నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం
ABN , Publish Date - Aug 23 , 2024 | 02:08 AM
54 ఏళ్ల కిందట బుడిబుడి అడుగులతో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణం నేడు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలందుకునే స్థాయికి ఎదిగింది.
సూళ్లూరుపేట, ఆగస్టు 22: 54 ఏళ్ల కిందట బుడిబుడి అడుగులతో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణం నేడు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలందుకునే స్థాయికి ఎదిగింది. ఇస్రో ప్రయోగించే రాకెట్ల నుంచి ఉపగ్రహాలను పంపేందుకు ఎన్నో దేశాలు క్యూ కడుతున్నాయి.1969లో తుంబా నుంచి చిన్నచిన్న సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంతో నిర్ణయాత్మక దశకు చేరింది.అక్కడినుంచి చంద్రయాన్-3 ప్రయోగ విజయం వరకూ ఎన్నో మార్లు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది.ఇస్రో చరిత్రలో గొప్ప మైలురాయి చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడమే కాకుండా గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్-3లో పంపిన ప్రజ్ఞాన్, రోవర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావడంతో దేశంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ రోజును భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఇస్రో, భారత ప్రభుత్వం, షార్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంతరిక్ష దినోత్సవాలను నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు.శుక్రవారం న్యూఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
షార్ ఎదిగిందిలా....
ఇస్రో విజయాల్లో శ్రీహరికోటలోని షార్‌కు ప్రముఖ పాత్రే వుంది. 1969లో శ్రీహరికోటను రాకెట్ కేంద్రంగా ప్రకటించారు 1971లో రోహిణి -125 సౌండింగ్ రాకెట్ ప్రయోగాత్మక పరీక్షలు జరపడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1969-79 మధ్యలో కాలంలో ఇక్కడ నుంచి ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు.తొలిసారిగా 1979 ఆగస్టు 10న ఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం చేపట్టారు. 1987లో ఏఎ్‌సఎల్వీ, చిన్న ఉపగ్రహాలను పంపారు. 1993 సెప్టెంబరు 20న పీఎ్‌సఎల్వీ ప్రయోగాలకు ఇస్రో ఇక్కడినుంచే శ్రీకారం చుట్టింది.వరుస విజయాలను అందుకొని చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-1 కూడా పీఎ్‌సఎల్వీ వాహక నౌక ద్వారానే ప్రయోగించడం విశేషం. అధిక బరువు గల ఉపగ్రహాలను పంపేందుకు 2001లో జీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అనంతరం 2014లో జీఎ్‌సఎల్వీ-మార్క్ 3 ప్రయోగం చేపట్టింది. మళ్లీ ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు 2022 ఆగస్టు 7న ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి వాణిజ్యపరంగా దూసుకెంది. ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవం తంగా చేపట్టింది.చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్‌లో గగన్‌యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పలు పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తోంది.