Share News

సంతసం ఏదీ?

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:54 PM

పంట బాగా పండిందన్న సంబరం తో దిగుబడిని మార్కెట్‌కు తీసుకువస్తే, ఇక్కడ ధర ఎంత పలికిందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. మాయా మార్కెట్‌తో నిలువునా మునిగిపోతున్నారు. ఆనలైన విధానంలో ట్రేడర్లు రైతులకు పంగనామాలు పెడుతున్నారు.

సంతసం ఏదీ?
మార్కెట్‌కు వచ్చిన చీనీ ఉత్పత్తులు

మార్కెట్‌లో మాయ !

ఆనలైన విధానంతో రైతులకు పంగనామాలు

వేలం పూర్తి అయినా ధర తెలియని దుస్థితి

మార్కెట్‌లో ట్రేడర్లు నిర్ణయించిందే ధర

మార్కెట్‌ యంత్రాంగం పర్యవేక్షణ కరువు

అనంత సంతలో చితికిపోతున్న చీనీ రైతు

అనంతపురంరూరల్‌, జూలై 23: పంట బాగా పండిందన్న సంబరం తో దిగుబడిని మార్కెట్‌కు తీసుకువస్తే, ఇక్కడ ధర ఎంత పలికిందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. మాయా మార్కెట్‌తో నిలువునా మునిగిపోతున్నారు. ఆనలైన విధానంలో ట్రేడర్లు రైతులకు పంగనామాలు పెడుతున్నారు. మార్కెట్‌లో వారు నిర్ణయించిందే ధర. ఈక్రమంలో అందినకాటికి రైతులను దోచుకుంటున్నారు. మార్కెట్‌ యంత్రాంగం పర్యవేక్షణ గాడి తప్పడంతో ట్రేడర్లు చెప్పిదానికి సిబ్బంది తలూపుతున్నారు. దీంతో రైతులకు పంట పండినా నష్టాలు తప్పడం లేదు. ఇదీ అనంతపురం మార్కెట్‌లో చీనీ రైతులు దుస్థితి.

ఆనలైన విధానంతో రైతులకు పంగనామాలు..

ఆనలైన విధానంలో రైతులకు ట్రేడర్లు పంగనామాలు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విధానంలో ట్రేడర్లు ముందుగానే తమకు కావాల్సిన దిగుబడి రకాన్ని ఎన్నుకుని రేటు కడుతున్నారన్న వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. వ్యాపారులతో ముందుగానే మాట్లాడుకుని వేలంలోకి దిగుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ట్రేడర్లు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేట్లను ఫలానా లాట్‌ ఇంతే కోడ్‌ చేయాలి. ఈరోజు ఇంతే ధర ఉండాలని నిర్ణయించి వేలంలో పాల్గొంటున్నట్లు విమర్శలున్నాయి. బహిరంగ వేలం కాకపోవడంతో వేలం పూర్తి అయ్యే వరకు తమ దిగుబడులు ఎంత ధరకు అమ్ముడుపోయాయో రైతులకు తెలియడం లేదు. ఒక వేళ ధర నచ్చక సరుకు వెనక్కు తీసువెళాదామంటే పచ్చి సరుకు కావడంతో వెళ్లలేని పరిస్థితి. దీంతో ట్రేడర్లు కట్టిందే ధరగా మారింది. ఆ రేటుకు తమ పంటను విక్రయించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. కాగా ఒక వేల ఎవరైనా కొంత రేటు ఎక్కువ వేశారంటే ఇతర ట్రేడర్లు అందరూ ఆ ట్రేడర్‌పైకి ధ్వజమెత్తునట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఓ రైతుకు ఓ ట్రేడరు టన్ను రూ.18వేలతో కట్టించాడు. అలాంటి కాయలకే మరో ట్రేడర్‌ రూ.15వేలతో కట్టించాడు. దీంతో తక్కువ ధర పలికిన రైతు ట్రేడర్‌తో గొడవకు దిగాడు. ఈక్రమంలోనే వ్యవహారం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దారితీసింది. ఈక్రమంలోనే సదరు ట్రేడర్ల మధ్య వాదనలు జరిగినట్లు తెలుస్తోంది.

ధర ఎంతో రైతులకు తెలియని దుస్థితి..

మార్కెట్‌లో ఈ-నామ్‌ విధానంలో చీనీ వేలం జరుగుతోంది. ఇది రైతులకు ఏవిధంగా మేలు జరుగుతుందో తెలియని పరిస్థితి. రైతులు మార్కెట్‌కు చీనీ కాయలను తీసుకురావడం. ఆతరువాత మార్కెట్‌ సిబ్బంది రైతుల వివరాలు, ఎంత దిగుబడి మార్కెట్‌కు తీసుకువచ్చారు? వంటివి ఆనలైనలో నమోదు చేస్తారు. ఆ తరువాత వేలం నిర్వహిస్తున్నారు. మార్కెట్‌లోని ట్రేడర్లు నిర్ణయించిన ధరను మార్కెట్‌ సిబ్బంది రైతులకు తెలియజేస్తున్నారు. ఈప్రక్రియ అంతా ముగిసేసరికి రెండు మూడు గంటలు సమయం పడుతోంది. దీంతో రైతులకు తమ దిగుబడులు ఎంత ధర పలికాయో అంత వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విధానంలో రైతులకు ఏమేలు జరిగుతుందో సంబంధిత అధికారులకే తెలియాలి. బహిరంగ వేలం నిర్వహిస్తే తమ దిగుబడులు ఎంత ధర పలుకుతున్నా యో రైతులకు స్పాట్‌లో తెలిసే వీలుంటుంది. ఈక్రమంలోనే ఆ ధరకు రైతు తమ దిగుబడులు ఇవ్వాలనుకుంటే ఇస్తాడూ, లేదంటే మరొకరికి విక్రయించుకునే వీలుంటుంది. ఆ విధంగా వేలం జరిగితే తమకు లాభ నష్టాలు తెలుస్తాయని రైతులు అంటున్నారు. ఆనలైన విధానంలో ఇవేవీ తెలియకపోవడంతో ట్రేడర్లు నిర్ణయించిన ధరకు తమ దిగుబడులను అమ్ముకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.

లోపించిన పర్యవేక్షణ

మార్కెట్‌లో అధికార యంత్రాంగం పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇన్ని టన్నులు చీనీకాయలు మార్కెట్‌కు వచ్చాయి. వీటి ద్వారా మార్కెట్‌కు పన్నురూపంలో ఇంత ఆదాయం వచ్చిందని చెప్పుకోవడంతోనే అధికారులు సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో రైతులకు లాభం జరుగుతోందా? నష్టం జరుగుతోందా? అన్న విషయాల గురించి యంత్రాంగం పట్టించుకో వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్కరోజులోనే తగ్గించేశారు: వెంకటేష్‌ నాయక్‌, రైతు పాళ్యంతండా, పామిడి మండలం.

ధర బాగుందని టన్నుకుపైగా కాయలను మార్కెట్‌కు తీసుకొచ్చా. టన్ను రూ.13వేలతో అమ్ముడుపోయాయి. నిన్నటి రోజునా ఇలాంటి కాయలే రూ.18వేలతో అమ్ముడుపోయాయి. ఒక్కరోజులోనే రేటు తగ్గించేశారు. మార్కెట్‌కు వచ్చేటప్పుడు కల్లూరు వద్ద రూ.16,500తో అడిగారు. ఇవ్వకుండా వచ్చినందుకు లాభం కంటే నష్టమే మిగిగింది.

ఏమి తెలీయడంలేదు: పక్కీరప్ప, రైతు, నాగలూరు,

బత్తలపల్లి మండలం.

మార్కెట్‌కు ఆరు టన్నులకు పైగా కాయలు తీసుకొచ్చా. ఆనలైనలో వేలం వేశారంటా. వేలం వేసి రెండు గంటలు(10.30గంటల సమయంలో) గడిచిపోయాయి. ఇంత వరకు ఎంత ధర పలికిందో తెలియడం లేదు. ఎంత రేటు కట్టారో ఎవరూ చెప్పడం లేదు. బహిరంగ వేలం నిర్వహిస్తే కనీసం ధరైనా తెలిసేదీ. ఆనలైన విధానంతో ఏమీ తెలియడం లేదు.

Updated Date - Jul 23 , 2024 | 11:54 PM