రాజధానిలో డీసీ పనులపై సీఆర్‌డీఏ సమీక్ష
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:45 AM
అమరావతి రాజధానిలో ఇతర శాఖల పర్యవేక్షణలో చేపట్టే డిపాజిటరీ కంట్రిబ్యూషన్(డీ సీ) పనులపై సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రాజధానిలో ప్రస్తుతం డీసీ విధానంతో ఏపీ ట్రాన్స్‌కో భూగర్భ విద్యుత్ లైన్లు, టవర్ల మార్పిడి వంటి పనులు చేపడుతోంది.
ఒక్క ట్రాన్స్‌కోనే 8 వేలకోట్ల పనులు
అంచనాలను పెంచిన నేపథ్యంలో ఆరా
పవర్‌గ్రిడ్, ట్రాన్స్‌కో లైన్ల మార్పిడి అంచనాలలో మెటీరియల్ స్ర్కాప్ చూపలేదని గుర్తింపు
లైన్లకు 40 శాతం లేబర్ కాస్ట్ పెంపుదల
సీఆర్‌డీఏపై 370 కోట్ల అదనపు భారం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అమరావతి రాజధానిలో ఇతర శాఖల పర్యవేక్షణలో చేపట్టే డిపాజిటరీ కంట్రిబ్యూషన్(డీ సీ) పనులపై సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రాజధానిలో ప్రస్తుతం డీసీ విధానంతో ఏపీ ట్రాన్స్‌కో భూగర్భ విద్యుత్ లైన్లు, టవర్ల మార్పిడి వంటి పనులు చేపడుతోంది. ట్రాన్స్‌కో పిలిచిన టెండర్లలో పలు లోపాలను సీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. తద్వారా రూ.370 కోట్ల అదనపు భారం పడుతోందని అంచనా వేశారు. డీసీ విధానంలో సీఆర్‌డీఏ డబ్బులు ఖర్చు చేస్తుండగా.. పనులు మాత్రం ఆయా శాఖల నేతృత్వంలో జరుగుతున్నాయి. ఒక్క ఏపీ ట్రాన్స్‌కో ద్వారానే రూ.8 వేల కోట్ల వ్యయంతో సీఆర్‌డీఏ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. రానున్న రోజులలో మరికొన్ని శాఖల ద్వారా చేయించే పనులు కూడా ఉన్నాయి. టెండర్ల దగ్గర నుంచి అన్నీ సంబంధిత శాఖలే నిర్వహించాల్సి ఉంటుంది. టెండర్ల అంచనాలను ఏ విధంగా నిర్దేశించారన్న దానిపై సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏపీ ట్రాన్స్‌కో పిలిచిన టెండర్లు వివాదాస్పదం కావటంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు వాటిని సమీక్షించగా పలు లోపాలు బయట పడ్డాయి. సీఆర్‌డీఏకు భారీగా నష్టం జరుగుతోందని గుర్తించారు. అలాగే మిగిలిన శాఖలు పిలవబోయే టెండర్లను కూడా పరిశీలిస్తున్నారు.
సీఆర్‌డీఏపై అదనపు భారం
ట్రాన్స్‌కో పిలిచిన టెండర్లలోని లోపాలను సీఆర్‌డీఏ గుర్తిస్తోంది. తాజాగా ట్రాన్స్‌కో పిలిచిన టెండర్లలో ట్రాన్స్‌మిషన్ టవర్ల స్ర్కా్ పను తగ్గించి చూపకపోవటాన్ని అధికారులు గుర్తించారు. రాజధానిలో భవన నిర్మాణాలకు విఘాతంగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను ఉన్నచోట నుంచి మార్చాలని నిర్ణయించారు. ఆ మేరకు 60 కిలోమీటర్ల పొడవున వేర్వేరుగా మూడు టెండర్లు పిలిచారు. ఈ పనులకు అంచనాలలో ట్రాన్స్‌కో ఎక్కడా కూడా స్ర్కాప్ మెటీరియల్‌ను పొందు పరచలేదు. స్ర్కాప్ మెటీరియల్ అనేది అంచనాల నుంచి తగ్గించాలి. దీనివల్ల సీఆర్‌డీఏపైన భారం కొంత తగ్గుతుంది. ఈ స్ర్కాప్ మెటీరియల్ చూపకపోవటం వల్ల సీఆర్‌డీఏపై రూ.70 కోట్ల భారం పెరిగింది. ఇక సీఆర్‌డీఏ పరిధిలో రూ.8 వేల కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో పనులు చేపడుతుండగా, ఇందులో సుమారుగా రూ.2 వేల కోట్ల విలువైన లేబర్ పోర్షన్ ఉంటుంది. లైన్ల పనులకు ట్రాన్స్‌కో 40 శాతం లేబర్ పోర్షన్‌ను పెంచటాన్ని సీఆర్‌డీఏ గుర్తించింది. మార్గదర్శకాల ప్రకారం లైన్లకు లేబర్ పోర్షన్ 20 శాతమే నిర్దేశించి ఉందని గతంలో ఇదే ట్రాన్స్‌కో అధికారులు సమాచార హక్కుచట్టం కింద సమాచారం ఇచ్చారు. సబ్‌స్టేషన్ల వంటి వాటికి మాత్రమే 40 శాతం వర్తింపు ఉంటుందని తెలిపారు. లైన్లకు 40 శాతం లేబర్ పోర్షన్ ఉండదని స్పష్టం చేశారు. మరి లైన్లకు 40 శాతం ఎందుకు పెంచారన్నది కూడా సీఆర్‌డీఏ ఆరా తీస్తోంది. ఒక్క సీఆర్‌డీఏ పరిధిలోనే లైన్లకు 40 శాతం విధించి.. మిగిలిన చోట్ల 20 శాతం వర్తింపు చేయటం వల్ల భారీగా భారం పడుతోందని గ్రహించింది. సీఆర్‌డీఏ పరిధిలోని లేబర్ పోర్షన్‌లో 300 కోట్ల దాకా భారం పడినట్టు అంచనా వేసింది.
అయీమా ప్రకారమే ధరలు: ట్రాన్స్‌కో
అమరావతిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ల పనులపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన అండర్ గ్రౌండ్ దందా కథనంపై ట్రాన్స్‌కో స్పందించింది. అండర్ గ్రౌండ్ లైన్లకు నిర్దేశించిన అంచనాలు ఇండియన్ ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఈఈఎంఏ) నిర్దేశించిన ప్రకారం నిర్ణయించినట్టు తెలిపింది. 2018లో బేసిక్ ధర రూ.1,17,69,531లు ఉండగా జీవీపీఆర్ అనే సంస్థ 30.52 శాతం పెంపుతో కోట్ చేసినట్టు వివరించింది. దీని ప్రకారం అయీమా ఫార్ములాను అనుసరించి ప్రస్తుత రేటును నిర్ణయించినట్టు తెలిపింది.