Share News

పోలవరానికి శాపం!

ABN , Publish Date - May 08 , 2024 | 06:42 AM

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్‌ టెండరింగ్‌తో బొంద పెట్టేశారు.

పోలవరానికి శాపం!

మొత్తానికే ముంచేశారు.. జగన్‌ మార్కు ‘రివర్స్‌’విధ్వంసం

  • కేంద్రం వద్దన్నా కాంట్రాక్టు సంస్థ మార్పు

  • ఈ ఐదేళ్లలో 3 శాతమైనా పూర్తికాని పనులు

  • డిజైన్లకు కూడా జల సంఘం ఆమోదం లేదు

  • అటకెక్కిన భూసేకరణ.. పునరావాసం

  • బాబు హయాంలో శరవేగంగా నిర్మాణాలు

  • హెడ్‌వర్క్స్‌ 72 శాతం పూర్తి

  • రూ.55,548 కోట్ల అంచనాలకు టీఏసీ ఆమోదముద్ర

  • జగన్‌ వచ్చాక రూ.47,725 కోట్లకు కుదింపు

  • కేంద్ర కేబినెట్‌ క్లియరెన్స్‌ తేవడంలోనూ జగన్‌ విఫలం

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్‌ టెండరింగ్‌తో బొంద పెట్టేశారు. కేంద్రం వద్దన్నా కాంట్రాక్టు సంస్థను మార్చి ఐదేళ్లుగా ఒక్క పని కూడా పూర్తి కాకుండా అటకెక్కించేశారు. నిర్వాసితులకు అదనపు సాయం అందిస్తానని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. వారిని ముంపు పాల్జేశారు. టీడీపీ హయాంలో పూర్తయిన పునరావాస కాలనీలకు మౌలిక వసతులూ కల్పించలేదు. 2017-18నాటి అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం (టీఏసీ) ఆమోదించడంలో నాటి సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కానీ అవినీతి కోసమే అంచనాలు పెంచారని ఆరోపణలు గుప్పించిన జగన్‌.. తీరా గద్దెనెక్కాక అవే అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరడం గమనార్హం. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన సవరణ కమిటీ.. అంచనా వ్యయాన్ని రూ.47,725.61 కోట్లకు కుదించింది. కానీ కేంద్ర కేబినెట్‌ ఇంతవరకు దీనిని ఆమోదించలేదు. తరచూ ఢిల్లీ వెళ్లి సొంత కేసుల గురించి మాట్లాడుకునే జగన్‌.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వద్ద ఈ అంచనాల ఫైలు ఊసే ఎత్తడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


‘పోలవరం ప్రాజెక్టును మా నాన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. దానిని పూర్తి చేసేది ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి. భగవంతుడు ఎప్పుడో స్ర్కిప్టు రాశాడు’ అని ఐదేళ్లుగా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ సగర్వంగా ఊదరగొట్టారు. ఆ దిశగా ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు సరికదా.. అంతా ధ్వంసం చేశారు. హెడ్‌వర్క్స్‌లో కీలకమైన కట్టడం డయాఫ్రం వాల్‌ గోదావరి వరద ఉధృతికి దెబ్బతింది. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీకి గురైంది. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా.. కొత్తది కట్టాలా అన్నదానిపై ఇంతవరకు కేంద్ర రాష్ట్రాలు తేల్చలేదు. ఇది పూర్తయితేనే ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మించడం సాధ్యమవుతుంది. దానికి ఎగువ, దిగువన కాఫర్‌ డ్యాంలను నిర్మించాలి. ఇవి పూర్తయితేనే స్పిల్‌ చానల్‌ ద్వారా స్పిల్‌వే నుంచి గోదావరి జలాలు కిందికి ప్రవహిస్తాయి. ఈ పనులన్నీ ప్రొటోకాల్‌ ప్రకారం జరగాలి. కొత్తగా డిజైన్లు రూపొందించి దెబ్బతిన్న కట్టడాలను నిర్మించాలి. ఒకదాని వెంట ఒకటిగా నిర్ణీత కాల వ్యవధిలో ప్రధాన కట్టడాలను పూర్తి చేయాలంటే.. సదరు డిజైన్లను కేంద్ర జల సంఘం పరిశీలించి.. ఆమోదించి.. పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. నిర్మాణాలు మొదలు పెట్టాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని జల సంఘమే స్పష్టం చేస్తోంది. అయినా జగన్‌లో చలనం లేదు.


ఆదా చేశామని పెంచేశారు..

జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి మిగిలి ఉన్న పోలవరం హెడ్‌వర్క్స్‌ పనుల అంచనా విలువ రూ.1,771 కోట్లు మాత్రమే. నాటి నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్‌.. సవాల్‌గా తీసుకుని పనులు చేపట్టింది. కాంక్రీటు పనులను పరుగులు తీయించింది. 24 గంటల్లో 32 వేల క్యూబిక్‌ మీటర్ల సిమెంటు కాంక్రీటును వేసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 2019 జనవరి 6న ఉదయం 8 గంటలకు మొదలుపెట్టిన ఈ కాంక్రీటు పని మర్నాటి ఉదయం 8 గంటలకు పూర్తయింది. ఇదే వేగంతో పనులు జరిగి ఉంటే 2020 జూన్‌కల్లా ప్రాజెక్టు పూర్తయిపోయేది. కానీ నవయుగ సంస్థ యాజమాన్యంతో వ్యక్తిగత విభేదాల కారణంగా జగన్‌ దాని కాంట్రాక్టు రద్దు చేశారు. రివర్స్‌ టెండర్‌కు వెళ్లారు. రూ.1,771 కోట్లకు పిలిచిన రివర్స్‌ టెండర్‌ను మేఘా సంస్థకు రూ.1,548 కోట్లకు ఖరారు చేశారు. రూ.223 కోట్లు ఆదా చేశామంటూ జగన్‌ సర్కారు ఊదరగొట్టేసింది. కానీ జరిగింది వేరు. 1,548 కోట్ల అంచనాలను గుట్టుచప్పుడు కాకుండా రూ.2,300 కోట్లకు జగన్‌ పెంచేశారు. అన్నిటికంటే దారుణంగా.. గోదావరిలో దొరికే ఇసుకను ప్రాజెక్టు వద్దకు తరలించేందుకు రూ.3,500 కోట్లకు నామినేషన్‌ పద్ధతిపై పొరుగు రాష్ట్రంలోని తన అనుంగు సంస్థకు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇసుకను ఇవ్వడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంచనాలు పెంచినా.. మేఘా సకాలంలో నిర్మాణ పనులు చేపట్టలేదు. ఫలితంగా.. వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దాని మరమ్మతుపై తర్జన భర్జనపడుతున్న సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీకి గురైంది. దిగువ కాఫర్‌ డ్యాంకూ ఇదే పరిస్థితి తలెత్తింది. అనూహ్యంగా గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఇప్పుడు వీటి మరమ్మతు పనులకు రూ.21,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా.


పదే పదే వాయిదాలు..

పోలవరం పూర్తిపై జగన్‌ అసెంబ్లీలో అలవోకగా మాటమార్చుతూ అబద్ధాలాడుతూ వచ్చారు. 2019 నుంచి 2023 వరకు ఇదిగో అదిగో అంటూ వాయిదాలపై వాయిదాలు వేశారు. నిరుడు వరదలు వచ్చి నిర్వాసితులను కలవడానికి వెళ్లినప్పుడు.. ప్రాజెక్టును అనుకున్నంత వేగంగా పూర్తి చేయలేకపోయామని, 2025 ఖరీఫ్‌ కల్లా పూర్తి చేస్తామని జగన్‌ స్వయంగా చెప్పారు.


మిగిలిన ప్రాజెక్టులూ పడకేశాయి

పోలవరమే కాదు.. జగన్‌ గద్దెనెక్కాక చాలా సాగునీటి ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. చంద్రబాబు హయాంలో 70 శాతానికి మించి పూర్తయిన ఇతర పథకాలనూ ఆయన పూర్తిచేయలేదు. జలయజ్ఞంలోని 54 ప్రాజెక్టుల్లో పోలవరం సహా తొమ్మిదింటిని నవరత్నాలుగా ఎంపిక చేసి.. త్వరగా పూర్తిచేయాలనుకున్నారు. పోలవరం ముందే పడకేసింది. మిగిలిన వెలిగొండ, అవుకు టన్నెల్‌-2, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌2, గౌతు లచ్చన్న తోటపల్లి, గజపతినగరం బ్రాంచికెనాల్‌, తారకరామతీర్థసాగర్‌, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులను పూర్తి చేయడంలోనూ జగన్‌ సర్కారు పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమీక్షలు తప్ప దేనికీ రూపాయి విడుదల చేయలేదు. ఆర్భాటంగా ప్రకటించిన రాయలసీమ ఎత్తిపోతల ఎత్తిపోయింది.. వైఎ్‌సఆర్‌ పల్నాడు దుర్బిక్ష నివారణ పథకం కనుమరుగైపోయింది.. కొల్లేరు ఉప్పునీటి శుద్ధి అటకెక్కిందని నిపుణులు మండిపడుతున్నారు.


నిర్వాసితులకు అడుగడుగునా దగా..

పోలవరం నిర్వాసితులను జగన్‌ మొదటి నుంచీ మోసగిస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. వారికి 2014 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తానని.. పట్టిసీమ ప్రాంతంలో ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.19 లక్షల చొప్పున చెల్లిస్తానని.. 2006లో వైఎస్‌ హయాంలో సేకరించిన భూములకూ రూ.5 లక్షలు అదనంగా ఇస్తానని వాగ్దానాలు చేశారు. కానీ నెరవేర్చలేదు. పైగా నిరుడు నిర్వాసితులతో మాట్లాడే సమయంలో.. కేంద్రం డబ్బులిస్తేనే ఈ చెల్లింపులు చేస్తానని నిస్సిగ్గుగా చేతులెత్తేశారు.

