CM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - Sep 08 , 2024 | 09:35 PM
భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఆదివారం) విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బుడమేరులో కబ్జాలతో లక్షల మందికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఎనిమిదో రోజు కూడా బాధితులు వరదలోనే ఉన్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదిలో వరదలు వచ్చాయని పేర్కొన్నారు.
విజయవాడ: భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఆదివారం) విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బుడమేరులో కబ్జాలతో లక్షల మందికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఎనిమిదో రోజు కూడా బాధితులు వరదలోనే ఉన్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదిలో వరదలు వచ్చాయని పేర్కొన్నారు. వాతావరణంలో పెనుమార్పులే వరదలకు కారణమంటూ నిపుణులు చెబుతున్నారని ఆయన ప్రస్తావించారు. వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రకటించారు. ఇక ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. పిఠాపురం ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖలో కొండచరియలు విరిగి పడుతున్నాయంటూ అప్రమత్తం చేశారు. అల్లూరి జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొల్లేరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా విజయవాడ వరద ప్రాంతాల్లో 1200 వాహనాలతో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు 80 సచివాలయాల పరిధిలో రేషన్ పంపిణీ చేశామని తెలిపారు. వరద ప్రాంతాల్లో 7,100 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. వరద ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ చేస్తున్నామని వివరించారు. సహాయక చర్యల్లో నిర్విరామంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని, వరద ప్రాంతాల్లో ఇంకా 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయని వెల్లడించారు. పాడైన వాహనాలకు బీమా సౌకర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, గృహోపకరణాలు మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తు్న్నామని అన్నారు. పాడైన ఆటోలు, కార్లు, బైక్‌లు బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.
‘‘ఆపరేషన్ బుడమేరు వెంటనే ప్రారంభిస్తాం. ల్యాండ్ గ్రాబర్స్, పోలిటికల్ సపోర్టుతో చేసేవారికి బుద్ది చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుంది. 122 బోట్లు పనిచేస్తున్నాయి. అనేక డ్రోన్లు పనిచేస్తున్నాయి. ఆహార పొట్లాలను హైజీనిక్‌గా అందించగలిగాం. శానిటేషన్ కోసం డ్నోన్లను వాడుతున్నాం. 29 మంది చనిపోయారు. వారికి ఎక్సగ్రేషియా చెల్లించాం. వరద ప్రాంతాల్లో చాలా వరకు నీళ్లు తగ్గాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో మీ మీడియాకు అర్ధం కావాలి’’ అని చంద్రబాబు అన్నారు.