AP News: జగన్ భక్త అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Sep 02 , 2024 | 05:19 PM
దాదాపు రెండు రోజులుగా విజయవాడ వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ముఖ్యంగా వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శించారు.
అమరావతి: దాదాపు రెండు రోజులుగా విజయవాడ వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ముఖ్యంగా వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శించారు. దగ్గరుండి అధికారులను పరుగులు తీయించారు. అయితే అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరిగింది. ఇందుకు కారణమైన కొందరు జగన్ భక్త అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, విజయరావు, గోపాలకృష్ణ ద్వివేది, విజయారావులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
కాగా వరద సహాయక చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) సమీక్ష నిర్వహించారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో సమీక్ష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి చెప్పారు. జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైసీపీకి అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందన్న మంత్రి వివరించారు.
కాగా ఆహార పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామన్న సదరు మంత్రి తెలిపారు. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొని వచ్చి మరీ సీఎంకు మంత్రి తెలియపరిచారు. వీఆర్‌లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురు అధికారులు డ్యూటీకి వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కలిగిస్తున్నారని చర్చ జరుగుతోంది. వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలు చేశారని మంత్రి చెప్పారు. మంత్రి ఇచ్చిన ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు.
ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలన్న సీఎం కోరారు. వీఆర్‌లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలిపారు. అయితే పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఆహార పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. సాయంత్రంలోగా పొరుగు జిల్లాల అధికారులతో మాట్లాడి మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
మరోవైపు వరద బాధితుల సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వార్డుకు ఒక సీనియర్ అధికారికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. వరద బాధితులకు పండ్లు అందజేసే విషయంలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, వివిధ ప్రాంతాల నుంచి ఫ్రూట్స్ తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు.