్ కేన్సిల్ చేయించారు. రోడ్డు మార్గానవస్తే నందిగామ వద్ద ఆపేశారు. రోడ్డు మీద పడుకుని ధర్నా చేశారు. తర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు మీరు, లోకేశ్, కల్యాణ్ వచ్చారు.
బాలకృష్ణ: తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్ అది. లోపల అసలేం జరిగింది?
చంద్రబాబు: ధైర్యంగా ఉన్నారా సార్ అని పవన్ కల్యాణ్ నన్నడిగారు. ఎప్పుడూ అధైర్యంగా ఉండను.. మీరు కూడా ధైర్యంగా ఉండండని నేను చెప్పినప్పుడు.. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా ప్రయత్నాలు చేస్తానని పదే పదే ఆయన చెప్పారు. అందరం కలిసి పోటీ చేద్దామని చూచాయగా అన్నాను. ఆయన కూడా ఆలోచించుకుని ఓకే సార్ అన్నారు. బీజేపీకి కూడా గట్టిగా నచ్చజెప్పి అలయెన్స్‌గా తీసుకొస్తామని చెప్పారు. బయటకు వెళ్లి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.
బాలకృష్ణ: హెలికాప్టర్ ఎక్కి జనాలను చూసే నాయకులున్న రోజుల్లో బెజవాడలో మోకాటి లోతు వరద నీటిలో దిగి దగ్గరుండి ప్రజలను చూసుకున్నారు..
చంద్రబాబు: పది రోజులు భయంకరమైన పరిస్థితి. పాములున్నాయి. డ్రెయిన్, రెయిన్ వాటర్ రెండూ కలిసి పోయాయి. దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కష్టాలున్నప్పుడు మీనమీషాలు లెక్కేస్తే కాదని బోటెక్కాను. ఎస్‌డీఆర్‌ఎఫ్ వాళ్లు మీరు పోవడానికి వీల్లేదు.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.. కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఎలాగైనా లోపలకు వెళ్లాలని చెప్పాను.. వెళ్లాను, చూశాను. చాలా ప్రమాదముందని అక్కడ నుంచి కదలకూడదని ఉద్దేశంతో అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లి బస్సులోనే పది రోజులు బసచేశాను. నేను నడిచాను. ఆఫీసర్లను నడిపించాను. ప్రజలకు అండగా ఉన్నాను. అందరి కళ్ల ముందు నీళ్లున్నాయి. కానీ తాగడానికి లేవు. ఒక తండ్రి రోడ్డుమీదకు వచ్చి.. మూడు రోజుల నుంచి నా కొడుకు నీళ్లు అడుగుతున్నాడు.. ఇవ్వలేకపోతున్నాను. రెండు బాటిల్స్ నీళ్లు ఇవ్వాలని అడిగినప్పుడు బాధ, ఆవేదన కలిగాయి. అన్నీ ఉండి వారికి సహాయం చేయలేకపోయానన్న నిస్సహాయత.. అదే నన్ను ముందుకు నడిపించింది. డ్రోన్లు ఉపయోగించాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలూ ఉపయోగించాం. ప్రజలను కాపాడుకున్నాం. నా జీవితంలో చేయనటువంటి శ్రమ చేశాను. పది రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తెచ్చామంటే ఇది టీడీపీ, ఎన్డీయే చేసిన కృషి.
ప్రేక్షకుడు: తిరుమలేశుడు కలియుగదైవం. అక్కడ అపవిత్ర, కల్తీ జరిగిందని మీరన్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
చంద్రబాబు: నేను హిందువును. అదే సమయంలో క్రిస్టియన్ చర్చిలు, ముస్లింల మసీదులు కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. అందరి నమ్మకాన్ని మనం గౌరవించాలి. దీని గురించి ఎక్కువగా మాట్లాడను. సిట్ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది.
బాలకృష్ణ: పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కోసం దీక్ష మొదలుపెట్టారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి?
చంద్రబాబు: ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా అందరి నమ్మకాలను కాపాడే బాధ్యత నాపై ఉంటుంది. ఎక్కడా ఎలాంటి అపచారం జరగకుండా ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయకుండా పరిపాలన సాగించడం నా బాధ్యత.
బాలకృష్ణ: లోకేశ్ పాదయాత్ర ఎవరి నిర్ణయం?
చంద్రబాబు: తన నిర్ణయమే. తండ్రిగా కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పాను. ఆ సమయంలో పాదయాత్రకు వెళ్లడం కరెక్ట్ కాదని.. విద్వేషకరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అంత సుజావుగా సాగదని, ఇబ్బందులు కలిగించడమే కాకుండా దేనికైనా తెగిస్తారని చెప్పాను. లోకేశ్.. నేను వెళ్లాలి.. కమిట్ అయ్యానన్నాడు. నందమూరి తారకరామారావు మనవడిగానో, చంద్రబాబు కొడుకు గానో, బాలకృష్ణ అల్లుడు గానో కాకుండా నాకంటూ ఒక ప్రత్యేకత కావాలని.. నిరూపించుకుంటానని వెళ్లాడు.. నిరూపించుకున్నాడు.
అమరావతి నగరం మీ కల. సైబరాబాద్ నిర్మాణం మీ ఘనత. అది ఎంత నిజమో.. ఇప్పుడు అమరావతి నిర్మాణం కల ఎప్పటికి.. ఎలా సాకారం అవుతుంది?
చంద్రబాబు: కొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటి్‌షవాళ్లు అభివృద్ధి చేస్తే.. సైబరాబాద్‌ను నేను అభివృద్ధి చేశాను. ఆర్థిక హబ్‌గా తయారుచేసేందుకు అవకాశం వచ్చింది.. చేశాను. ఈ రోజు హైదరాబాద్ మహానగరంగా దేశానికే నెంబర్‌వన్ సిటీగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఈ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు. గత పాలకులెవరూ నాశనం చేయలేదు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పటికీ కూడా దేశానికి కొన్ని నగరాలు కావాలి. చండీగఢ్ వచ్చిన తర్వాత ఏ నగరమూ రాలేదు. నేను కేంద్రం సహకారంతో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన నగరాన్ని ప్రపంచంలో అద్భుతమైన సిటీల్లో ఐదు నగరాల్లో ఒక నగరంగా చేయాలని శ్రీకారం చుట్టాను.