విశాఖలో కొకైన్ కలకలం
ABN , Publish Date - Mar 22 , 2024 | 04:03 AM
ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది.
విశాఖ కేరాఫ్ కొకైన్
దక్షిణ అమెరికా బ్రెజిల్‌లో బయల్దేరిన ‘సరుకు’! దక్షిణ భారతంలో... తూర్పు తీరంలోని విశాఖ పోర్టుకు చేరింది! ఒక కంటైనర్‌లో 25వేల కిలోల డ్రై ఈస్ట్! అందులోనే... గుట్టుచప్పుడు కాకుండా ‘కొకైన్’! ఇప్పటిదాకా వెతికింది 20 బస్తాలనే! మొత్తంగా వెతికితే ఎన్ని వందలు, వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ దొరుకుతుందో! ఇదో అంతర్జాతీయ సంచలనం! ఒకవైపు సీబీఐ, కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మరోవైపు తగదునమ్మా అంటూ రాష్ట్ర పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రక్రియను జాప్యం చేయాలని ప్రయత్నించడం గమనార్హం!
డ్రై ఈస్ట్ మాటున గుట్టుగా సరఫరా
బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక
25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కలిపి రవాణా
‘ఆపరేషన్ గరుడ’లో ఇంటర్‌పోల్ సమాచారం
రంగంలోకి దిగి పట్టుకున్న సీబీఐ
డ్రై ఈస్ట్‌లో కలిపింది కొకైనేనని నిర్ధారణ
సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ పేరిట బుకింగ్
కంటెయినర్‌ను పరిశీలిస్తున్న సమయంలో
విచారణకు అడ్డుపడిన ఏపీ అధికారులు
సరుకు తడిసిపోతుంది రేపు చూసుకుందాం
అంటూ ఆక్వా కంపెనీ ప్రతినిధుల హడావుడి
తెర వెనుక వైసీపీ పెద్దలున్నారనే అనుమానం
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. సుమారు 25 వేల కిలోల ‘డ్రై ఈస్ట్’తో కలిపి ఉన్న కొకైన్‌ను స్వాధీనం చేసుక్నుట్టు వెల్లడించారు. అయితే ఎంతమొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి షిప్ కంటైనర్‌లో భారీ పరిమాణంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు పసిగట్టిన ఇంటర్‌పోల్.. ఢిల్లీలోని సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సీబీఐ అధికారులు.. కస్టమ్స్ అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోని సరకును పరిశీలించేందుకు ఈ నెల 19న ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు. సుమారు 25 వేల కిలోల (ఒక్కొక్కటి 25 కిలోలున్న వెయ్యి బ్యాగులు) ఇన్‌యాక్టివ్ డ్రై ఈస్ట్‌తో నార్కోటిక్స్ డ్రగ్స్‌ను కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.
వారి ముందే కంటెయినర్ ఓపెన్
లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ వ్యాపార అవసరాల కోసం ‘డ్రై ఈస్ట్’ను ఆర్డర్ చేసింది. అందులో డ్రగ్స్ కలిపి బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి రవాణా చేసినట్టు ఇంటర్‌పోల్ నుంచి సమాచారం రావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి కంటెయినర్ టెర్మినల్‌కు ఆ సరకు ఈ నెల 16వ తేదీనే రాగా కస్టమ్స్ అధికారుల సాయంతో గుర్తించి పక్కన పెట్టించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు సరకు తెప్పించుకున్న ఆక్వా కంపెనీ ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలోనే బుధవారం ఉదయం కంటెయినర్ (నంబర్ ఎస్‌ఈఆర్‌యూ 437538) తెరిచారు. అందులో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ కూడా ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆక్వా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా, తాము ఆక్వాకల్చర్ వ్యాపారం చేస్తున్నామని, తొలిసారిగా దీన్ని తెప్పించుకున్నామని చెప్పినట్టు తెలిసింది.
ఇదే మొదటిసారా..?
ఒక ఆక్వా సంస్థ 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌ని వేరే దేశం నుంచి తెప్పించుకోవడం అధికార వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆరా తీస్తున్నారు. విశాఖలో, ఇతర జిల్లాల్లో కూడా ఆక్వా సంస్థలు డ్రై ఈస్ట్‌ని ఉపయోగిస్తున్నాయా..?, అయితే వారికి అది ఎక్కడి నుంచి వస్తోంది..?, ఎంత మొత్తంలో తెప్పిస్తున్నారు..? దానితో కూడా వ్యాపారం చేస్తున్నారా..? తదితర అంశాలపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పట్టుబడింది కొకైనే నిర్ధారించిన సీబీఐ
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరుగుతోంది. లాసన్స్‌బే కాలనీలో గల సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ బ్రెజిల్ నుంచి ‘డ్రై ఈస్ట్’పేరుతో ఒక కంటెయినర్ తెప్పించుకోగా అందులో కొకైన్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఇది కూడా చాలా గమ్మత్తుగా బయటపడడం గమనార్హం. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్‌పోల్ నుంచి ఈ నెల 18న సీబీఐకి సమాచారం వచ్చింది. అప్పటికి రెండు రోజుల ముందే ఆ నౌక ఇక్కడి కంటెయినర్ టెర్మినల్‌కు చేరింది. సీబీఐ అధికారులు మరుసటిరోజే (19వ తేదీ మంగళవారం) లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటెయినర్‌పై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. విజిలెన్స్ అధికారులను కూడా తీసుకువెళ్లారు. సంధ్య సంస్థ తరపున వైస్ ప్రెసిడెంట్ ఆర్‌వీఎల్‌ఎన్ గిరిధర్, ఆయనతో పాటు తోడుగా పూరీ శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్‌కుమార్‌లు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందరి ముందు కంటెయినర్‌ని తెరిచారు. అందులో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచులను 20 పాలెట్లలో సర్దారు. ఒక్కో పాలెట్ నుంచి ఒక సంచిని సీబీఐ అధికారులు పరీక్షించారు.
అడ్డుపడిన ఏపీ అధికారులు
అప్పటికే అక్కడికి వచ్చిన పోర్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరికొందరు అధికారులు సీబీఐ అధికారులు తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు. వైసీపీ పెద్దల సూచనతో ఆగమేఘాలపై అక్కడికి వచ్చిన ఏపీ అధికారులు విచారణ ముందుకు సాగకూడదని విఫలయత్నం చేశారు. సంధ్య సంస్థ ప్రతినిధులు కూడా వర్షం పడేలా ఉందని, బయటకు తీసిన సరకు మళ్లీ కంటెయినర్‌లో పెట్టేయాలని, తర్వాత విచారణ చేసుకోవచ్చని సీబీఐ అధికారులను ప్రాధేయపడ్డారు. అయితే సీబీఐ అధికారులు ఇవేమీ వినకుండా.. తమ వెంట తీసుకువెళ్లిన కిట్ల ద్వారా 20 పాలెట్లను పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం ‘కొకైన్’ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. దాంతో అధికారులు అదే విషయాన్ని విచారణ నివేదికలో రాసి, సంధ్య సంస్థ తరఫున వచ్చిన వారితో సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ మాట్లాడుతూ.. డ్రై ఈస్ట్‌ని తాము దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారని, అందులో ఏముందో తమకు తెలీదని చెప్పారు. పోర్టు అధికారులు మాత్రం చాలాకాలంగా ఈ సంస్థ డ్రై ఈస్ట్‌ని తెప్పించుకుంటుందని చెప్పడం గమనార్హం.
అడ్డం పడింది పోలీసులేనా..?
పోర్టులో సీబీఐ విచారణ జరుగుతుందని తెలియగానే ఒక ఐజీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అధికారులు, పోర్టు అధికారులు అంతా అక్కడకు చేరుకున్నారు. ఏపీ రాష్ట్ర అధికారుల్లో కొందరు అక్కడ దొరికిన కొకైన్ శాంపిల్ కావాలని కోరారు. దానికి సీబీఐ అధికారులు నిరాకరించారు. సాధారణంగా సీబీఐ విచారణ చేస్తున్నప్పుడు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అనుమతించరు. ఈ విషయం పోలీసు పెద్దలకు కూడా తెలుసు. అయినా సరే పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని, సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, అందుకే కేసును మాఫీ చేయడానికి పోలీసు పెద్దల ద్వారా ప్రయత్నం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25వేల కిలోల డ్రై ఈస్ట్ మాటున కొకైన్‌ను కంటెయినర్ ద్వారా తెప్పించారని తేలింది. ఇలాంటివి నెలకు ఐదు నుంచి ఆరు కంటెయినర్లు వస్తున్నాయని సమాచారం. అంటే భారీఎత్తున విశాఖకు డ్రగ్స్ దిగుమతి చేసి వ్యాపారం చేస్తున్నట్టు అర్థమవుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు సీబీఐ నడుం కట్టింది.
పీఐబీ నిజనిర్ధారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ, మార్చి 21: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో నిజనిర్ధారణ విభాగాన్ని (ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్) ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తప్పుడు వార్తల వ్యాప్తిని (ఫేక్ న్యూస్) అరికట్టే పేరుతో ఐటీ సవరణ చట్టం నిబంధనల కింద ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. సదరు నిజనిర్ధారణ విభాగం ఏర్పాటుకాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఇంతకుముందే బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనికి హైకోర్టు ఈ నెల 11న నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయటంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపి కేంద్రం నోటిఫికేషన్‌పై స్టే విధించింది. విచారణ సందర్భంగా.. ఈ అంశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఏ) కీలకమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తు చేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు తుది తీర్పును ఇచ్చే వరకూ స్టే అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది.
ఐటీ చట్టానికి సవరణలు: గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖ ‘ఐటీ నిబంధనలు, 2021’ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు, నకిలీ వార్తలను గుర్తించి ఆయా సోషల్ మీడియా వేదికలను హెచ్చరించటానికి వీలుగా ఒక నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఈ నిబంధనల్లో పేర్కొంది. సదరు విభాగం ఫేక్‌న్యూ్‌సగా గుర్తించిన వాటిని సోషల్ మీడియా వేదికలు తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే వాటికి ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన రక్షణను వదులుకోవాల్సి ఉంటుంది. అంటే, ఆయా వార్తలకు సంబంధించి కోర్టుల్లో దాఖలయ్యే కేసులు, ప్రభుత్వం తీసుకునే చర్యలను ఆయా వేదికలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం నిబంధనల్లో తెలిపింది. ఇది దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తుందని, ప్రభుత్వ పనితీరుపై విమర్శలను ఫేక్‌న్యూస్ పేరుతో తొలగించి, సదరు వ్యక్తులను అణచివేయటానికి ఆస్కారం కల్పిస్తుందని అప్పట్లో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.