Share News

సెలవులతో సరి!

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:39 AM

జగన్‌ ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై గనుల శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం సెలవులపై పంపిస్తోంది.

సెలవులతో సరి!

గనుల శాఖలో అవినీతి అధికారులకు సెలవులు

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు

ఇప్పటికే రెండు విడతల్లో 28 మంది ఇంటికి

వారిలో ఇద్దరికి 3 నెలల తర్వాత పోస్టింగ్‌

తాజాగా 13మందితో జాబితా సిద్ధం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై గనుల శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం సెలవులపై పంపిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో ఇద్దరిని, రెండో విడత 26 మందిని సెలవుపై పంపింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండా అధికారులను వ్యక్తిగతంగా పిలిచి... ‘మీరు కొంతకాలం సెలవు తీసుకోవాల్సిందే’ అని చెబుతున్నారు. తాజాగా ఎనిమిది జిల్లాల్లో గనుల శాఖ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 13 మంది అధికారులను సెలవుపై పంపించేందుకు మరో జాబితా సిద్ధమవుతోంది. త్వరలో ఒక్కొక్కరినీ పిలిచి సెలవుపై వెళ్లాలని గనులశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిసింది. అయితే జగన్‌ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ సెలవుపై పంపుతున్న వారిపై ఏసీబీ, విజిలెన్స్‌ విచారణ ఎందుకు చేపట్టడం లేదు? సెలవుపై పంపిస్తే వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు సరి అయిపోతాయా? లేక తెరవెనక మరేదైనా గూడుపుఠాణి జరుగుతోందా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డికి అనుకూలంగా వ్యవహరించి, వైసీపీ నేతలతో అంటకాగి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం 28 మంది అధికారులను సెలవుపై పంపింది. వారిలో ఇద్దరిని 3 నెలల తర్వాత తిరిగి ఉద్యోగంలోకి తీసుకోగా, మరో 26మంది ఇంకా సెలవులోనే ఉన్నారు. శాఖలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, విజిలెన్స్‌ ఆఫీసర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వంటి అధికారులు ఇందులో ఉన్నారు. వీరంతా అక్రమాలకు పాల్పడటం నిజమైతే, ఈ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో దర్యాప్తు చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. వారివల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరిగితే, అది ఎంతో నిగ్గుతేల్చి రికవరీ చేసే అవకాశమూ ఉంది. ఇవేవీ చేయకుండా, వారిని సెలవు పేరిట పంపించడంపై గనుల శాఖ వర్గాల్లో అనేక రకాల చర్చలు సాగుతున్నాయి.

అంతా అనుమానాస్పదం

గత ప్రభుత్వంలో వెంకటరెడ్డితో పాటు అనేక అంశాల్లో సూత్రధారులు, పాత్రధారులుగా వ్యవహరించిన వారికి కూటమి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో ఒక మంత్రి, ఆయన అనుచరులతో అంటకాగిన అధికారిపై చర్యలు తీసుకున్నట్లే తీసుకొని, తర్వాత ఆయనకు రెండు కీలక పోస్టులు కట్టబెట్టారు. ఆయనపై విచారణ చేస్తే కనీసం రూ.300 కోట్ల అక్రమాస్తులు బయటకొస్తాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. అలాంటి వ్యక్తికి రెండు జిల్లాల కీలక బాధ్యతలు అప్పగించడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకే అంశంలో గనుల శాఖ పెద్దలు కొందరి విషయంలో ఒకలా, మరికొందరి పట్ల మరోలా ప్రవర్తిస్తుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Updated Date - Dec 20 , 2024 | 05:39 AM