Share News

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:38 AM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు శుక్రవారం కంకిపాడు మండలంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 మంది రైతుల నుంచి రూ.41లక్షల విలువైన ధాన్యం కొన్నారు. రూ. 20 లక్షల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం లభ్యత ఆధారంగా కేంద్రాలను పెంచుతూ ఈ ఏడాది 302 కేంద్రాల ద్వారా 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం అడుగులు ముందుకు వేస్తున్నారు.

 ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

- తొలిరోజు రూ.41 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు

- రూ.20 లక్షలు రైతుల ఖాతాల్లో జమ

-302 కేంద్రాల ద్వారా 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం

- మరో వారం రోజుల్లో వరికోతలు ముమ్మరం

- వాతావరణంలో మార్పులతో రైతుల్లో గుబులు

- జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్న మండపేట వ్యాపారులు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు శుక్రవారం కంకిపాడు మండలంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 మంది రైతుల నుంచి రూ.41లక్షల విలువైన ధాన్యం కొన్నారు. రూ. 20 లక్షల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం లభ్యత ఆధారంగా కేంద్రాలను పెంచుతూ ఈ ఏడాది 302 కేంద్రాల ద్వారా 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం అడుగులు ముందుకు వేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 302 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిరోజు జిల్లాలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరంభించారు. వరి కోతలు సాగే కొద్దీ ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా కేంద్రాలను పెంచుతామని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ సృజన తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగులను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

వణికిస్తున్న వాతావరణం

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. కంకిపాడు, ఉయ్యూరు పామర్రు, మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, ఘంటసాల తదితర మండలాల్లో తక్కువ రోజుల వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలు వేయడంతో ఆయా పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో హర్వెస్టర్ల ద్వారా వరికోతలు పూర్తి చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ముందస్తుగా వరినాట్లు పూర్తి చేసిన పొలాలు కోతకు వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో వరికోతలు చేపట్టాలా, వాయిదా వేయాలా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. శుక్రవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. శని, ఆదివారాల్లో కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన ఒకమోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరికోతలు పూర్తి చేసిన అనంతరం ధాన్యం పొలంలో నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం కష్టతరమవుతుందని రైతులు చెబుతున్నారు. యంత్రాలతో వరికోతలు పూర్తిచేయడంతో ధాన్యంలో తేమశాతం అధికంగా ఉంటోంది. వర్షం కురుస్తుండటంతో ధాన్యం ఆరబెట్టేందుకు అవకాశం లేని స్థితి నెలకొంది.

బ్యాంకు గ్యారెంటీలు సమర్పించింది 23 మంది మిల్లర్లే

జిల్లాలో 149 రైస్‌ మిల్లుల ద్వారా ఈ ఏడాది ధాన్యం ఆన్‌లైన్‌ పద్ధతిలో కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే అకాశం ఉంటే ధాన్యం తడవకుండా ఉండటం కోసం మిల్లులకు ధాన్యం త్వరితగతిన తరలించేందుకు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం వాతావరణం కొంతమేర అనుకూలంగా లేకపోవడంతో టార్ఫాలిన్‌లను అందుబాటులో ఉంచి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. తొలివిడతగా వరికోతలు ప్రారంభమైన కంకిపాడు, ఉయ్యూరు గన్నవరం, మచిలీపట్నం ప్రాంతాల్లోని 23 మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీగా రూ.57.35 కోట్లు శుక్రవారం నాటికి చూపారు. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ చూపితేనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన గన్నీ బ్యాగులను ఇస్తారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎఫ్‌టీపీ జనరేట్‌ అవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం బిల్లులు జమచేయడానికి అవకాశం ఉంటుంది. తొలిరోజు రూ.41లక్షల విలువైన 175 టన్నుల ధాన్యం 20 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ.20లక్షలను రైతుల ఖాతాల్లో జమచేశారు.

మండ పేటకు ధాన్యం

యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేసిన ప్రాంతాల నుంచి మండపేటకు చెందిన వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. 75 కిలోల బస్తాకు రూ.1,725 మద్దతు ధరగా చెల్లించాల్సి ఉండగా, తేమశాతం అధికంగా ఉన్న నేపథ్యంలో బస్తా ధాన్యం రూ.1,400లకు ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. స్థానిక మిల్లర్లు, వ్యాపారులు బస్తా ధాన్యం రూ.1,450 నుంచి 1,500లకు కొనుగోలు చేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షం కురిస్తే ధాన్యం తడిచి మరింతగా ధర తగ్గుతుందని, ధాన్యంలో తేమశాతం ఇప్పట్లో తగ్గదనే కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులుఽ తక్కువ ధరకు ధాన్యం విక్రయించేస్తున్నారు.

ఆంక్షలు ఎత్తివేయాలి

రైతులు పండించిన ధాన్యం తమకు ఇష్టం వచ్చిన మిల్లులకు, ఇష్టం వచ్చిన ధరకు విక్రయించుకునేలా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అవకాశం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. గతేడాది మిల్లర్లు ఎంతమేర లెవీ బియ్యం ఇచ్చారో అంతమేర మాత్రమే ఈ ఏడాది ధాన్యం మిల్లింగ్‌కు అనుమతులు ఇస్తామనే మెలిక పెట్టారు. దీంతో రైతుల నుంచి స్థానిక మిల్లర్లు అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. జిల్లా యూనిట్‌గా పరిగణించి రైతులు తమకు మద్దతు ధర అధికంగా ఇచ్చే మిల్లులకు ధాన్యం విక్రయించేలా నిబంధనలు సడలించాలని, మిల్లు యజమానులు, రైతులు కోరుతున్నారు. గతేడాది డిసెంబరు మొదటివారంలో కురిసిన భారీవర్షాల కారణంగా ధాన్యం తడిచిపోవడంతో జిల్లాకు చెందిన మిల్లర్లకన్నా, తిరుపతి, మండపేటకు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు జిల్లారైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మిల్లులు లెవీ బియ్యంను పూర్తిస్థాయిలో మరపట్టలేకపోయాయి గతేడాది లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిస్థాయిలో రైతులనుంచి ఈఏడాది ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మిల్లరు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:39 AM