Chandrababu : గెలుస్తున్నాం.. రేపంతా జాగ్రత్త!
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:02 AM
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
గెలుస్తున్నాం.. రేపంతా జాగ్రత్త!
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం
కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం
ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి
పూర్తి ఫలితాలు వచ్చేదాకా అశ్రద్ధ వద్దు
డిక్లరేషన్ తీసుకున్నాకే బయటకు రావాలి
కూటమి అభ్యర్థులతో బాబు జూమ్ కాన్ఫరెన్స్
అరుణ్‌సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల హాజరు
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోందన్నారు. రాష్ట్రంలో విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు బాగా సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. ఆదివారం కూటమి అభ్యర్థులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపాయన్నారు. కూటమి అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్‌పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్ రోజు అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశముందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని చంద్రబాబు సూచించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో 53 శాతం ఓట్లతో ఏన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ... కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీమ్‌ను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.
కౌంటింగ్ ఏర్పాట్లలో బాబు నిమగ్నం
కౌంటింగ్‌కు సంబంధించి పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలపై కొందరు పార్టీ ముఖ్యులతో ఆయన మాట్లాడారు. కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత అవసరమని నేతలు నివేదించారు. ఆ విషయాలను కమిషన్ దృష్టికి తేవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పలు జిల్లాల నేతలు, జోనల్ ఇన్‌చార్జులతో ఫోన్‌లో మాట్లాడి ఓట్ల లెక్కింపు రోజు పార్టీపరంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టాల్సిన చర్యలపై కూడా సంబంధిత విభాగాల వారితో మాట్లాడారు. న్యాయ విభాగానికి చెందిన వారు ఆ రోజు అందుబాటులో ఉండేలా చూడాలని, కొందరు సీనియర్ నేతలు పార్టీ పర్యవేక్షణ విభాగంలో ఉండి జిల్లాల్లో ఏమైనా సమస్యలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని ఆదేశించారు. పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ రెండు రోజులు తమ జిల్లాలు వదిలి బయటకు కదలవద్దని, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. నేతలంతా జిల్లాల్లో ఉండిపోవడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందడి తగ్గింది. కౌంటింగ్ రోజు ఉద్రిక్తతలు ఏవైనా పెరుగుతాయేమో అన్న అభిప్రాయంతో పోలీస్ శాఖ టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కొంత అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది.