కలుషిత నీరు ప్రాణం తీసింది
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:27 AM
హొళగుంద మండలం నేరణికి తండాలో కలుషిత నీరు తాగి సోమవారం ఓ వృద్ధురాలు మృత్యువాతపడింది.
వాంతులు, విరేచనాలతో వృద్ధురాలి మృతి
అదే లక్షణాలతో మరికొందరు ఆసుపత్రిపాలు
స్పందించని అధికారులు
హొళగుంద, జూన్ 17: హొళగుంద మండలం నేరణికి తండాలో కలుషిత నీరు తాగి సోమవారం ఓ వృద్ధురాలు మృత్యువాతపడింది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రి భాయి (60)అనే వృద్ధురాలు కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరేచనాలతో మూడురోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఆలూరు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చారు. మళ్లీ వాంతులు, విరేచనాలు అధికం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుళాయిలకు సరఫరా అయ్యే నీరు కలుషితం కావడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామానికి చెందిన శాంతా బాయి, పావని బాయి, లక్ష్మిబాయితో పాటు ఓ ఐదేళ్ల బాలుడు హొళగుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. అలాగే వీరితోపాటు సుమారు పది మందికి పైగా వాంతులు, విరేచనాలతో ఆలూరు ప్రభుత్వ అసుపత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నీరు కలుషితం కావడం వల్లే వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులపాలు అయ్యారని భయాందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వైద్యశిబిరం ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆదోని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్ సత్యవతిని వివరణ కోరగా ఆసుపత్రిలో ఓపీల ద్వారా వైద్యం చేస్తున్నామని, అలాగే గ్రామంలో ఏఎన్‌ఎమ్ ద్వారా మందులు అందిస్తున్నామని తెలిపారు. పారిశుధ్యం పనులు చేయాలని ఎంపీడీవోకు, పంచాయతీ అధికారులను కోరామని పేర్కొన్నారు.