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తే 8 మండలాలపై ప్రభావం ఉంటుంది. 222 రెవెన్యూ గ్రామాలు నీట మునుగుతాయి. ఇందులో 373 ఆవాసాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 38 ఆవాసాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 355 ఆవాసాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

మొత్తంగా 1,06,005 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించాలి. ఇప్పటి వరకూ కేవలం 12,060 కుటుంబాలనే తరలించారు. అలాగే రూ.12,096.24 కోట్లతో 1,57,766.13 ఎకరాలను సేకరించాలి. ఇందులో 1,13,119.07 ఎకరాలు సేకరించారు. ఇంకా 54,646.06 ఎకరాలు సేకరించాలి.

సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా రూ.8,113.10 కోట్లు నగదుగా

చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.831 కోట్లే ఇచ్చారు. ఇంకా 7,271.06 కోట్లు చెల్లించాలి.

ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ.13,262 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటే.. ఇప్పటిదాకా రూ.1,120 కోట్లే వ్యయం చేశారు. జగన్‌ ఇచ్చిన హామీల అమలుకు అదనంగా రూ.2,500 కోట్లు వ్యయమవుతాయని అంచనా. ఈ డబ్బునూ ఇప్పటి దాకా నిర్వాసితులకు చెల్లించలేదు.

మొత్తంగా సహాయ పునరావాస ప్యాకేజీల కోసం రూ.35,971.01 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటే.. కేవలం 7,409.58 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.28,561 కోట్లు చెల్లించకుండా వదిలేశారు.

పోలవరం నిర్వాసితులను జగన్‌ మొదటి నుంచీ మోసగిస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. వారికి 2014 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తానని.. పట్టిసీమ ప్రాంతంలో ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.19 లక్షల చొప్పున చెల్లిస్తానని.. 2006లో వైఎస్‌ హయాంలో సేకరించిన భూములకూ రూ.5 లక్షలు అదనంగా ఇస్తానని వాగ్దానాలు చేశారు. కానీ నెరవేర్చలేదు. పైగా నిరుడు నిర్వాసితులతో మాట్లాడే సమయంలో.. కేంద్రం డబ్బులిస్తేనే ఈ చెల్లింపులు చేస్తానని నిస్సిగ్గుగా చేతులెత్తేశారు.

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తే 8 మండలాలపై ప్రభావం ఉంటుంది. 222 రెవెన్యూ గ్రామాలు నీట మునుగుతాయి. ఇందులో 373 ఆవాసాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 38 ఆవాసాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 355 ఆవాసాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

మొత్తంగా 1,06,005 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించాలి. ఇప్పటి వరకూ కేవలం 12,060 కుటుంబాలనే తరలించారు. అలాగే రూ.12,096.24 కోట్లతో 1,57,766.13 ఎకరాలను సేకరించాలి. ఇందులో 1,13,119.07 ఎకరాలు సేకరించారు. ఇంకా 54,646.06 ఎకరాలు సేకరించాలి.

సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా రూ.8,113.10 కోట్లు నగదుగా

చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.831 కోట్లే ఇచ్చారు. ఇంకా 7,271.06 కోట్లు చెల్లించాలి.

హామీల అమలుకు అదనంగా రూ.2,500 కోట్లు వ్యయమవుతాయని అంచనా. ఈ డబ్బునూ ఇప్పటి దాకా నిర్వాసితులకు చెల్లించలేదు.

మొత్తంగా సహాయ పునరావాస ప్యాకేజీల కోసం రూ.35,971.01 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటే.. కేవలం 7,409.58 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.28,561 కోట్లు చెల్లించకుండా వదిలేశారు.


మినీ రిజర్వాయరు స్థాయికి..

ఖర్చు తడిసిమోపెడవుతుండడం.. కేంద్రం అంచనాలను ఇంకా ఆమోదించకపోవడంతో రెండు దఫాలుగా పోలవరాన్ని నిర్మించాలని జగన్‌ తలపోశారు. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేస్తూ 115 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తామని ప్రతిపాదించారు. తద్వారా పోలవరాన్ని మరో మినీ రిజర్వాయరు స్థాయికి దిగజార్చారు. ఈ 41.15 మీటర్ల కాంటూరులోనూ సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రూ.8,462.33 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటే.. రూ.5,510.60 కోట్లే ఖర్చు చేశారు. ఇందులో సింహభాగం గత ప్రభుత్వ హయాంలోనే చెల్లించారు. జగన్‌ సర్కారు ఇంతవరకు మిగతా రూ.2,951.73 కోట్లను చెల్లించలేదు. ‘గత ప్రభుత్వంపైనా.. కాంట్రాక్టు సంస్థపైనా కక్షతో వ్యవహరించకుండా.. నిర్మాణ పనులను యథాతథంగా కొనసాగించి ఉంటే.. 2020 నవంబరు నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. అటు ఇచ్ఛాపురం వరకు, ఇటు కృష్ణా డెల్టా వరకు గోదావరి జలాలు గలగలా పారేవి. అప్పుడు కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించడానికి ఆస్కారం ఉండేది. కరువుసీమ సస్యశ్యామలం కావడానికి దోహదపడేది. కానీ జగన్‌ కక్షపూరిత చర్యలతో పోలవరం నాశనమైంది’ అని సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 08 , 2024 | 06:42 AM