Share News

బాధితులుగా మారుతున్న వినియోగదారులు

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:18 AM

లోన యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకున్న వినియోగదారులు వాటిని చెల్లించే క్రమంలో బాధితులుగా మారుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు.

 బాధితులుగా మారుతున్న వినియోగదారులు

లోన యాప్స్‌ ఒత్తిళ్లతో బలవన్మరణాలు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), నవంబరు 21(ఆంధ్రజ్యోతి) : లోన యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకున్న వినియోగదారులు వాటిని చెల్లించే క్రమంలో బాధితులుగా మారుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు. కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం యాప్స్‌ ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ దేశంలోనే పెద్ద స్కాంగా పరిగణించాల్సిన అవసరముందని సభాపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇనస్టంట్‌ లోన్లు తీసుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని.. రాష్ట్రంలో ఎనిమిది మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. బెంగుళూరు, బిహార్‌, తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు రెండు వందల షెల్‌ కంపెనీల నుంచి ఈ లోన యాప్స్‌ పుట్టుకొస్తున్నాయని, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రతి ఒక్క జిల్లాలో సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషనలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించి సమాధానం ఇచ్చారు. ఆర్థిక నేరాలకు పా ల్పడిన 199 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

చిన్నారి వైద్యానికి రూ.10 లక్షల నిధులు

నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నరసింహుడు, నాగవేణిల కుమార్తె లక్ష్మీ ధనుషిక వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల నిధులను విడుదల చేశారు. పేద దంపతుల చిన్నారి లక్ష్మీ ధనుషిక ఆరోగ్యం విషమిస్తుండడంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవ తీసుకుని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను, సంబంధిత అనుమతి పత్రాలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా నరసింహుడు, నాగవేణిలు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 12:18 AM