Share News

Chandrababu : బాదుడు లేని పాలన అందిస్తా

ABN , Publish Date - May 10 , 2024 | 05:05 AM

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పన్నుల బాదుడు లేని పారదర్శక పాలన అందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

Chandrababu : బాదుడు లేని పాలన అందిస్తా

జగన్‌లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్‌ నొక్కను

సంపద సృష్టిస్తా.. సంక్షేమం, అభివృద్ధి చేపడతా.. ల్యాండ్‌ యాక్ట్‌తో నష్టం

మన భూములపై హక్కుండదు.. వాటిపై జగన్‌ అప్పు తెచ్చుకునేలా చట్టం

జిరాక్స్‌లివ్వడం వెనుక కుట్ర.. గద్దెనెక్కగానే రెండో సంతకం దీని రద్దుపైనే

మన పాస్‌బుక్స్‌పై జగన్‌ ఫొటో ఏంటి?.. విశాఖలో 40 వేల కోట్ల భూదోపిడీ

మేం రాగానే మక్కెలు విరగ్గొట్టి అన్నీ వెనక్కి తీసుకుంటాం

వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?.. డ్రగ్స్‌, గంజాయే వస్తున్నాయి

యువత భవితపై ఆందోళన, బాధ.. ప్రజల భవిష్యత్‌కు కూటమిదే బాధ్యత

దళితులు, గిరిజనుల ద్రోహి జగన్‌.. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరిస్తాం

హోం గార్డులకు జీతాలు పెంచుతా.. పింఛను రూ.4 వేలు చేస్తా

బకాయిలతో కలిపి జూలై నుంచి ఇస్తా.. టీడీపీ అధినేత స్పష్టీకరణ

కురుపాం, చీపురుపల్లి, విశాఖల్లో భారీ సభలు

పార్వతీపురం/విజయనగరం/విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పన్నుల బాదుడు లేని పారదర్శక పాలన అందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనం భవిష్యత్‌కు కూటమిదే బాధ్యతని భరోసా ఇచ్చారు. జగన్‌ భారీగా అప్పులు తెచ్చి బటన్‌ నొక్కుడు చేసి మిగిలిన మొత్తాన్ని జేబులోకి బుక్కుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి పని తాను చేయనని.. సంపదను సృష్టించి ఆ సొమ్ముతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మిగిలినవీ అమలు చేస్తానన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని విధాలా మంచి పాలన అందిస్తానని తెలిపారు. గురువారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, విశాఖ నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్‌ బటన్‌ నొక్కినా ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదన్నారు. మరోవైపు ధరలు, పన్నులు పెంచేశారని... వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయి తిరిగి అప్పులు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరి జీవితాల్లోనూ వెలుగులు లేవని.. జీవన ప్రమాణాలు పెరగలేదని చెప్పారు. గిరిజనులకు, దళితులకు, బీసీలకు ఒక అన్నగా, తమ్ముడుగా, కుటుంబ పెద్దగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహిళలను మహాశక్తిమంతులుగా తీర్చిదిద్దుతానని, ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన జీవో నంబర్‌ 3ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి స్థానికంగా గిరిజనులకు ఉద్యోగాలు లేకుండా చేసిందన్నారు. గిరిజన ప్రాంతాల ప్రజలు జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా కాటు వేశారని.. గిరిజనుల కోసం 16 పథకాలను తాను అమలు చేస్తే జగన్‌ రద్దు చేసి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. వారి పిల్లల కోసం బెస్ట్‌ ఎవైలబుల్‌స్కూళ్లలో ప్రవేశాలు కల్పించానని.. ఆయన ఇదీ రద్దు చేశానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల కోసం 27 సంక్షేమ పథకాలను, బీసీల కోసం, ఇతర సామాజికవర్గాల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా జగన్‌ రద్దు చేశారని, దగాకోరు జగన్‌ను ఇంటికి పంపించి వైసీపీని భూ స్థాపితం చేయాలని పిలుపిచ్చారు. నవరత్నాలు నవమోసాలని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..


ఆ చట్టంతో మన భూములు గల్లంతే!

మనం భూములు, ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఒరిజినల్‌ పత్రాలు జగన్‌ వద్ద, జిరాక్స్‌ పత్రాలు భూ యజమానుల వద్ద ఉంచడం వెనుక కుట్ర ఉంది. ఈ చట్టం ద్వారా మన భూములపై హక్కులు కోల్పోతాం. అమ్మాలన్నా, కొనాలన్నా ఆ భూమి మనదేనని రుజువు చేసుకోవాలి. అలా రుజువు చేసుకోవాలంటే మళ్లీ అధికారుల చుట్టూనే తిరగాలి. వారు కాదన్నా, వేరే వారికి అనుమతి ఇచ్చినా మన భూమి మనకు దక్కదు. ఇది దురుద్దేశపూరిత చట్టం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తే.. రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే చేస్తానని చంద్రబాబు అన్నారు. మీ ఆస్తి మీ పేరున ఉండాలి గానీ.. మీ ఆస్తిపత్రాలపై జగన్‌ ఫొటో ఏమిటి? వాటిపై ఆయన బొమ్మ వేసుకుంటే మీకు కోపం రావడం లేదా? ప్రజల భూములు అమ్ముకోవడానికి జలగ జగన్‌ పర్మిషన్‌ అవసరమట! మీ భూములకు అమెరికాలో ఎవడో జలగను యజమానిగా పెడతాడు. అలాగే సజ్జల మాదిరిగా ఊరికొక గుమస్తాను పెట్టి ఆ గ్రామంలో ఎవరైనా భూములు అమ్ముకోవాలంటే వారి ద్వారా జలగ పర్మిషన్‌ తీసుకునేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో అందరికీ ఉరేయాలని జగన్‌ చూశాడు. మీరందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు ఉరేయడం ద్వారా జగన్‌కు ఉరేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ఇచ్చిన ఆస్తిపత్రాలను చించేసి చెత్తబుట్టలో వేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తా. రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే చేస్తా. ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్‌ పుస్తకాలు రైతుల ఫొటోతో అందిస్తా. భూ హక్కుపై భరోసా, ధీమా కల్పించి రైతే రాజుగా చేస్తా.

