Share News

CM Chandrababu : వైసీపీ సైకోలకు వాత ఖాయం

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:03 AM

విచ్చలవిడిగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా....

CM Chandrababu : వైసీపీ సైకోలకు వాత ఖాయం

‘‘మదం ఎక్కువై, కొవ్వు పేరుకుపోయి జనం మీద

పడుతున్నారు. నాతో సహా మంత్రులు, న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులపై విచ్చలవిడిగా పోస్టులు పెడుతూ, భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఊరుకోం. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా వైసీపీ మూకలకు చాలడం లేదు’’

- సీఎం చంద్రబాబు

అన్ని చట్టాలనూ పరిశీలిస్తాం.. చట్టపరిధిలోనే కఠిన చర్యలు తీసుకుంటాం

మదం, కొవ్వు ఎక్కువై జనం మీద పడ్డారు.. ఆంబోతుల్లా ఆడబిడ్డలపై పడితే ఊరుకోను

క్లెమోర్‌మైన్లు పేలినా లెక్కచేయలేదు.. కానీ, నా భార్యపై మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకున్నా

భావస్వేచ్ఛ పేరుతో అరాచక పోస్టులా?.. ఇలాంటి వాళ్లను చూస్తూ ఊరుకోవాలా?

పోలీసులపై నేరస్థులు పైచేయి సాధిస్తే జరిగేది ఇదే.. తప్పుడు రాతలు రాస్తే వేటే

రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తులు వాళ్లు.. ఒక్క సీటూ గెలవడానికి అర్హులు కాదు

వీరిపై ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

గుంటూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): విచ్చలవిడిగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా....భావ ప్రకటనస్వేచ్ఛ పేరిట ఇలాంటి వాళ్లను సహించాలా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి.. చట్ట పరిధిలోనే అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ సోషల్‌ మీడియా మూకల ఆట కట్టించి తీరుతామని స్పష్టం చేశారు. గురువారం అమరావతి రాజధానిలోని తాళ్లాయపాలెంలో సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలోను, శాంతిభద్రతలు, సోషల్‌ మీడియా సైకోలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనితతో విడివిడిగా జరిపిన సమీక్షలోను ఈ అంశాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘‘వైసీపీ సోషల్‌ మీడియా మూకలు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతున్నాయి. వాళ్లకు కుటుంబాలు లేకపోవచ్చు. మనకు కుటుంబాలు ఉన్నాయి. గౌరవంగా బతకాలనుకుంటున్నాం. అలిపిరిలో 24 క్లెమోర్‌మెన్లు పేలినా లెక్కచేయని నేను అసెంబ్లీలో నా భార్య గురించి మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా.. నా గురించి, హోమ్‌ మంత్రి అనిత గురించి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయన పిల్లల గురించి, న్యాయమూర్తుల కుటుంబాల గురించి విచ్చలవిడిగా పోస్టులు పెట్టి ఇష్టా రాజ్యంగా దాడులు చేస్తే.. చూస్తూ ఊరుకోవాలా.. ఊరుకునే ప్రసక్తే లేదు.

వైసీపీకి వాత పెట్టడం ఖాయం. రౌడీలు, గూండాలు ఏ ముసుగులో వున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆంబోతుల మాదిరిగా ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడితే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ఒక్క సీటు కూడా గెలవడానికి వీల్లేని వ్యక్తులు వైసీపీ వాళ్లని, అసలు రాజకీయాల్లోనే ఉండకూడని వ్యక్తులని ముఖ్యమంత్రి ద్వజమెత్తారు. వైసీపీ నేతల ఇళ్లలో ఆడబిడ్డలు కూడా స్పందించాలనీ, ఆ పార్టీలో తమ కుటుంబ సభ్యులు ఉండడం సబబేనా అనేది ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పోలీసులపై నేరస్థులు పైచేయి సాధిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు. నేరస్తులపై పోలీసులు పైచేయి సాధిస్తేనే వారు అదుపులో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. 1995లో తీవ్రవాదులతో పోరాడానని, మత విద్వేషకుల ఆట కట్టించానని, ఫ్యాక్షన్‌ సంస్కృతిని రూపుమాపానని, ఇప్పుడు వైసీపీ సోషల్‌ మీడియా సైకోల ఆట కట్టి స్తానని తేల్చి చెప్పారు. వ్యక్తులు, కుటుంబాలపై తప్పుడు రాతలు రాస్తే ప్రతి ఒక్కరిపైనా చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు.


గాంధీ జయంతి నాటికి చెత్తలేని నగరాలు

రహదారులు నాగరికతకు చిహ్నమని, అలాంటి రోడ్లను గత వైసీపీ ప్రభుత్వం గుంతలుగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. జాతీయ రహదారులు దాటి రాష్ట్రంలోని రోడ్ల మీదకు వస్తే ప్రజలకు నరకం కనిపిస్తోందన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. అందుకోసం 860 కోట్ల రూపాయలు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడుస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో మున్సిపాలిటీలను 90 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తతో నింపేసిందని తెలిపారు. ఇప్పుడు దాన్ని తరలించడమే పెద్ద యుద్ధంగా మారిందన్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి చెత్త లేని నగరాలను చూస్తామని, ఈ మేరకు మంత్రి నారాయణకు ఆదేశాలిచ్చానని తెలిపారు.


మహిళలపై పోస్టులు పెడితే.. సప్తసముద్రాల ఆవల ఉన్నా వదలం

సోషల్‌ సైకోలపై ప్రత్యేక చట్టం తెస్తాం: అనిత

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో మహిళలపై పోస్టింగ్‌లు పెట్టి, పైశాచిక ఆనందం పొందేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తప్పుడు పోస్టులు పెడితే.. సప్తసముద్రాల అవతల ఉన్నా.. పట్టుకుని తీరతామని హెచ్చరించారు. ఎన్డీయే ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకుని నిలబడేలా, నేరస్తులు భయపడి చచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేయబోమని, చట్టప్రకారం, పద్ధతి ప్రకారమే చర్యలు తీసుకుంటామని వివరించారు. గురువారం అమరావతి సచివాలయంలో అనిత మీడియాతో మాట్లాడారు. తన కులం పేరు పెట్టి, హోంమంత్రి పదవి తనకు ఇవ్వడంపై వైసీపీ సోషల్‌మీడియాలో అసభ్యకరంగా పెట్టిన పోస్టులను గుర్తు చేసుకుంటూ... ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గత ఐదేళ్లూ... ఆకు రౌడీలు, వైసీపీ సైకోలతో ఇళ్లల్లోని మహిళలను నీచాతినీచంగా మాట్లాడించిన చరిత్ర జగన్‌ది. కన్నతల్లి, సొంత చెల్లెలుపైనా తప్పుడు మాటలు మాట్లాడించారు. కానీ, మహిళల గురించి తప్పుగా మాట్లాడితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఊరుకోరు’’ అని అనిత హెచ్చరించారు. ‘‘సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డిని అరెస్ట్‌ చేస్తే జగన్‌కు ఎంతకంత బాధ? వారంట్‌ లేకుండాఎలా అరెస్టు చేస్తారని ఆయన అడుగుతున్నారు. మరి.. ఏ వారంట్‌తో రంగనాయకమ్మను ఆనాడు అరెస్టు చేశారు?’’ అని ప్రశ్నించారు. అధికారం పోయేసరికి జగన్‌కు ఇప్పుడు ఆడబిడ్డలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలు, చిన్నారుల జోలికి వెళ్లిన వారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తే తప్పా? అని మంత్రి నిలదీశారు.

Updated Date - Nov 08 , 2024 | 06:04 AM