పనులు నేను చేస్తే... బిల్లులు వైసీపీ నేతలు తీసుకున్నారు
ABN , Publish Date - Nov 20 , 2024 | 06:02 AM
‘మా గ్రామంలో నేను సిమెంటు రహదారుల పనులు చేశా. ఆ పనులకు వైసీపీ నేతలు బిల్లులు తీసుకున్నారు’ అని ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు.
టీడీపీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘మా గ్రామంలో నేను సిమెంటు రహదారుల పనులు చేశా. ఆ పనులకు వైసీపీ నేతలు బిల్లులు తీసుకున్నారు’ అని ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మాజీ మంత్రి పీతల సుజాత మంగళవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తిరుపతి జిల్లా చిన్న గొట్టుగల్లు మండలం జంగావాండ్లపల్లె గ్రామ పంచాయితీకి చెందిన బి.ప్రతాపరెడ్డి ఫిర్యాదు చేస్తూ... ‘2017-18లో చినిగేపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు’ అని వాపోయారు. అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, చోడవరం రెల్లి వీధికి చెందిన సోమాదుల కృప మాట్లాడుతూ, ‘మా కుమారుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు మాత్రం అది రోడ్డు ప్రమాదం అంటూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. నా కుమారుని చావుకు కారణమైన వారిని పట్టుకొని శిక్షించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ‘నా భూమిని లీజుకు తీసుకొన్న వైసీపీ నేతలు దానిని తప్పుడు పత్రాలతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది’ అని చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం, పెద్ద రాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని వారు కోరారు. క్లాప్ వాహనాల డ్రైవర్లు, సూపర్‌వైజర్లను ఏజెన్సీల పరిధి నుంచి మార్చి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించేలా చూడాలని కొందరు విజ్ఞప్తి చేశారు.