Share News

ప్రకాశం బ్యారేజీ ‘స్లూయిజ్‌’ చైన్ల మార్పు!

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:17 AM

ప్రకాశం బ్యారేజీకి ఉన్న స్లూయిజ్‌ గేట్ల చైన్లను మార్చాలని జలవనరుల శాఖ అధికారులు యోచిస్తున్నారు. బ్యారేజీకి విజయవాడ వైపున ఆరు,

ప్రకాశం బ్యారేజీ ‘స్లూయిజ్‌’ చైన్ల మార్పు!

కొత్తవి ఏర్పాటు చేయాలని కన్నయ్యనాయుడు సూచన

దెబ్బతిన్న చైన్‌ను పరిశీలించిన బెకమ్‌ కంపెనీ

విజయవాడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీకి ఉన్న స్లూయిజ్‌ గేట్ల చైన్లను మార్చాలని జలవనరుల శాఖ అధికారులు యోచిస్తున్నారు. బ్యారేజీకి విజయవాడ వైపున ఆరు, గుంటూరు వైపున ఎనిమిది స్లూయిజ్‌ గేట్లు ఉన్నాయి. వాటికి ఇరువైపులా సమాంతరంగా రెండు చైన్లను బ్యారేజీపై ఉన్న మోటార్లకు అనుసంధానం చేశారు. 2019లో ప్రకాశం బ్యారేజీకి సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో విజయవాడ వైపు ఉన్న స్లూయిజ్‌ గేట్ల చైన్లు దెబ్బతిన్నాయి. వాటిని మార్చాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొద్దిరోజుల క్రితం బ్యారేజీకి 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో ఐదు కార్గో బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. ఈ క్రమంలో మూడు కౌంటర్‌ వెయిట్లు ధ్వంసం కాగా, వాటి స్థానంలో ఇనుప కౌంటర్‌ వెయిట్లు ఏర్పాటు చేశారు. కాగా, కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్నప్పుడు జలవనరుల శాఖ ముఖ్యసలహాదారుడు కన్నయ్యనాయుడు బ్యారేజీ మొత్తాన్ని పరిశీలించారు. బ్యారేజీకి చేయాల్సిన మరమ్మతుల గురించి ఇంజనీరింగ్‌ అధికారులకు వివరించారు. అందులో భాగంగానే స్లూయిజ్‌ గేట్ల చైన్లు మార్చాలని సూచించారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద బోట్ల రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న బెకమ్‌ కంపెనీ శుక్రవారం ఒక స్లూయిజ్‌ గేటుకు ఉన్న చైన్‌ను పరిశీలించి కొలతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని స్లూయిజ్‌ గేట్లకు కొత్త చైన్లు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:17 AM