Vijayawada Floods: సీఎం సహాయనిధికి సాయం చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:49 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు.
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఈ మేరకు పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ అధికారి మనజీర్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళంగా అందించారు. మరోవైపు స్వస్ఛంధ సేవా సంస్థలు కూడా ముఖ్యమంత్రి పిలుపుతో ముందుకు వచ్చాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జై భారత్ క్షీరా ఆక్వా సంఘం తరఫున 2000, కాస్మో క్లబ్ తరఫున 3000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు.
మరోవైపు.. ఏపీ డిప్యూటీ కలెక్టర్లు సంఘం వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది.