వెంటాడి.. ట్రాక్టర్, డోజర్‌తో ఢీకొట్టి..
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:08 AM
రాజకీయ కక్షల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకుడి కుటుంబాన్ని హతమార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు.
ప్రకాశంలో బుసలు కొట్టిన రాజకీయ కక్షలు
జనసేన నాయకుడి కుటుంబాన్ని హతమార్చేందుకు వైసీపీ నేత ప్రయత్నం
దంపతులు సహా ఐదుగురికి గాయాలు
గ్రామస్థులు రావడంతో నిందితులు పరార్
పుల్లలచెరువు, సెప్టెంబరు 15: రాజకీయ కక్షల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకుడి కుటుంబాన్ని హతమార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. పొలానికి వెళ్తున్న వారిని వెంటాడి ట్రాక్టర్‌తోనూ, డోజర్ యంత్రంతోనూ ఢీకొట్టారు. అయితే సరిగ్గా స్థానికులు చూసి పరుగుపరుగున రావడంతో అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ దాడిలో జనసేన నేత ఏడుకొండలుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు నలుగురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మర్రివేములలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన గాజుల ఏడుకొండలు, గాజుల ఆదెయ్య బంధువులు. వారి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఏడుకొండలు గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదెయ్య వైసీపీలో క్రియాశీలకం ఉన్నారు. దీంతో కొంతకాలంగా వీరి మధ్య రాజకీయ కక్షలు నెలకొన్నాయి. ఏడుకొండలు తన వ్యవసాయ భూమికి ఆదెయ్య పొలంలో మీదుగా వెళ్లాలి. ఏడాది క్రితమే ఆదెయ్య ఆ భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఏడుకొండలుతో గొడవ పెట్టుకొనేందుకే ఈ భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఏడుకొండలు, ఆయన కుటుంబం పొలానికి వెళ్లే క్రమంలో ఆదెయ్యతోపాటు ఆయన వర్గీయులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మిరప నాటేందుకు తమ పొలానికి వెళ్తున్న ఏడుకొండలు కుటుంబాన్ని వైసీపీకి చెందిన ఆదెయ్య వర్గీయులు ట్రాక్టరు, డోజర్ యంత్రంతో ఢీకొట్టారు.
వారు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వాహనాలతో వెంబడించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో వాహనాలకు అక్కడే వదిలి పారిపోయారు. ఆదెయ్య అన్న గాజుల రామయ్య డోజర్, ఆదెయ్య కుమారుడు గాజుల వెంకటేశ్వర్లు ట్రాక్టర్ నడిపి తమను తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాజుల ఏడుకొండలు గుండెల్లో బలంగా ఒత్తుకున్నాయి. ఆయన భార్య గాజుల నారాయణమ్మకు నడుము, కుమారుడు గాజుల ఆదికేశవులుకు కాలు విరిగింది. దీంతో వీరిని హుటాహుటిన వినుకొండ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం నారాయణమ్మను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఏడుకొండలు తండ్రి చెన్నయ్య, బాబాయి సీతయ్యలకు గాయాలయ్యాయి. వీరు ఎర్రగొండపాలెంలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. జనసేన మండలాధ్యక్షుడు కొటారి అచ్చెయ్య గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎస్‌ఐ బత్తుల బాబూరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోకపోవడంతో వారు పరారయ్యారు. బాధితుల వద్దకు సిబ్బందిని పంపి వివరాలు ఆరా తీస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.