విశాఖ నా గుండెల్లో..

ఈ ఐదేళ్లలో సైకో జగన్‌, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అండ్‌ కో విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములను/ఆస్తులను కబ్జా చేసింది. కూటమి అధికారంలోకి రాగానే మక్కెలు విరగ్గొట్టి ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదవారికి ఖర్చుపెడతాం. విశాఖ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. నన్ను అభిమానించినప్రాంతం.. మంచి ప్రజలు నివాసం ఉండే ప్రాంతం. మా హయాంలో విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు మిలీనియం టవర్‌ కట్టాం. డేటా సెంటర్‌ తెస్తే దాన్ని వైసీపీ అడ్డుకోవడంతో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వైసీపీకి దడ పుట్టించారు. ఎప్పుడూ లేనివిధంగా వారంతా ఎండలో నిలబడి మరీ పట్టుదలతో ఓటు వేయడం మార్పునకు అద్దంపడుతోంది. 90 శాతం మంది కూటమికే వేశారు. మేం వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పోలీసులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం. పోలీసులకు వారానికో రోజు సెలవు ఇస్తాం. హోం గార్డులకు భారీగా జీతాలు పెంచి వారి జీవితాల్లో అనందం నింపుతాం.


బొత్సా.. ఊడిగం చేస్తున్నావా?

ఈ ఐదేళ్లలో విశాఖను పూర్తిగా దోచేశారు. రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేశారు. మరి మంత్రి బొత్స సత్యనారాయణ ఏం చేస్తున్నట్లు.. ఊడిగం చేస్తున్నారా? చీపురుపల్లి బరిలో ఉన్న ఆయన పనైపోయింది. కుటుంబ పాలన చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆయన, బెల్లాన, నెల్లిమర్లలో బడ్డుకొండ, గజపతినగరంలో బొత్స అప్పలనరసయ్య, చిన్న శ్రీను మాత్రమే సమర్థులా.. మిగిలిన నాయకులంతా అసమర్థులేనా? పేద ప్రజల జీవితాలతో జగన్‌ ఆడుకుంటున్నారు. మద్యం షాపులను ప్రభుత్వ పరం చేసి తన కంపెనీల మద్యాన్ని అమ్మకం చేస్తున్నారు. ఆడబిడ్డల తాళ్లు తెంచుతున్నారు.

సంక్షేమ పథకాలకు బ్రాండ్‌ అంబా సిడర్‌ టీడీపీయే. రూ.10 ఇచ్చి రూ. 100 లాగేసే జగన్‌ను నమ్మవద్దు. విద్యుత్‌ చార్జీలను 9సార్లు పెంచారు. మేం నాణ్యమైన విద్యుత్‌ను నిరంత రాయంగా అందించాం. గతంలో రూ. 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.వెయ్యికి చేరిం ది. ఈ జగన్‌ చివరకు చెత్తమీద కూడా పన్ను వేశారు.

పోలింగ్‌కు మరో నాలుగు రోజులే గడువుంది. ఎండగా ఉందని ఇంట్లో ఉంటే బయట కొంపలు కూలిపోతాయి. అందుచేత అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. దాని జీవితాలు మారతాయి. మంచి వ్యక్తికి వేస్తే ప్రజల జీవితాలతోపాటు రాష్ట్ర ముఖచిత్రం మారుతుంది.

- చంద్రబాబు

ఇంతకంటే నాకు ఏం కావాలి?

వైసీపీ నేతలకు విశాఖ ప్రజలపై ప్రేమ లేదు. ఇక్కడి సంపదపైన, ప్రజల ఆస్తులపైనే ప్రేమ. ఇక్కడ ఎన్నో కబ్జాలు జరిగాయి. ఎంతోమంది మెడపై కత్తిపెట్టి ఆస్తులను రాసిస్తావా చస్తావా అని బెదిరించి రాయించుకున్నారు. అలాంటి వారితో నేను మాట్లాడితే ‘ఆస్తిపోయినా ప్రాణం ఉంది. అదిచాలు. బతికుంటే బలుసు ఆకు తినైనా బతకొచ్చు’ అని అన్నారు. ఇది న్యాయమేనా? చేయని తప్పునకు నన్ను జైలో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు లేపేయడానికి ప్రయత్నించారు. కానీ భయపడలేదు. ఒకవేళ పోవాలని దేవుడు రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది. నేను తప్పుచేయలేదు కాబట్టి భయపడక్కర్లేదు. నా కోసం 59 రోజులుపాటు ప్రజలంతా ప్రార్థనలు చేశారు. ఒక నాయకుడిగా అంతకంటే నాకు ఇంకేం కావాలి? 2014 ఎన్నికల్లో జగన్‌ తల్లి విశాఖ ఎంపీగా పోటీ చేస్తే ఓడించి పంపించడం.. విశాఖ ప్రజల ముందుచూపును తెలియజేసింది. సొంత చెల్లి ఏ చీర కట్టుకుందో మాట్లాడే అన్న ఉన్నాడంటే అది మనకర్మ కాకపోతే ఇంకేమనుకోవాలి?

Updated Date - May 10 , 2024 | 05:05 AM